ETV Bharat / bharat

'ప్రాంతీయ భద్రతకు పరస్పర సహకారం అవసరం'

author img

By

Published : Jan 27, 2022, 5:46 PM IST

India-Central Asia Summit: ప్రాంతీయ భద్రతకు భారత్​- సెంట్రల్​ ఆసియా దేశాల మధ్య సహకారం కీలకమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వర్చువల్​గా చేపట్టిన భారత్​-సెంట్రల్​ ఆసియా తొలి సదస్సులో కీలక అంశాలపై మాట్లాడారు.

asia summit
ప్రధాని మోదీ

India-Central Asia Summit: సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్​కు సెంట్రల్​ ఆసియా ప్రధాన కేంద్రంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​-సెంట్రల్​ ఆసియా తొలి సదస్సుకు వర్చువల్​గా నేతృత్వం వహించి పలు అంశాలపై మాట్లాడారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం, శ్రేయస్సుకు పరస్పర సహకారం అవసరమని సూచించారు.

"మనం అఫ్గానిస్థాన్​లోని పరిస్థితులపై ఆందోళన చెందుతున్నాం. అది భారత్​, సెంట్రల్​ ఆసియా మధ్య సహకారం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఇందులో ప్రాంతీయ స్థిరత్వం, భద్రత చాలా ముఖ్యం. భారత్, సెంట్రల్​ ఆసియా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు 30 ఏళ్లు ఫలప్రదంగా పూర్తిచేసుకున్నాయి. సెంట్రల్​ ఆసియా దేశాలతో భారత్​కు స్థిరమైన సంబంధాలు ఉన్నాయి. భారత ఎనర్జీ సెక్యూరిటీలో కజకిస్థాన్​ కీలక భాగస్వామి. ఇటీవల జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం తెలుపుతున్నా. "

- నరేంద్ర మోదీ, ప్రధానంత్రి.

భారత్​-సెంట్రల్​ ఆసియా సదస్సులో మూడు లక్ష్యాలను నిర్దేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

  • మొదటిది.. ప్రాంతీయ భద్రత, శ్రేయస్సుకు దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం. సమీకృత, స్థిరమైన పొరుగుదేశంగా ఉండాలనే భారత విజన్​కు సెంట్రల్​ ఆసియా కేంద్రంగా ఉంది.
  • రెండోది.. దేశాల మధ్య సహకారానికి సమర్థవంతమైన విధానం ఉండాలి. అది.. భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర చర్యల కోసం ఒక వేదిక ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుంది.
  • మూడోది.. దేశాల మధ్య సహకారానికి ప్రతిష్టాత్మకమైన రోడ్​మ్యాప్​ను సిద్ధం చేయటం. ఇది ప్రాంతీయ అనుసంధానత, సహకారం కోసం సమగ్ర విధానాన్ని అవలంబించడానికి వీలు కల్పిస్తుంది.

వర్చువల్​గా జరిగిన ఈ సదస్సుకు కజకిస్థాన్​ అధ్యక్షుడు కస్యమ్​ జొమార్ట్​ టొకయెవ్​, ఉజ్బెకిస్థాన్​ అధ్యక్షుడు శవ్కాత్​ మిర్జియోయెవ్​, తజకిస్థాన్​ అధ్యక్షుడు ఎమొమాలి రహ్మోన్​, తుర్కెమిస్థాన్​ అధ్యక్షుడు గుర్బాంగులి బెర్డిముహామెడోవ్​, కిర్గిస్థాన్​ రిపబ్లిక్​ అధ్యక్షుడు సడైర్​ జపరోవ్​ హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.