ETV Bharat / bharat

ఐరాసలో 'తృణధాన్యాల తీర్మానం' ఆమోదంపై మోదీ హర్షం

author img

By

Published : Mar 4, 2021, 9:30 PM IST

PM Modi on popularising millets
'తృణధాన్యాల ప్రాచుర్యానికి కృషిచేయడం భారత్​కు గర్వకారణం'

తృణధాన్యాల ప్రాచుర్యానికి కృషి చేయడం భారత్​కు గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో.. 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల ఏడాదిగా గుర్తిస్తూ తీర్మానం ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు.

2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల ఏడాదిగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్​ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతు పలికిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్​తోపాటు బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, నైజీరియా, రష్యా దేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. 70 దేశాలు ఈ తీర్మానాన్ని అంగీకరించాయి.

"తృణధాన్యాల ప్రాచుర్యం పెంచేందుకు భారత్​ కృషి చేయడం మంచి విషయం. వీటి ఉత్పత్తి రైతుల సంక్షేమానికి తోడ్పడుతుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలకు, అంకురాలకు ఇది పరిశోధన అవకాశాలు పెంచుతుంది."

-నరేంద్ర మోదీ, ప్రధాని.

భారత్​ తీర్మానానికి మద్దతు పలికిన వారికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాల్గొన్న అధికారులకు ఇచ్చిన తృణధాన్యాలతో చేసిన 'మురుక్కు' అందరూ రుచి చూడాల్సిన వంటకం అని అన్నారు.

తృణధాన్యాల పోషకాహార, పర్యావరణ ప్రయోజనాలను ప్రపంచానికి అందించే విషయంలో ఈ తీర్మానం ఆమోదం పెద్ద ముందడుగు అని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి ఎస్​ తిరుమూర్తి అన్నారు. సాధారణ సభలో ఈ తీర్మానానికి మద్దతు తెలిపిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:'అసభ్యత పెరిగిపోతోంది..పర్యవేక్షణ అవసరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.