ETV Bharat / bharat

Facebook Love Story: ఫేస్​బుక్ ప్రేమకథా చిత్రమ్..! ఒక్కటైన చిత్తూరు యువకుడు శ్రీలంక యువతి

author img

By

Published : Jul 29, 2023, 3:34 PM IST

Updated : Jul 29, 2023, 4:07 PM IST

Etv Bharat
Etv Bharat

Srilanka - Chittoor Facebook Love Story: ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రాం ఇలా సామాజిక మాధ్యమాలు ఎవైనా సరే.. వీటి ద్వారా ఏర్పడిన పరిచయాలు ప్రేమగా మారి వివాహ బంధాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు ప్రేమకు సరిహద్దులు అడ్డు కావని నిరూపిస్తున్నాయి. రాజస్థాన్​ యువతి అంజూయాదవ్​, పాక్​కు చెందిన సీమా ఘటనలు అందుకు ఉదాహరణలు కాగా.. తాజాగా అలాంటిదే ఆంధ్రప్రదేశ్​లో జరిగింది. శ్రీలంక యువతి.. చిత్తూరు యువకుడు ఫేస్​బుక్​ ద్వారా కలిసి ఒక్కటయ్యారు. వారి ఫేస్​బుక్ ప్రేమ కథ ఎలా సాగిందో తెలుసుకుందామా..!

ఫేస్​బుక్ ప్రేమకథా చిత్రమ్..

Sri Lanka Girl Love Marriage of Chittoor Boy: చిత్తూరు జిల్లాకు చెందిన యువకుడు.. శ్రీలంక దేశానికి చెందిన యువతి.. ఫేస్​బుక్​ ద్వారా పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల పాటు వీరి స్నేహం సాగింది.. ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి.. ఇంకేముంది.. మనసులో మాట చెప్పుకున్నారు.. ఏడేళ్లు సాగిన వీరి స్నేహాన్ని పెళ్లి బంధం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశాలు వేరైనా.. సరిహద్దులు దాటి ఈ నెలలో ఒక్కటయ్యారు.

చిత్తూరు జిల్లా వి. కోట మండలం ఆరిమాకులపల్లె గ్రామానికి చెందిన లక్ష్మణ్​ అనే యువకుడు తాపిమేస్త్రిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతనికి శ్రీలంకలోని బేలంగూడు ప్రాంతానికి చెందిన విఘ్నేశ్వరితో ఫేస్​బుక్​లో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. అనూహ్యంగా గత ఏడు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ఆ ప్రేమ కొనసాగింది.​

వివాహంగా మారిన ఏడు సంవత్సరాల ప్రేమ ..: వారి ప్రేమను వివాహబంధంగా మార్చుకోవాలనుకున్నారు. పెళ్లి చేసుకోవాని నిశ్చయించుకున్న ఈ ప్రేమ జంట.. ఆ దిశగా ఓ అడుగు ముందుకు వేశారు. శ్రీలంక యువతిని చిత్తూరుకు రావాలని.. వచ్చిన తర్వాత వివాహం చేసుకోనున్నట్లు ఆ యువకుడు తన ప్రేయసికి ఆహ్వానం పంపాడు. దీంతో ఆమె పర్యాటక వీసా తీసుకుని శ్రీలంక నుంచి భారత్​కు బయల్దేరింది.

శ్రీలంక నుంచి వచ్చిన తర్వాత ఏమైంది: తన ప్రియుడిని కలుసుకునేందుకు శ్రీలంక నుంచి బయల్దేరిన ఆ యువతి.. ఈ నెల 8న యువతి చైన్నెకు చేరుకుంది. తన ప్రేయసికి స్వాగతం పలికేందుకు ఆ యువకుడు చెన్నైకి వెళ్లి.. స్వగ్రామానికి తీసుకువచ్చాడు. తాను తీసుకువచ్చిన విఘ్నేశ్వరిని కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు.. తాను విఘ్నేశ్వరిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఇంట్లో పెద్దలకు తెలిపాడు.

వారి వివాహనికి పెద్దలు ఒప్పుకున్నారా..: లక్ష్మణ్, విఘ్నేశ్వరిని ఇంట్లో పరిచయం చేసిన అనంతరం.. అతని ఇంటిపెద్దలు వివాహనికి అంగీకరించారు. తగిన ఏర్పాట్లు చేసి వారిద్దరికీ జులై 20వ తేదీన.. వి. కోటలోని సాయిబాబా ఆలయంలో వివాహం జరిపించారు. పెద్దల ఆశీర్వాదాల నడుమ ఆ ప్రేమ జంట.. దంపతులుగా మారారు. అప్పటినుంచి ఆ యువతి ఆ ఇంట్లో కుటుంబసభ్యురాలిగా చేరిపోయింది.

అసలు ట్వీస్ట్​ ఇక్కడే..: విఘ్నేశ్వరి శ్రీలంక నుంచి ఎల్లలు దాటి.. భారత్​కు వచ్చిన విషయం పోలీసులకు తెలిసింది. ఆమె పర్యాటక వీసాపై వచ్చిన సమాచారం వారికి అందింది. దీంతో చిత్తూరు జిల్లా ఎస్పీ వారిని చిత్తూరుకు పిలిపించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 6న ఆమె పర్యాటక వీసా గడువు ముగుస్తుందని.. గడువు ముగిసేలోగా తిరిగి శ్రీలంక వెళ్లిపోవాలని ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులు ఆ యువతి వారి స్వగృహంలోనే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

"శ్రీలంక అమ్మాయి నన్ను ప్రేమించింది. నేను అమ్మాయిని ప్రేమించాను. తాను చెన్నై ఏయిర్​పోర్టుకు రావటంతో ఇంటికి తీసుకువచ్చాను. ఇంట్లో వాళ్లకు చెప్పటంతో పెళ్లి చేశారు. ఆమె శాశ్వతంగా మాతోనే ఉండాలని కోరుకుంటున్నాము. వీసా గడువు ముగిసిన తర్వాత వెళ్లిపోవాలని పోలీసులు అన్నారు. ఆమె అక్కడికి వెళ్లకుండా ప్రభుత్వం మాకు సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము." -లక్ష్మణ్​, వివాహం చేసుకున్న యువకుడు

Last Updated :Jul 29, 2023, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.