ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువులపై రూ.60వేల కోట్ల సబ్సిడీ

author img

By

Published : Apr 28, 2022, 7:03 AM IST

fertilizers subsidy

Fertilizer subsidy: ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువులపై రూ.60 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. డీఏపీ బస్తాపై సబ్సిడీ రూ.1650 నుంచి రూ.2,501కి పెంచేందుకు ఆమోదం తెలిపింది. పీఎంస్వనిధి పథకం 2024 ఆఖరు వరకు కొనసాగించనుంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 2జీ మొబైల్‌ టవర్లను ఉన్నతీకరించనుంది.

Fertilizer subsidy: ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ ఆ భారాన్ని రైతులపై పడనీయబోమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది దీనిలో భాగంగానే ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో (ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30వరకు) రైతులు కొనుగోలు చేసే డీఏపీ, ఫాస్పటిక్‌, పొటాసిక్‌ ఎరువులపై రూ.60,939.23 కోట్ల రాయితీని అందించనున్నట్లు తెలిపింది. బుధవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రి మండలి సమావేశం ఈమేరకు నిర్ణయం తీసుకొంది. డీఏపీ బస్తాపై ప్రస్తుతం ఉన్న రూ.1,650 సబ్సిడీని రూ.2,501కి పెంచింది. ఇది గత ఏడాది కంటే 50% అధికమని పేర్కొంది. డీఏపీ ధరలు, దాని ముడిసరుకు ధరలు దాదాపు 80%మేర పెరిగిన నేపథ్యంలో కేంద్రం రాయితీని పెంచింది. దీనివల్ల రైతులకు నోటిఫై చేసిన ఫాస్పటిక్‌, పొటాసిక్‌ ఎరువులు అందుబాటు ధరల్లో లభిస్తాయని తెలిపింది. పోషకాధారిత రాయితీ (న్యూట్రియంట్‌ బేస్డ్‌ సబ్సిడీ) రూపంలో రైతులకు ఈ ఎరువులను సరఫరా చేస్తారు. దీనివల్ల రైతులందరికీ అవసరమైన ఎరువులు ఇబ్బందుల్లేకుండా అందుతాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల డీఏపీ బస్తా ప్రస్తుతమున్న రూ.1350 ధరకే లభించనుంది. ధర పెరిగిన మేరకు రాయితీ అందిస్తున్నందున రైతుపై ఆ భారం పడబోదని ప్రభుత్వం తెలిపింది. ఆమోదిత ధరల ప్రకారం ఎరువుల కంపెనీలకు రాయితీ మొత్తం విడుదల అవుతుందని, వారు రైతులకు అందుబాటు ధరలో ఎరువులను సరఫరా చేస్తారని పేర్కొంది.

  • వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 2జీ మొబైల్‌ టవర్లను 4జీకి ఉన్నతీకరించడానికి (అప్‌గ్రేడ్‌కి) కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. దీనివల్ల తొలిదశలో రూ.2,426.39 కోట్లతో పది రాష్ట్రాల్లోని 2,343 టవర్లు అప్‌గ్రేడ్‌ అవుతాయి. వీటిలో ఏపీలో 346, తెలంగాణలో 53 టవర్లు ఉంటాయి. ఈ టవర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్వహిస్తుంది.
  • వీధి వ్యాపారులకు పూచీకత్తులేని రుణాలు అందించే పీఎంస్వనిధి పథకాన్ని 2024 డిసెంబరు వరకు కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకం కింద ఇదివరకు రూ.5వేల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పుడు ఆ లక్ష్యాన్ని రూ.8,100 కోట్లకు పెంచారు. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లోని 1.2 కోట్ల మంది వీధి వ్యాపారులకు లబ్ధిచేకూరుతుందని అంచనా. ఈ ఏడాది ఏప్రిల్‌ 25 నాటికి 31.9 కోట్ల మంది వ్యాపారులకు రుణాలు మంజూరు కాగా అందులో 29.6 లక్షల మందికి రూ.2,931 కోట్లమేర అందించారు. 13.5 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు చేసిన వీధివ్యాపారులకు ప్రోత్సాహకాల కింద రూ.10 కోట్లు, వడ్డీరాయితీ కింద రూ.51 కోట్లు చెల్లించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
  • జమ్మూ-కశ్మీర్‌లోని చినాబ్‌ నదిపై క్వార్‌ జల విద్యుత్తు ప్రాజెక్టు(540 మెగావాట్లు)ను నిర్మించడానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి రూ.4,526 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.

సీఎస్‌ఐఆర్‌లో సీడీసీ విలీనం: శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖకు చెందిన సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌లోని రెండు స్వయం ప్రతిపత్తి విభాగాలైన సీడీసీ(కన్సల్టెన్సీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌), సీఎస్‌ఐఆర్‌(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) ఒకే సంస్థగా ఆవిర్భవించనున్నాయి. సీడీసీని దానిలోని సిబ్బందిని, స్థిర,చర ఆస్తులను.. సీఎస్‌ఐఆర్‌లో విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది.

ఇదీ చదవండి: మోదీ నోట 'పెట్రో'​ మాట.. భగ్గుమన్న విపక్షాలు.. ఇంతకీ 'ధరల మోత' ఎవరి పాపం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.