ETV Bharat / bharat

చైనా సరిహద్దులకు ఆయుధాలు తరలించాలి కదా!

author img

By

Published : Nov 12, 2021, 7:01 AM IST

supreme court
సుప్రీం కోర్టు

చైనా సరిహద్దులకు ఆయుధాలను తరలించాలనే అంశంపై సుప్రీం కోర్టుకు నివేదికను సమర్పించింది కేంద్రం. విశాల చార్‌ధామ్‌​ జాతీయ రహదారి ప్రాజెక్టుపై కూడా వివరణ ఇచ్చింది.

దేశ ఉత్తర భాగంలోని చైనా సరిహద్దుల వరకు సైన్యం క్షిపణి లాంఛర్లు, ఇతర భారీ ఆయుధాలను తరలించకుంటే.. ఒకవేళ యుద్ధం వస్తే ఎలా పోరాడగలదని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. ఇదే విషయాన్ని గురువారం సుప్రీంకోర్టుకు నివేదించింది. అదే సమయంలో విశాల చార్‌ధామ్‌ జాతీయ రహదారి ప్రాజెక్టు కారణంగా హిమాలయ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడతాయన్న ఆందోళనలను తగ్గించే ప్రయత్నం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడుతున్నాయని, కేవలం రహదారి నిర్మాణాల వల్ల మాత్రమే కాదని స్పష్టంచేసింది. ఉత్తరాఖండ్‌లోని పవిత్ర క్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లను అన్ని కాలాల్లోనూ చేరుకునే విధంగా 900 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక చార్‌ధామ్‌ ప్రాజెక్టును కేంద్రం రూ.12,000 కోట్లతో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును సవాలుచేస్తూ 'సిటిజెన్స్‌ ఫర్‌ గ్రీన్‌ డూన్‌' సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గతంలో వెలువరించిన ఆదేశాలను సవరించాలంటూ రక్షణ మంత్రిత్వశాఖ దాఖలుచేసిన అభ్యర్థనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌లు విచారణ చేపట్టారు. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు.

కేసు ఓడిపోవడం సేవాలోపం కాదు

కేసులో ఓడిపోవడాన్ని సేవాలోపంగా పరిగణించకూడదని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు న్యాయవాదిని తప్పు పట్టకూడదని తెలిపింది. "ప్రతి కేసులోనూ ఏదో ఒక పక్షం ఓడిపోతుంది. న్యాయవాది తగిన సేవలు అందించకపోవడం వల్లనే ఓడిపోయామని భావించి ఆయనపై వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టకూడదు. ఇది ఆమోదయోగ్యం కాదు" అని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఒకవేళ నిజంగా న్యాయవాది నిర్లక్ష్యం చూపి ఉంటే అప్పుడు ఆలోచించవచ్చని తెలిపింది. కేసులో ఓడిపోయిన ఓ వ్యక్తి ముగ్గురు న్యాయవాదులపై తొలుత జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేశారు. దానిని తిరస్కరించడంతో రాష్ట్ర, జాతీయ ఫోరంలను కూడా ఆశ్రయించారు. అవి కూడా తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు.

ఇదీ చదవండి:

చిన్నారి హత్యాచార కేసులో 5 రోజుల్లోనే తీర్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.