ETV Bharat / bharat

గోవాలో మరోసారి 2017 సీన్ రిపీట్ కానుందా?

author img

By

Published : Mar 8, 2022, 8:08 PM IST

goa elections
గోవా ఎన్నికలు

goa hung assembly: గోవాలో హంగ్ తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ తగ్గితే స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఎంజీపీ మద్దతు తీసుకుంటామని సావంత్​ చెప్పారు. ఈ క్రమంలో అప్రమత్తమైన కాంగ్రెస్​.. తమ పార్టీ అభ్యర్థులను క్యాంపునకు తరలించింది. అలాగే భాజపాయేతర పార్టీలతో చర్చలు జరుపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో 2017 నాటి సీన్ రిపీట్ కానుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

goa hung assembly: గోవాలో ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ సోమవారం వెలువడగా.. గోవాలో హంగ్ తప్పదని అన్ని ఎగ్జిట్ పోల్స్​ తేల్చేశాయి. భాజపా, కాంగ్రెస్​కు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాదని తేల్చేశాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర గోమంత్ పార్టీ, స్వతంత్రులతో భాజపా కేంద్ర నాయకత్వం చర్చలు ముమ్మరం చేసింది. ఫలితాల అనంతరం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీతో పొత్తుపెట్టుకున్న ఎంజీపీతో జతకట్టేందుకు భాజపాతో ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అది ఎంతవరకు సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై గోవా సీఎం సావంత్​ కీలక వ్యాఖ్యలు చేశారు.

goa exitpolls
గోవా ఎగ్జిట్ పోల్స్

"మెజార్టీ తగ్గితే స్వతంత్ర ఎమ్మెల్యేలు, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ మద్దతు తీసుకుంటాం. ఎంజీపీ చేసిన కచ్చితమైన డిమాండ్ల గురించి నాకు తెలియదు. మా కేంద్ర నాయకత్వం వారితో మాట్లాడుతోంది"

-ప్రమోద్ సావంత్, గోవా ముఖ్యమంత్రి

అలాగే మంగళవారం ప్రధాని మోదీని గోవా సీఎం ప్రమోద్ సావంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా బలమైన పనితీరు కనబరించిందని ప్రధానికి వివరించినట్లు భేటీ అనంతరం సావంత్ తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తుందనే అశాభావాన్ని ప్రధానికి తెలియజేశానని అన్నారు.

2017 గోవా శాసనసభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. మెుత్తం 40 స్థానాలకుగానూ కాంగ్రెస్ 17 స్థానాలు, భాజపా 13 స్థానాల్లో విజయం సాధించింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైంది. ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ముందే మేల్కొన్న కాంగ్రెస్​

గతంలో మాదిరి కాకుండా ఈ సారి గోవాలో కాంగ్రెస్ పార్టీ ముందుగా మేల్కొన్నట్లు కనిపిస్తోంది. హంగ్​ ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో పార్టీ అభ్యర్థులను హోటల్​కు తరలించింది. ఎన్నికల ఫలితాలు విడుదలై.. ప్రభుత్వ ఏర్పాటు వరకు వీరందరూ అక్కడే ఉండనున్నారని సమాచారం. కచ్చితంగా ఒంటరిగానే కాంగ్రెస్ మెజార్టీ మార్కును అందుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. అయినా కూడా భాజపాయేతర పార్టీలన్నింటితో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయన గోవా కాంగ్రెస్ ఎన్నికల ఇంఛార్జ్​గా ఉన్నారు.

2022 శాసనసభ ఎన్నికల్లోనూ భాజపా పాత ఫార్ములాతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం ఎంజీపీతో టచ్​లో ఉందని గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించడం వల్ల మరోసారి 2017 నాటి సీన్ రిపీట్ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గోవాలో ఈ సారి తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఎన్సీపీ- శివసేన పార్టీలు కలిసి బరిలోకి దిగాయి. ఆమ్ఆద్మీ పార్టీ, భాజపా, కాంగ్రెస్​ ఒంటరిగానే పోటీ చేశాయి. ఎన్ని పార్టీలు బరిలో ఉన్నా హోరాహోరీ పోటీ మాత్రం కాంగ్రెస్, భాజపాల మధ్యే ఉండనుంది. 40 అసెంబ్లీ స్థానాలు గల గోవాలో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. మార్చి 10వ తేదీన ఫలితాలు తెలనున్నాయి.

ఇదీ చదవండి: Exit Polls 2022: మెజారిటీ రాష్ట్రాల్లో భాజపాదే హవా- కానరాని కాంగ్రెస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.