ETV Bharat / bharat

మామిడి తోటలో తలలేని మృతదేహాలు.. పోలీసుల బూట్ల కింద పడి నవజాత శిశువు మృతి!

author img

By

Published : Mar 23, 2023, 8:28 AM IST

Police recover two headless bodies of women in Bihar
Police recover two headless bodies of women in Bihar

తలలేని ఇద్దరు మహిళల మృతదేహాలు మామిడి తోటలో లభ్యమయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన బిహార్​లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, వృద్ధురాళ్లపై హత్యాచారానికి పాల్పడుతున్న సీరియల్​ కిల్లర్​ స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది.

బిహార్​లో దారుణం జరిగింది. తలలేని ఇద్దరు మహిళల మృతదేహాలను ఓ మామిడి తోటలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, బాధితులను ఎక్కడో హత్య చేసి.. మామిడి తోటలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన మధుబనీ జిల్లాలో బుధవారం వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫుల్​పరాస్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పర్సా ప్రాంతంలో ఓ మామిడి తోటలో తల లేకుండా ఉన్న ఇద్దరు మహిళల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మధుబనీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియలేదని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఈ కేసుపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని పేర్కొన్నారు.

వృద్ధ మహిళలపై హత్యాచారాలు.. సీరియల్​ కిల్లర్ అరెస్టు..
వృద్ధురాళ్లపై హత్యాచారానికి పాల్పడే సీరియల్​ కిల్లర్​ అనుచరుడిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సీరియల్ కిల్లర్​ను రెండు నెలల క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబరులో బారాబంకీ జిల్లాలో రెండు వరుస హత్యలు కలకలం రేపాయి. బహిర్భుమికి వెళ్లిన వృద్ధ మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాల పోస్టుమార్టం పరీక్షల నివేదికలో.. వారిపై అత్యాచారం జరిగినట్లు తెలిసింది. దీంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అందులో ఓ సీరియల్​ కిల్లర్​ను సడ్వా బెలూ గ్రామానికి చెందిన​ అమరేంద్రగా గుర్తించారు. అతడిని పట్టిస్తే రూ. 25 వేల బహుమతి ప్రకటించి పోస్టర్లు వేశారు. కాగా, జనవరి 23న మరో మహిళపై హత్యాచారం చేస్తుండగా.. బాధితురాలు గట్టిగా అరిచింది. దీంతో గ్రామస్థులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా అమరేంద్ర స్నేహితుడు సురేంద్ర పేరు బయటకు వచ్చింది. అతడి కోసం కూడా పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దయారం పుర్వా ప్రాంత సమీపంలో బుధవారం సురేంద్రను అరెస్టు చేశారు పోలీసులు.

అమరేంద్ర, సురేంద్ర ఇద్దరు స్నేహితులు. ఓ రైల్ మిల్​లో పని చేస్తుండగా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. కొద్దికాలం సురేంద్ర సూరత్​లో ఉన్నాడు. అనంతరం సొంతూరుకు తిరిగి వచ్చాడు. ఇద్దరూ కలిసి 2022 డిసెంబర్​ 5న ఓ మహిళపై అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటనపై భయపడిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీన్ని అదునుగా భావించిన నిందితులు.. 2022 డిసెంబర్ 17 న ఓ వృద్ధురాలిపై హత్యాచారానికి ఒడిగట్టారు. 12 రోజుల తర్వాత మరో మహిళను రేప్​ చేసి హత్యచేశారు.

పోలీసు బూట్ల కింద.. నవజాత శిశువు మృతి..
ఝార్ఖండ్​లో గిరిడిహ్​ జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువు పోలీసు బూట్ల కింద నలిగిపోయింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులు వారి ఇంటికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. దీంతో ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి. నవజాత శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్రం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.