ETV Bharat / bharat

కరోనా మృతుల అంత్యక్రియలకు ఎంతకష్టమొచ్చే!

author img

By

Published : May 26, 2021, 3:00 PM IST

కరోనా మృతుల పట్ల సమాజంలో నెలకొన్న అపోహలు తారస్థాయికి చేరుతున్నాయి. కరోనా మరణం అంటే చాలు మానవత్వాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు కొందరు. గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటూ దుఃఖంలో ఉన్న మృతుల కుటుంబాలకు మానసిక క్షోభను మిగులుస్తున్నారు. మరోవైపు అంబులెన్స్ డ్రైవర్లు సైతం ఇష్టారీతిన ప్రవర్తిస్తన్న తీరు విమర్శలకు దారితీస్తోంది. కర్ణాటకలో జరిగిన వేర్వేరు ఘటనల్లో కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు పడినపాట్లు.. కరోనాపై నెలకొన్న అవగాహనారాహిత్యానికి అద్దం పడుతున్నాయి.

covid dead body
కరోనా మృతదేహాలకు ఎంతకష్టమొచ్చే..

ఆస్పత్రి సిబ్బంది పొరపాటు.. గ్రామస్థుల అమానవీయత వెరసి.. కరోనాతో మరణించిన ఓ వ్యక్తి సొంత గ్రామంలో అంత్యక్రియలకు నోచుకోని దుస్థితి. మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. గడగ్‌ జిల్లా బసలాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనా చికిత్స పొందుతూ మరణించాడు. అయితే.. కొవిడ్ నిబంధనలు పాటించకుండా మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు ఆస్పత్రి సిబ్బంది.

విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అడ్డుకున్నారు. దీంతో చేసేది లేక.. అదే అంబులెన్స్‌లో తిరిగి నగరానికి వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.

ఫుట్​పాత్​పైనే..

బెంగళూరులో కరోనాతో మరణించిన మృతదేహాన్ని ఫుట్‌పాత్‌పైనే వదిలివేశాడో అంబులెన్స్ డ్రైవర్​. అంత్యక్రియల కోసం శ్మశాన వాటికలో వేచి ఉన్న క్రమంలో.. వ్యక్తి బంధువులు ఆలస్యంగా వస్తారని భావించిన సదరు డ్రైవర్​.. శ్మశానవాటిక ఫుట్‌పాత్‌పైనే దించేసి వెళ్లిపోయాడు.

covid dead body
ఫుట్​పాత్​పై వదిలిన మృతదేహంతో

కొవిడ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు డ్రైవర్ రూ.10,000 అడిగాడని.. తమ ఆర్థిక పరిస్థితి కారణంగా రూ.3000 మాత్రమే ఇచ్చినందున ఇలా చేశాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు వీధిలో ఉన్న మృతదేహానికి అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి: 90 ఏళ్ల వృద్ధురాలిని భుజాలపై మోసుకెళ్లిన పోలీసు

ఇదీ చదవండి: చనిపోయిన వ్యక్తిలో కరోనా ఎంతసేపు ఉంటుంది?

దారిలోనే..

కరోనా నుంచి కోలుకున్న ఓ మహిళను అంబులెన్స్ డ్రైవర్ దారి మధ్యలోనే దించేసిన ఘటన కర్ణాటకలో జరిగింది. కొడగు జిల్లా మడికేరికి చెందిన 60ఏళ్ల పొన్నమ్మ 12 రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొంది ఆదివారం డిశ్చార్జ్ అయింది. ఆమెను తీసుకెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్.. కరోనా సోకుతుందనే భయంతో దారిమధ్యలోనే దించేసి తనదారిన తాను వెళ్లిపోయాడు. స్థానికులు గమనించి ఆ మహిళను ఇంటికి చేర్చారు. ఇలా మహిళను దారిలోనే వదిలేసి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

covid dead body
పొన్నమ్మను మధ్యలోనే దించేసిన అంబులెన్స్ డ్రైవర్

మరోవైపు పొన్నమ్మ డిశ్చార్జ్ గురించి ఆస్పత్రి సిబ్బంది ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.

ఇవీ చదవండి: ఆరోగ్య సేవలు అస్తవ్యస్తం

కారు సీటుబెల్టుకు కట్టి కొవిడ్ మృతదేహం తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.