ETV Bharat / bharat

Khammam Accident Today : 'నేను రమ్మనకపోయినా బతికేటోళ్లు కొడుకా.. ఎంత పనైపాయే..'

author img

By

Published : Jun 1, 2023, 1:26 PM IST

Updated : Jun 1, 2023, 2:24 PM IST

Khammam Accident Today
Khammam Accident Today

Family Killed in Khammam Accident Today : మనవళ్ల రాక కోసం రాత్రంతా కళ్లల్లో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న ఆ వృద్ధ దంపతుల గుండెలు ఒక్కసారిగా అదిరిపడ్డాయి. కాసేపట్లో.. పిల్లల అల్లరి, తాతయ్య-నాయనమ్మ ముద్దుమురిపెంతో సందడిగా మారాల్సిన ఆ ఇంటిని ఒక్కసారిగా తీరని విషాదం కమ్మేసింది. సెలవులు ముగుస్తున్నాయి.. ఒక్కసారి సొంతూరికి వెళ్లొద్దామని బయలుదేరిన ఆ కుటుంబం.. గమ్యం చేరకముందే చీకట్లో కలిసిపోయింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల వద్ద జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఓ బాబు సహా దంపతులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది.

Khammam Accident Killed a Family Today : ఒక్కగానొక్క కుమారుడు. ఉన్నత చదువులు చదివి.. హైదరాబాద్‌లో మంచి ఉద్యోగం సంపాదించాడు. ఓ ఫార్మా కంపెనీలో మేనేజర్‌ స్థాయిలో స్థిరపడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్నంతలో గొప్పగా జీవిస్తున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు సొంతూరిలోనే ఉంటూ.. చేతనైనంతలో వ్యవసాయాన్ని చూసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడికి సెలవులు దొరికినప్పుడు కన్నవారి వద్దకు వచ్చి.. వారి బాగోగులు చూసుకుని వెళ్లేవాడు.

ఇలా సాఫీగా.. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితాలను ఒక్క రోడ్డుప్రమాదం కకావికలం చేసింది. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకుతో పాటు కోడలు, ఓ మనవడిని దూరం చేసింది. మరో మనవడిని ఆసుపత్రి పాలు చేసింది. ఖమ్మం జిల్లా కొనిజర్ల వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో దంపతులు రాజేశ్‌-సుజాత సహా వారి కుమారుడు అశ్విత్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. పెద్ద కుమారుడు దివ్యతేజ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Car Accident Today in Khammam : 'స్కూళ్లకు వేసవి సెలవులు ఉన్నాయి కదరా.. మనవళ్లను చూడాలని ఉంది. ఒక్కసారి ఇంటికి వచ్చి పోరా. నిన్ను-కోడల్ని చూసి కూడా చాలా రోజులవుతుంది. వీలు చూసుకుని ఒక్కసారి వచ్చిపోరా' అన్న తండ్రి మాటలతో ఆ కుమారుడు విధులకు సెలవు పెట్టాడు. రాత్రి వేళల్లో అయితే వాహనాల రద్దీ తక్కువగా ఉంటుందని ఫ్యామిలీని తీసుకుని బుధవారం రాత్రి కారులో సొంతూరికి బయలుదేరాడు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోవడంతో పిల్లలిద్దరూ వెనక సీట్లో హాయిగా నిద్రపోతున్నారు. ముందు సీట్లో ఉన్న దంపతులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతలోనే నాన్న ఫోన్‌ చేస్తే.. ఇంకో 15 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం డాడీ అని రాజేశ్‌ చెప్పాడు.

Couple Died in Car Accident : కాసేపట్లో నా కొడుకు-కోడలు మనవళ్లతో ఇల్లంతా సందడిగా మారిపోతుంది. పిల్లలు ఉన్నన్ని రోజులు నా ఇల్లు కళకళలాడుతుంది అనుకుంటూ మురిసిపోతున్న ఆ తండ్రికి అంతలోనే ఓ ఫోన్‌ వచ్చింది. హలో అనగానే.. అవతలి వ్యక్తి గుండె పగిలే వార్త చెప్పాడు. 'కొనిజర్ల వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మీ కొడుకు, కోడలు, ఓ మనవడు చనిపోయారు. మరో మనవడికి తీవ్ర గాయాలయ్యాయి' అన్న మాటలతో ఒక్కసారిగా హతాశుడయ్యాడు. హుటాహుటిన భార్యను తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడి పరిస్థితిని చూసి ఆ వృద్ధ దంపతులు గుండెలవిసేలా రోదించారు. 'నేనే మిమ్మల్ని చంపుకున్నాను.. ఇంటికి రమ్మనకున్నా సిటీలో హాయిగా ఉండేవాళ్లు బిడ్డా' అంటూ ఆ తండ్రి ఏడ్చిన తీరు అక్కడి వారి గుండెలు బరువెక్కేలా చేసింది.

ఖమ్మం జిల్లా కొనిజర్ల వద్ద తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరతామనుకుంటున్న క్రమంలో మృత్యువు దారికాచిందా అన్నట్లుగా రాజేశ్‌ కారు ప్రమాదానికి గురైంది. కొనిజర్ల వద్ద ముందు వెళ్తున్న లారీ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. దీంతో వెనకే వెళ్తున్న రాజేశ్‌ కారు.. లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఇదే సమయంలో వెనక నుంచి వచ్చిన మరో లారీ అప్పటికే ప్రమాదానికి గురైన కారును బలంగా ఢీకొట్టింది. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు కారులో ఉన్న వారిని బయటికి తీసేలోగా రాజేశ్‌, సుజాతతో పాటు వారి చిన్న కుమారుడు అశ్విత్ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలతో ఉన్న పెద్ద కుమారుడు దివ్యతేజ్‌ను బయటికి తీసి, హుటాహుటిన సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్చురీ వద్ద కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Khammam Accident Today : 'నేను రమ్మనకపోయినా బతికేటోళ్లు కొడుకా.. ఎంత పనైపాయే..'

ఇవీ చూడండి..

Telangana Road Accidents Today : రక్తమోడిన రహదారులు.. రోడ్డు ప్రమాదాల్లో పది మంది మృతి

Road Accident in Tripurantakam: మృత్యు రూపంలో దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి.. ప్రకాశంలో ఘటన

దిల్లీలో 'కేరళ స్టోరీ'.. ప్రేమగా దగ్గరై రేప్.. మతం మార్చి వివాహం.. 11 ఏళ్ల తర్వాత..

Last Updated :Jun 1, 2023, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.