ETV Bharat / bharat

తమిళనాడు సీఎంగా స్టాలిన్ నేడు ప్రమాణం

author img

By

Published : May 7, 2021, 5:23 AM IST

Updated : May 7, 2021, 6:51 AM IST

తమిళనాడులో నూతన ప్రభుత్వం నేడు కొలువుదీరనుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 34 మందితో స్టాలిన్ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు.

dmk chief stalin
స్టాలిన్ ప్రమాణానికి సర్వం సిద్ధం

తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్​ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దురాయిమురుగన్​ వంటి సీనియర్ నేతలు సహా 15 మంది కొత్తవారికి ఆయన మంత్రివర్గంలో చోటు దక్కింది. ఈ మేరకు ఆ 34 మంది పేర్లు.. వారికి కేటాయించబోయే శాఖల వివరాలతో జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాకు గవర్నర్‌ బన్వరీలాల్​ కూడా ఆమోదం తెలిపారు.

అయితే కీలక శాఖలను మాత్రం స్టాలిన్‌ తనవద్దే ఉంచుకున్నట్లు సమాచారం. హోంశాఖతో పాటు సంక్షేమశాఖ, జనరల్‌ అడ్మినిష్ట్రేషన్‌ తదితర పోర్టుఫోలియోలను స్టాలిన్‌ స్వయంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారుల నియామకాలు, బదిలీలను కూడా ఆయనే పర్యవేక్షిస్తారు.

డీఎంకే ఎమ్మెల్యే సుబ్రమణియన్‌కు ఆరోగ్యశాఖ కేటాయించగా.. దురైమురుగన్‌కు నీటిపారుదల శాఖ కేటాయించారు. స్టాలిన్​ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకూ చోటు దక్కింది. సాంఘిక సంక్షేమం, మహిళా సాధికారత శాఖను పి.గీతాంజలికి కేటాయించగా.. ఆది ద్రవిడార్​ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఎన్​ కాయాల్​విళికి కేటాయించారు. ఈ 34 మంది కూడా మంత్రులుగా స్టాలిన్​తో పాటుగా రాజ్​భవన్​లో ప్రమాణస్వీకారం చేస్తారు.

అలగిరి అభినందనలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న స్టాలిన్​కు ఆయన సోదరుడు, డీఎంకే బహిష్కృత నేత ఎంకే అలగిరి అభినందనలు తెలిపారు. ఈ మేరకు స్టాలిన్​తో ఆయన నేరుగా మాట్లాడి శుభాకాంక్షలు చెప్పారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నేడు జరగనున్న స్టాలిన్​ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అలగిరి కుమారుడు దురాయ్​ దయానిధి, కుమార్తె కాయాల్​విళి పాల్గొనున్నారని చెప్పాయి.

స్టాలిన్​ సోదరుల మధ్య ఎన్నో ఏళ్లుగా విభేదాలు నెలకొన్న నేపథ్యంలో.. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అలగిరిని డీఎంకే నుంచి 2014లో బహిష్కరించారు.

ఇదీ చూడండి: డీఎంకే సక్సెస్​ మంత్ర.. 'స్టాలిన్​'!

ఇదీ చూడండి: కమల్​హాసన్​కు ఎదురుదెబ్బ- పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా

Last Updated : May 7, 2021, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.