ETV Bharat / bharat

పెరుగుతున్న భూతాపం- హిమాని నదులకు పెనుశాపం

author img

By

Published : Feb 8, 2021, 7:07 AM IST

మానవుడు చేస్తున్న విపరీత పర్యావరణ కాలుష్యంతో ప్రకృతి ప్రకోపిస్తోంది. భూతాపం పెరిగి మంచు కరుగుతోంది. దీంతో హిమాని నదులు జల ప్రళయం సృష్టిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్​లో జరిగిన జలవిలయానికి భూతాపం కూడా ప్రధాన కారణం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Glacier rivers are melting due to global warming
పెరుగుతోన్న భూతాపం హిమాని నదులకు పెనుశాపం

మానవులు విచ్చలవిడిగా విడుదల చేస్తున్న హానికారక వాయువులతో హిమ శైలం చిగురుటాకులా కంపిస్తోంది. వాటి నుంచి వెలువడే వేడికి నిలువెల్లా కరిగిపోతోంది. వేల కిలోమీటర్ల కొద్దీ విస్తరించిన మంచు దుప్పటికి చిల్లులు పడుతున్నాయి. ఈ భారీ పర్వతరాజంపై కొలువు తీరిన హిమానీ నదాలు తరిగిపోతున్నాయి. ఇది జలవిలయానికి కారణమవుతోంది. తాజాగా ఉత్తరాఖండ్‌ను కుదిపేసిన విపత్తు కారణాల్లో భూతాపం అత్యంత ప్రధానమైనది.

ఏమిటీ పర్వత శ్రేణి?

అఫ్గానిస్థాన్‌ నుంచి మయన్మార్‌ వరకూ ఎనిమిది దేశాల్లో.. 3500 కిలోమీటర్ల మేర విస్తరించిన హిందుకుష్‌ హిమాలయాలు ఎవరెస్టు సహా ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతాలకు ఆలవాలంగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మూడో ధ్రువంగా అభివర్ణిస్తారు. ధ్రువ ప్రాంతాలకు వెలుపల ప్రపంచంలోనే అత్యంత భారీగా మంచినీటి నిల్వలు హిమ రూపంలో ఇక్కడే ఉన్నాయి. దిగువ ప్రాంతాల్లోని కోట్ల మందికి ఇవి ప్రాణాధారం. ఇక్కడి హిమానీ నదాలు.. గంగా, మెకాంగ్‌, యాంగ్జీ, బ్రహ్మపుత్ర సహా ఆసియాలోని పది అతిపెద్ద నదులకు జలధారను అందిస్తున్నాయి. ఇక్కడ 30వేల చదరపు మైళ్లకుపైగా హిమానీనద మంచు నిక్షిప్తమై ఉంది.

హిమాలయాలు.. పర్యావరణపరంగా చాలా సున్నితమైనవి. వాతావరణ మార్పులు, మానవ చర్యలు, పెరుగుతున్న భూతాపం వల్ల అక్కడ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దాదాపు 2 డిగ్రీల ఫారెన్‌హైట్‌ మేర పెరిగాయని కాఠ్‌మాండూలోని ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ మౌంటెయిన్‌ డెవలప్‌మెంట్‌ (ఐసీఐఎంవోడీ) అధ్యయనంలో తేలింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే భూతాపం ప్రభావం ఇక్కడే ఎక్కువగా ఉంది. ఫలితంగా హిమానీనదాలు వేగంగా తరిగిపోతున్నాయి. మంచు కరుగుతోంది. వాతావరణ తీరుతెన్నులూ గందరగోళమయ్యాయి.

ఈ శీతాకాలంలో మంచు తగ్గడం వల్లే?

ఉత్తరాఖండ్‌లో ఈ శీతాకాలంలో హిమపాతం తగ్గింది. దాని వల్లే తాజాగా హిమానీనద చరియలు విరిగిపడి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఇది జరగడం అసాధారణమేనని చెప్పారు. శీతాకాలంలో వర్షం, హిమపాతం వల్ల హిమానీనదాలు పరిపుష్టమవుతాయి. ఈ ఏడాది ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో హిమపాతం తక్కువగా ఉండటం వల్ల హిమానీనదాలు నిర్మాణపరమైన లోపాలు సరికాలేదని పేర్కొన్నారు. అందువల్లే ఈ విపత్తు జరిగి ఉంటుందని చెప్పారు. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ-కశ్మీర్‌లో దాదాపు 200కుపైగా ప్రధాన హిమానీ నదాలు ఉన్నాయి.

కరుగుతున్న హిమానీ నదాలు

వాతావరణ మార్పుల వల్ల మంచు, వర్షపు పోకడల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎత్తయిన పర్వతాల్లో హిమపాతంలో అధికశాతం.. రుతుపవనాలు తాకినప్పుడు సంభవిస్తుంటుంది. వాతావరణ మార్పుల వల్ల కొన్ని దశాబ్దాలుగా రుతుపవనాలు బలహీనమయ్యాయి. దీంతో హిమానీనదాలపై మంచు పేరుకుపోవడం తగ్గిపోతోంది.

  • 2000 నుంచి హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాలు 20-47 శాతం మేర తగ్గిపోయాయి. పరిస్థితి ఇదేరీతిలో కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి 50 శాతం మేర హిమానీనదాలు తరిగిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇవీ కష్టాలు..

హిమానీనదాలు, మంచు ఫలకాలు నీటిని నిల్వ చేసే ట్యాంకుల్లాంటివి. దశాబ్దాలు, శతాబ్దాల కాలంలో సీజన్లవారీగా అవి మెల్లగా కరుగుతూ నీటిని నదుల్లోకి క్రమంగా వదులుతాయి. వాతావరణ మార్పులతో ఈ కరుగుదల వేగంగా సాగడం వల్ల సరస్సుల్లో, నదుల్లో నీరు ఎక్కువగా చేరుతోంది.

  • మంచు అధికంగా కరగడం వల్ల హిమానీనదాలపై సరస్సులు ఎక్కువగా ఏర్పడతాయి. 1977 నుంచి నేపాల్‌ హిమాలయ ప్రాంతంలో గ్లేషియల్‌ సరస్సులు రెట్టింపు కావడం ఇందుకు నిదర్శనం.
  • మంచు కరుగుదల విపరీతంగా ఉన్నప్పుడు ఈ సరస్సుల్లో నీటి మట్టం చాలా వేగంగా పెరిగిపోతుంటుంది. గట్టులా పనిచేసే పర్వతాకృతి వద్ద కూడా మంచు కరిగి, ఆ ప్రాంతం వదులుగా మారుతుంది. దీంతో ఆ గట్టులోని రాతిపెళ్లలను బద్దలుకొట్టుకుంటూ నీరు.. దిగువ ప్రాంతాలకు ఉరకలెత్తుతుంది. తాజాగా ఉత్తరాఖండ్‌లో జరిగింది ఇదే. సరస్సులు పెరిగితే హిమానీనదంలోని మంచుచరియలు విరిగిపడే ఘటనలూ పెరుగుతాయి. నదుల్లో మట్టి, రాళ్ల పరిమాణమూ పెరుగుతుంది.
  • భారత ప్రభుత్వం హామీ ఇచ్చిన స్థాయిలో గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను తగ్గించినప్పటికీ 2030 నాటికి భారత హిమాలయాలు 2.6 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 4.6 డిగ్రీల సెల్సియస్‌ మేర వేడెక్కుతాయి. 2100 నాటికి ఈ ప్రాంతంలోని సరాసరి ఉష్ణోగ్రత కూడా 5.2 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరుగుతుంది.

నష్టాలు..

గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను తగ్గించాలి. పవన, సౌర, సముద్ర తరంగాలు వంటి పునరుత్పాదక ఇంధన వనరులపై ఎక్కువగా ఆధారపడాలి.

  • దేశంలోని కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాలను శోషించుకునేందుకు అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి.
  • 2005 నాటి స్థాయితో పోలిస్తే గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను 35 శాతం మేర తగ్గించుకుంటామని భారత్‌ హామీ ఇచ్చింది. దీన్ని సాధించేందుకు మెరుగ్గా చర్యలు చేపట్టాలి.
  • హిమాలయ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంలో సంప్రదాయ కలప, రాతి కట్టడాలకు బదులు రీఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీటును ఎక్కువగా వాడటం వల్ల ‘హీట్‌ ఐలాండ్‌’ ప్రభావం ఏర్పడుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది ప్రాంతీయంగా వేడెక్కడానికి కారణమవుతోందని చెప్పారు.

హెచ్చరిక వ్యవస్థ ఏదీ?

2004లో సునామీ తర్వాత తీర ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ వచ్చింది. అదే రీతిలో హిమాలయ ప్రాంతంలో సంభవించే విపత్తులను పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేయడానికి ఒక హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిపుణులు చాలా కాలంగా సూచిస్తున్నారు. ఇప్పటివరకూ దీనిపై స్పందన లేదు.

ఆసియా దేశాలదే తప్పు

శిలాజ ఇంధనాలు, వంటచెరకు వాడకం ద్వారా ఆసియా దేశాలు భారీ పరిమాణంలో ఆకాశంలోకి పొగ, మసి వదిలిపెడుతున్నాయని, దానిలో సింహభాగం మంచు ఉపరితలాలపై పడి.. సౌరశక్తిని శోషించుకుని, కరుగుదలకు కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Glacier rivers are melting due to global warming
కరుగుతోన్న హిమం

మరింత వేగంగా..

ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల హిమాలయా పర్వతాల్లో హిమానీనదాలు కరిగిపోయే వేగం రెట్టింపైనట్లు 2019లో నిర్వహించిన ఒక అధ్యయనం చెబుతోంది. 21వ శతాబ్ది ఆరంభం నుంచి మరింత వేగంగా మంచు కరుగుతోంది. మన దేశంతో పాటు చైనా, నేపాల్‌, భూటాన్‌లకు సంబంధించిన 40 ఏళ్ల కాలం నాటి ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఈ అధ్యయనంలో విశ్లేషించారు. 2000 కి.మీ. పొడవున విస్తరించిన 650 మంచు చరియల చిత్రాలను వీరు క్షుణ్నంగా పరిశీలించారు.

ఆ పాతికేళ్ల కంటే రెట్టింపు

1975-2000 సంవత్సరాల మధ్య కరిగిన మంచు కంటే ఆ తర్వాత కరుగుతున్న పరిమాణం రెట్టింపు మేర ఉంది.

  • భూగోళం వేడెక్కుతుండడంతో హిమాలయ ప్రాంతంలో మంచుకొండలు ఏటా 0.25 మీటర్ల మేర మంచును కోల్పోతున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఇది ఏటా 0.5 మీటర్లకు పెరగడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది.
  • నిర్దిష్టమైన అంచనాలు వేయకపోయినా గత నాలుగు దశాబ్దాల్లో మంచు చరియలు తమ మొత్తం పరిమాణంలో నాలుగో వంతును కోల్పోయి ఉంటాయని భావిస్తున్నారు.
  • 1975-2000 మధ్య కాలంతో పోలిస్తే 2000-2016 మధ్య సగటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ సెల్సియస్‌ మేర పెరిగాయి.

ఇదీ చూడండి: జలప్రళయం మిగిల్చిన విధ్వంస చిత్రమిది...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.