మూడు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..

author img

By

Published : Jan 18, 2023, 3:06 PM IST

Updated : Jan 18, 2023, 6:49 PM IST

ec poll schedule

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​ శాసనసభలకు ఎన్నికల నగారా మోగింది. పోలింగ్ ఎప్పుడంటే?

మూడు రాష్ట్రాల్లో ఎన్నికల నగరా మోగింది. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్​, త్రిపుర, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను ప్రకటించింది ఎలక్షన్​ కమిషన్​. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయని సీఈసీ రాజీవ్ కుమార్ గురువారం దిల్లీలో వెల్లడించారు. మేఘాలయ, నాగాలండ్ అసెంబ్లీలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 2న మూడు రాష్ట్రాల ఫలితాల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేశారు. మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

"మూడు రాష్ట్రాల్లో భౌగోళికంగా సవాళ్లు ఉన్నాయి. అయినప్పటికీ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికల సంఘం అధికారులు మూడు రాష్ట్రాలను సందర్శించారు. కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. ఎన్నికల్లో ఎలాంటి హింసనూ సహించం. ఎన్నికల సమయంలో హింస తలెత్తని అతికొద్ది రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాలు ఉన్నాయి. గత 12 ఎన్నికల్లో ఇక్కడ హింస అనేది లేదు."
-రాజీవ్ కుమార్, సీఈసీ

nagaland-tripura-meghalaya-assembly-polls
మూడు రాష్ట్రాల ఎన్నికలు
nagaland-tripura-meghalaya-assembly-polls
మూడు రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య

త్రిపుర
60 అసెంబ్లీ స్థానాలు ఉన్న త్రిపురలో 20 సీట్లు గిరిజనులకు రిజర్వ్ అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో భాజపా 36 సీట్లు గెలుచుకోగా.. సీపీఎం 16, ఐపీఎఫ్​టీ 8 స్థానాల్లో విజయం సాధించింది. త్రిపుర శాసనసభ పదవీకాలం మార్చి 22న ముగియనుంది.

మేఘాలయ
60 శాసనసభ నియోజకవర్గాలు ఉన్న మేఘాలయలో నేషనల్​ పీపుల్స్ పార్టీ ఆధ్వర్యంలో సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది. 2018లో ఎన్​పీపీ 20 సీట్లలో విజయం సాధించగా.. యూడీపీ 8, టీఎంసీ 8, భాజపా 3, ఎన్​సీపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. మేఘాలయ శాసనసభ పదవీకాలం మార్చి 15న ముగియనుంది.

నాగాలాండ్​
నాగాలాండ్​లో ప్రస్తుతం నేషనల్​ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఆధ్వర్యంలో సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది. రాష్ట్రంలో 60 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాగాలాండ్​ శాసనసభ పదవీకాలం మార్చి 12న ముగియనుంది.

2024కు సెమీ ఫైనల్..
ఈ మూడు రాష్ట్రాలతో పాటు మరో ఆరు రాష్ట్రాలకు 2023లోనే ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్​గఢ్, కర్ణాటక, తెలంగాణకు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. 2023లో ఎన్నికలు జరిగే తొమ్మిది రాష్ట్రాలకుగాను అయిదింటిలోనే 110 లోక్‌సభ స్థానాలున్నాయి. మిగిలిన నాలుగు ఈశాన్య రాష్ట్రాలు; అక్కడ ఆరు లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌, కర్ణాటకలో భాజపా అధికారంలో ఉండగా.. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్​లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. నాలుగు రాష్ట్రాల్లో ప్రధాన పోటీ భాజపా, కాంగ్రెస్‌ మధ్యనే నెలకొంది. దక్షిణాదిలో అధికారంలో ఉన్న కర్ణాటకను తిరిగి దక్కించుకోవడంతో పాటు తెలంగాణలో పాగా వేయడానికి భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated :Jan 18, 2023, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.