ETV Bharat / bharat

ఐసిస్-కేలో భారతీయుల కీలక పాత్ర - ఆ దాడి పని కేరళవాసిదే!

author img

By

Published : Sep 4, 2021, 2:21 PM IST

Updated : Sep 4, 2021, 2:44 PM IST

అధికార గణాంకాలతో పోలిస్తే ఐసిస్-కేలో చేరిన భారతీయుల సంఖ్య అనేక రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఉగ్రవాదులతో చేతులు కలిపిన భారతీయులు క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఆత్మాహుతి దాడులకు సైతం పాల్పడుతున్నారు. తమ సంస్థలో చేరేలా నిపుణులైన ఐటీ ఉద్యోగులకు ఉగ్రవాదులు వలలు వేస్తున్నారు.

isis k indians
ఐసిస్ కేలో భారతీయులు

2021 ఆగస్టు 26... కాబుల్ ఎయిర్​పోర్ట్(kabul airport attack) వద్ద జంట ఆత్మాహుతి దాడులు జరిగిన రోజు. ఈ దాడులకు తెగబడిన ఇస్లామిక్ స్టేట్ (ఖోరసన్-ISIS-K).. అంతకు రెండు వారాల ముందే తమ గురించి తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరికలు చేసింది. "ప్రస్తుతానికి మేం తలొగ్గి ఉంటున్నాం. విదేశీ బలగాలు అఫ్గాన్ నుంచి వెళ్లిపోయిన తర్వాత మా 'పని' చేసి చూపిస్తాం" అంటూ.. ఐసిస్-కే సీనియర్ కమాండర్ ఏకంగా ఓ ఇంటర్వ్యూలోనే బెదిరించాడు. ఈ సంభాషణ వైరల్ అయింది.

అయితే, అదే ఇంటర్వ్యూలో ఐసిస్-కే కమాండర్.. తమ సంస్థలోని సభ్యుల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారతీయులు, పాకిస్థానీలు, మధ్య ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులతో(India ISIS) కూడిన 600 మంది సాయుధుల బృందానికి నేతృత్వం వహిస్తున్నట్లు చెప్పాడు. ఈ బృందంలో పాకిస్థాన్, మధ్య ఆసియా దేశాల వ్యక్తులు ఎంతమంది ఉన్నారో.. అదే సంఖ్యలో భారతీయులూ ఉన్నారని చెప్పుకోవడం గమనార్హం.

ఇదీ చదవండి: ఏంటీ ఐసిస్​-కే? తాలిబన్లకు శత్రువా?

దీన్ని బట్టి ఐసిస్​-కేలో భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉందని స్పష్టమవుతోంది. దీనిపై భారత ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదని తెలుస్తోంది. తాలిబన్లను వ్యూహాత్మక శత్రువులుగా పరిగణించే ఐసిస్​-కే(taliban isis connection)... 'రాడికల్ ఇస్లాం'ను అనుసరిస్తుంది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ లెవాంట్(ఐసిస్) అనుబంధంగా పనిచేస్తుంది. ఎయిర్​పోర్ట్​లో జరిగిన ఆత్మాహుతి దాడులతో పాటు అనంతరం జరిగిన రాకెట్ దాడులకూ తామే బాధ్యులమని ప్రకటించుకుంది. ఆత్మాహుతి దాడుల్లో సుమారు 180 మంది(kabul airport attack deaths) మరణించారు. ఇందులో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు.

పంజాబ్ నిపుణుడి కథ...

భారత్​లోని ఐటీ నిపుణులు సైతం ఐసిస్-కేలో(afghanistan isis) చేరుతున్నారని .. గతేడాది అఫ్గాన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్(ఏఐఎస్ఎస్) విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ ఐటీ నిపుణుడి కథనాన్ని ప్రస్తావించింది. 'ఆర్థిక ప్రయోజనాల కోసం నా భర్త ఐసిస్-కేలో చేరేందుకు వెళ్లాడ'ని ఐటీ నిపుణుడి భార్య వెల్లడించినట్లు పేర్కొంది. ఆ వ్యక్తి చనిపోయినట్లు సమాచారం.

లెక్కల్లో లేవు..

అయితే, భారత్​లోని అధికారిక గణాంకాల్లో మాత్రం పంజాబ్​ నుంచి ఐటీ నిపుణులు ఐసిస్-కేలో(ISIS K India) చేరినట్లు సమాచారం లేదు. ఐసిస్-కే తరపున పోరాడేందుకు భారత్​ నుంచి 28 నుంచి 30 మంది మాత్రమే దేశం విడిచి వెళ్లారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

"భారత్ నుంచి రెండు బృందాలు ఐసిస్-కేలో చేరేందుకు వెళ్లాయి. ఒక బ్యాచ్​లో 21 మంది, రెండో బ్యాచ్​లో ఏడుగురు ఉన్నారు. అఫ్గాన్​లోని ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు వెళ్లినట్లు గత ఏడాదిన్నరగా ఎలాంటి సమాచారం లేదు. కరోనా కారణంగా విమాన ప్రయాణాలు నిలిచిపోవడం ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. కానీ, మధ్య ఆసియా వంటి ప్రాంతాల నుంచి భారత సంతతి పౌరులు వెళ్లారా అనే విషయంపై సమాచారం లేదు."

-ఈటీవీ భారత్​తో సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి

పంజాబ్ ఐటీ నిపుణుడి మాదిరిగానే.. భారత గణాంకాల్లో భాగం కాని కేరళకు చెందిన మరో వ్యక్తి కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. మలప్పురానికి చెందిన సునాయిల్ ఫెవాస్ అనే ఇంజినీరింగ్ చదువుకున్న విద్యార్థి.. తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడై.. ఐసిస్-కేతో చేతులు కలిపాడు. ఈ విషయాన్ని అతనితో పాటు కాలేజీలో చదువుకున్న వ్యక్తి ఈటీవీ భారత్​తో చెప్పాడు.

"సునాయిల్​కు ప్రారంభంలో ఇలాంటి మతపరమైన ఆలోచనలు ఉండేవి కాదు. దుబాయ్​లోని జాన్సన్ కంట్రోల్స్, యూటీఎస్ క్యారియర్ వంటి సంస్థల్లో అతడు పనిచేశాడు. తన కుటుంబ సభ్యులను(నలుగురు చిన్నారులు కూడా) దుబాయ్​కు తీసుకొచ్చేశాడు. తర్వాత క్రమంగా మతపరమైన తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. 2019 మార్చిలో అతడు అఫ్గానిస్థాన్​లో ఉంటున్నాడని నాకు తెలిసింది. సునాయిల్​తో పాటు దుబాయ్, పశ్చిమాసియాలోని అనేక మంది భారత సంతతి వ్యక్తులు ఐసిస్-కేతో కలిసి ఉండొచ్చు."

-సునాయిల్ క్లాస్​మేట్

ఐసిస్-కే ఉగ్రవాద ఆపరేషన్లలోనూ భారతీయులు(indian terror attacks) చురుగ్గా పాల్గొంటున్నారు. 2020 మార్చి 25న సెంట్రల్ కాబుల్​లో ఆత్మాహుతి దాడికి పాల్పడింది భారతీయుడే. కేరళకు చెందిన అబు ఖలీద్ ఈ దాడి చేశాడు. ధర్మశాల గురుద్వారా(dharamshala gurudwara attack) లోపల జరిగిన ఈ దాడిలో 28 మంది మరణించారు. కశ్మీర్​లో ముస్లింల అణచివేతకు ప్రతీకారంగానే ఈ ఆత్మాహుతికి పాల్పడినట్లు ఐసిస్-కే దాడి తర్వాత చెప్పుకుంది.

కేరళ కాసర్​గోడ్​కు చెందిన మహ్మద్ సాజిద్ కుతిరుమ్మాల్ (అలియాస్ సాజి, సాజిద్) అనే వ్యక్తి 'అబు ఖలీద్ అల్-హిందీ'గా పేరు మార్చుకొని ఐసిస్-కే​లో చేరాడు. 2015 మార్చి 31న ముంబయి నుంచి దుబాయ్​కి వెళ్లి.. అక్కడి నుంచి ఐసిస్ ఉగ్రవాదులను కలిసినట్లు తెలుస్తోంది.

అదిరిపోయే రిక్రూట్​మెంట్ ఆఫర్లు

నిపుణులైన ఐటీ ఉద్యోగులకు వలలు వేసి తమలో చేర్చుకుంటోంది ఐసిస్-కే. భారత్​ నుంచి సంస్థలో చేరే వ్యక్తులకు ప్రారంభ వేతనం నెలకు 500 డాలర్లు (సుమారు రూ.36 వేలు) చెల్లిస్తోంది. ఓ ల్యాప్​టాప్​నూ అందిస్తోంది.

-రచయిత: సంజీవ్ కుమార్​ బారువా, సీనియర్ జర్నలిస్ట్​.

ఇవీ చదవండి:

Last Updated :Sep 4, 2021, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.