ETV Bharat / bharat

Venkaiah Naidu: సాధారణ రైతు కుటుంబం నుంచి ఉపరాష్ట్రపతి వరకు..

author img

By

Published : Jul 17, 2022, 5:42 AM IST

Updated : Jul 17, 2022, 6:31 AM IST

Venkaiah Naidu
Venkaiah Naidu

Venkaiah Naidu: సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఉపరాష్ట్రపతి హోదా వరకు ఎదిగిన వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో వాక్చాతుర్యంతో దేశవ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న నేతగా ఆయనకు విశిష్ట స్థానం ఉంది.

Venkaiah Naidu: సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఉపరాష్ట్రపతి హోదా వరకు ఎదిగిన వెంకయ్య నాయుడి పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో వాక్చాతుర్యంతో దేశవ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న నేతగా ఆయనకు విశిష్ట స్థానం ఉంది. 1960లలో ఓ బహిరంగ సభలో నాటి జన్‌సంఘ్‌ నేత వాజ్‌పేయీ ప్రసంగానికి ఆకర్షితులై ఏబీవీపీ నాయకుడిగా వెంకయ్య నాయుడు ప్రజాజీవితాన్ని మొదలుపెట్టిన విలక్షణ నేతగా గుర్తింపు పొందారు.

14 ఏళ్ల వయసులో ఆరెస్సెస్‌ శాఖలో చేరి ఆ తర్వాత దాని భావజాలానికే త్రికరణ శుద్ధిగా కట్టుబడి, క్రమశిక్షణ గల కార్యకర్తగా వెంకయ్య నాయుడు కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్‌సంఘ్‌, భాజపా పేరు వినిపించని కాలంలోనే సొంతంగా పోస్టర్లు అంటించి పార్టీ కోసం ప్రచారం చేస్తూ రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన అది నేర్పిన రాజకీయం, భావజాల మార్గంలో నడుస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఉపరాష్ట్రపతి స్థానానికి చేరారు. ఏబీవీపీ నాయకుడిగా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన జయప్రకాశ్‌ నారాయణ్‌ నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సంపూర్ణ మెజార్టీతో నడుస్తున్న భాజపా.. వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతిగా రెండోసారి కొనసాగిస్తుందన్న ఊహాగానాలకు తాజాగా తెరపడింది. ఇప్పటివరకూ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, హమీద్‌ అన్సారీలు మాత్రమే వరుసగా రెండుసార్లు ఉపరాష్ట్రపతి పదవిని అధిష్ఠించి అరుదైన ఘనత సాధించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్య నాయుడు భాజపా జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. రాజ్యసభకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. జాతీయ రాజకీయాల్లోకి రాకముందు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978 నుంచి 2017 వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. అన్ని భాషల్లో అంత్యప్రాసలతో ఆయన చేసే ప్రసంగం పండితుల నుంచి పామరుల వరకు అందర్నీ అలరిస్తుంది. దక్షిణాదిలో వాజ్‌పేయీ ప్రసంగాలను తెలుగులోకి తర్జుమా చేసేవారు. వాజ్‌పేయీ, ఆడ్వాణీలను వికాస్‌ పురుష్‌, లోహ్‌ పురుష్‌లుగా అభివర్ణించి వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఒకప్పుడు ఆడ్వాణీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఆయన 2014 ఎన్నికలకు ముందు మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా బలంగా సమర్థించారు. ఆ తర్వాత ఆయన హయాంలో పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు.

2002 నుంచి 2004 వరకు భాజపా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పదవి నుంచి వైదొలిగారు. 2017 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన అనంతరం రాజ్యసభ ఛైర్మన్‌గా సభను చాకచక్యంగా నడిపిస్తూ వచ్చారు. జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు బిల్లులను అత్యంత ఒడుపుతో రాజ్యసభలో గట్టెక్కించి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఉపశమనం కల్పించారు. సంక్లిష్ట సమయాల్లో తన రాజకీయ అనుభవాన్ని రంగరించి సభను చాకచక్యంగా ముందుకు నడిపించారు. ఒకవైపు పెద్దరికంతో, ఓర్పుతో వ్యవహరిస్తూనే మరోవైపు కఠిన చర్యలూ వెనకాడలేదు. తన ముందుకొచ్చిన ఏ సమస్యనైనా అత్యంత వేగంగా పరిష్కరించడం ఆయనకు అలవాటు.

ఇవీ చదవండి: దొంగల బీభత్సం.. 17 ఏటీఎంలు క్లోజ్.. గ్రామస్థులకు తిప్పలు!

రోడ్లపై జంతువులు హల్​చల్.. వృద్ధుడు మృతి.. చిన్నారికి గాయాలు

Last Updated :Jul 17, 2022, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.