ETV Bharat / bharat

శతాబ్ది ఉత్సవాల నాటికి ప్రబలశక్తిగా భారత్: మోదీ

author img

By

Published : Aug 15, 2021, 8:10 AM IST

Updated : Aug 15, 2021, 9:26 AM IST

స్వాతంత్ర్యం సాధించి వందేళ్లు అయ్యే సమయానికి భారత్ ప్రబలశక్తిగా ఎదగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ 25 ఏళ్ల కాలం అమృత ఘడియలని, ఈ సమయాన్ని సర్వ సమృద్ధ భారత్ నిర్మాణానికి ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎర్రకోట నుంచి ప్రసంగించిన ఆయన.. పలు కీలక అంశాలపై మాట్లాడారు.

MODI SPEECH
మోదీ పంద్రాగస్టు స్పీచ్

శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య ఉన్న 25 ఏళ్ల కాలాన్ని అమృత ఘడియలుగా అభివర్ణించారు. ఈ అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్ నిర్మాణానికి ఉపయోగించుకునేలా సంకల్పం తీసుకోవాలని పేర్కొన్నారు.

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ... అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. మహమ్మారిపై పోరులో వైద్యులు, వైద్య సిబ్బంది చేసిన పోరాటం అసమానమని అభినందించారు. దేశీయంగా కరోనా టీకా తయారు చేసుకోవడం గర్వకారణమని, స్వయంగా టీకా అభివృద్ధి చేసుకొని ఉండకపోతే.. పోలియో తరహా పరిస్థితి ఏర్పడేదని అన్నారు.

"శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలి. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి శతాబ్ది ఉత్సవాలకు మధ్య ఉన్న అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్ నిర్మాణం కోసం మనం పాటుపడాలి. ఈ 25 ఏళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి అడుగు కీలకమే. ఒక్క క్షణం వృథా చేయకుండా ప్రతి పౌరుడూ సంకల్ప శక్తితో ముందుకు నడవాలి. సంకల్పం తీసుకుంటే సరిపోదు.. నిరంతర శ్రమ, పట్టుదలతోనే అది సాకారం అవుతుంది. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్ కా విశ్వాస్‌.. ఇవే మన రణ నినాదం కావాలి. సమస్త పౌరుల భాగస్వామ్యంతోనే సమృద్ధ భారతం నిర్మాణం అవుతుంది."

-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

వ్యాక్సినేషన్​పై

ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్​లోనే జరగడం గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పటివరకు 54 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు. టీకాను స్వయంగా అభివృద్ధి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

"టీకా అభివృద్ధిలో పాల్గొన్న శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం. కరోనా టీకా కోసం ప్రపంచ దేశాలపై ఆధారపడే పరిస్థితి లేకుండా పోయింది. కరోనాపై పోరులో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది చేసిన పోరాటం అసమానం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

అందరికీ నల్లా నీరు

జల్ జీవన్ మిషన్ కింద గత రెండేళ్ల వ్యవధిలో 4.5 కోట్ల ఇళ్లకు నల్లా నీరు అందించినట్లు ప్రధాని తెలిపారు. 2024 నాటికి గ్రామాల్లోని అన్ని గృహాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని 2019 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు మోదీ.

పేదలకు బలవర్ధక ఆహారం..

పోషకాహార లోపం సమస్యను పరిష్కరించేందుకు 2024 నాటికి దేశంలోని పేదలందరికీ బలవర్దకమైన బియ్యం అందిస్తామని మోదీ తెలిపారు. పేద పిల్లల ఎదుగుదలపై పోషకాహార లోపం తీవ్ర ప్రభావం చూపిస్తోందని అన్నారు.

రిజర్వేషన్లు...

రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. అణగారిన వర్గాలకు ఆపన్నహస్తం అందించడం అవసరమని అన్నారు. దళితులు, ఎస్టీలు, వెనకబడిన వర్గాలు, జనరల్ కేటగిరీలోని పేదలకు రిజర్వేషన్లు అందేలా చూస్తామని స్పష్టం చేశారు.

చిన్నరైతులను దృష్టిలో పెట్టుకునే..

రోజురోజుకూ భూకమతాల పరిమాణం తగ్గుతోందని, ఈ నేపథ్యంలో చిన్న రైతులను దృష్టిలో ఉంచుకునే వ్యవసాయ పథకాలను మార్చుకోవాలని ప్రధాని పేర్కొన్నారు.

"దేశంలోని 80 శాతం రైతులు 5 ఎకరాల లోపు భూమి కలిగినవారే. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పథకాలు రూపొందించాలి. రైతులు దేశానికి గర్వకారణం అయ్యేలా పథకాలు ఉండాలి. రైతు పంటకు మంచి ధర లభించే సౌకర్యం కల్పించాలి. కిసాన్‌ బీమా, ఫసల్ బీమా రైతులకు సమర్థంగా అందేలా చూడాలి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఎర్రకోట వద్ద జరిగిన పంద్రాగస్టు వేడుకలకు ఒలింపిక్స్​లో పాల్గొన్న భారత క్రీడాకారులు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Aug 15, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.