ETV Bharat / bharat

Hijab row: హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ సుప్రీంలో పిటిషన్​

author img

By

Published : Feb 11, 2022, 10:58 AM IST

Updated : Feb 11, 2022, 11:42 AM IST

Hijab row
Hijab row

హిజాబ్​ వివాదంపై కర్ణాటక హైకోర్టు వెలువరించిన మౌఖిక తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది. ముస్లిం మహిళ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా తీర్పు ఉందని.. హైకోర్టు తీర్పుతో పాటు విచారణపై స్టే విధించాలని పిటిషనర్​ వ్యాజ్యం వేసింది.

Hijab Row: హిజాబ్​ వివాదంపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్​ దాఖలైంది. ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేసింది ఓ విద్యార్థిని. హైకోర్టు తీర్పు.. ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉందని పిటిషన్​లో పేర్కొంది. హైకోర్టు తీర్పుతో పాటు త్రిసభ్య ధర్మాసనం ముందు జరుగుతున్న విచారణపై స్టే విధించాలని సుప్రీం కోర్టును కోరింది.

అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సరైన సమయంలో ఈ కేసును విచారణకు అనుమతిస్తామని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. కర్ణాటకతోపాటు ఆ రాష్ట్ర హైకోర్టులో ఏం జరుగుతుందో గమనిస్తున్నామన్న ధర్మాసనం... హిజాబ్ అంశంపై సరైన సమయంలో జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. దీన్ని దేశవ్యాప్త సమస్యగా మార్చవద్దని న్యాయవాదులకు సుప్రీంకోర్టు సూచించింది.

హైకోర్టు తీర్పు

ఈ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రితురాజ్​ అవస్థి, జస్టిస్​ కృష్ణ ఎస్​ దీక్షిత్, జస్టిస్​ ఖాజీ జైబున్నీసా మొహిద్దీన్​లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. తుది తీర్పు వెల్లడించే వరకు ఎవరూ సంప్రదాయ వస్త్రాలు ధరించి విద్యా సంస్థలకు రాకూడదని మౌఖిక తీర్పు వెలువరించింది హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం. ​పిటిషనర్ల తరఫు న్యాయవాదులు దేవదత్‌ కామత్‌, సంజయ్‌ హెగ్డేల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇలా మొదలైంది హిజాబ్ వివాదం

ఈ వివాదం గతేడాది డిసెంబర్​లో ప్రారంభమైంది. ఉడిపిలోని కుందాపూర్‌లోని ఓ కళాశాల విద్యార్థినులు హిజాబ్‌ ధరించి కాలేజీకి వెళ్లగా. వారిని కళాశాల గేటు వద్దే సిబ్బంది అడ్డుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన డ్రెస్‌కోడ్‌ ప్రకారం హిజాబ్‌లు ధరించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కళాశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎంతకీ లోపలికి అనుమతించకపోవడంతో అక్కడే ఆందోళన చేపట్టారు.

ఈ వివాదం క్రమంగా పొరుగు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. దీంతో పలు చోట్ల ఓ వర్గం ప్రజలు నిరసన గళం వినిపిస్తున్నారు. రాజకీయంగానూ పెద్ద దుమారమే రేపింది. దీనిపై దేశంలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ సహా పలువురు ప్రముఖలు స్పందించారు.

ఇదీ చూడండి:

'బికినీ, జీన్స్​, హిజాబ్​.. అంతా మా ఇష్టం! మధ్యలో మీరెవరు?'

'హిజాబ్'​ వివాదం కేసు బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ

Last Updated :Feb 11, 2022, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.