ETV Bharat / bharat

'శ్మశానంలో ఖాళీ లేదు.. 20 గంటల తర్వాత రండి'

author img

By

Published : Apr 28, 2021, 7:04 AM IST

delhi graveyard
దిల్లీ కరోనా అంత్యక్రియలు

దిల్లీలో కరోనా కారణంగా చనిపోయిన వారి దహన సంస్కారాల నిర్వహణకు కనీసం 20 గంటల సమయం పడుతోంది. అంతకంతకూ కరోనా మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో శ్మశానాలు నిండిపోయాయి. ఫలితంగా.. బంధువులకు నిరీక్షణ తప్పట్లేదు.

అసలే అయినవారు కరోనా కాటుకు బలై పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబసభ్యులు, బంధువులను.. అంత్యక్రియలకు సుదీర్ఘంగా వేచి ఉండాల్సి రావడం మరింతగా క్షోభ పెడుతోంది. ఓ పక్క ఎతైన పైకప్పు దిగువున 50 చితిలపై మృతదేహాలు అగ్నిలో కలుస్తుండగా, మరోవైపు అక్కడికి సమీపంలోనే మరికొన్ని తమ వంతు కోసం ఎదురుచూస్తున్నాయి. ఓ వైపు చితమంటల వేడి, పొగ మరోవైపు వాహనాలను నిలిపి ఉంచి.. తమ వారికి అంత్యక్రియలు ఎప్పటికి పూర్తవుతాయో? అన్న ఆవేదన, దుఃఖం, ఆగ్రహం కలగలిసిన మానసిక పరిస్థితుల్లో ఉన్నవారి చూపులు. కరోనా కరాళ నృత్యంగా కారణంగా దిల్లీలోని దాదాపు అన్ని శ్మశానవాటికల్లో మంగళవారం కనిపించిన దృశ్యాలివి.

20 గంటల నిరీక్షణ..

అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని తీసుకెళ్లిన వారికి.. కనీసం 16 గంటలు నుంచి 20 గంటలు ఆగాల్సి ఉంటుందని అక్కడి వారు చెబుతున్నారు. "నా జీవితంలో ఏనాడూ ఇలాంటి ఘోరమైన పరిస్థితిని చూడలేదు. అంత్యక్రియల నిమిత్తం తమవారి మృతదేహాలను తీసుకుని ప్రజలు దాదాపు ప్రతిచోటకూ వెళుతున్నారు. దిల్లీలోని అన్ని శ్మశానవాటికలూ మృతదేహాలతో నిండిపోయాయి" అని 'మాస్సే అంత్యక్రియలు' అనే సంస్థకు చెందిన వినీతా మాస్సే చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం ఈ నెలలో దిల్లీలో 3,601 మంది మరణించారు. వీరిలో 2,267 మంది కొవిడ్‌-19 కారణంగా గత ఏడు రోజుల్లోనే చనిపోవడం దిల్లీలోని భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది.

delhi graveyard
దిల్లీలో ఓ శ్మశాన వాటికలో అంత్యక్రియల కోసం ఇలా..

చికిత్స అందలేదు.. చితి దొరకలేదు!

ప్రస్తుతం దిల్లీలోని ఆసుపత్రులు కొవిడ్‌-19 లేనట్లుగా ధ్రువీకరణపత్రం లేకుంటే ఇతర జబ్బులకు చికిత్స అందించడం లేదు. దీంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. పశ్చిమ దిల్లీలోని అశోక్‌నగర్‌కు చెందిన అమన్‌ అరోరా తండ్రి ఎం.ఎల్‌.అరోరాకు సోమవారం మధ్యాహ్నం గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన్ను తీసుకుని అనేక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు. ఎక్కడకు వెళ్లినా కొవిడ్‌-19 నెగెటివ్‌ నివేదిక చూపాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో ఆయన ప్రాణాలు విడిచారని అమన్‌ చెప్పారు. అనంతరం ఆయన.. తండ్రి మృతదేహంతో సుభాష్‌ నగర్‌ శ్మశానవాటికకు వెళ్లగా.. అంత్యక్రియలకు మంగళవారం ఉదయం వరకు వేచి ఉండాలని అక్కడివారు చెప్పారు. పరిస్థితులను కొద్దిసేపు గమనించిన అమన్‌ తన తండ్రి మృతదేహం పాడవకుండా ఉండేందుకు శీతలీకరణ యంత్రం తెప్పించి అందులో ఉంచారు. ఇక్కడ ఒకే దఫా 50 మృతదేహాలను దహనం చేసే ఏర్పాట్లు ఉన్నాయి. వాటితోపాటు.. సీఎన్‌జీ చాంబర్‌లో ఒకే దఫాలో రెండు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించవచ్చు. ఇందుకు 90 నిమిషాల సమయం పడుతుంది. మంగళవారం అక్కడ అంత్యక్రియల నిమిత్తం 24 మృతదేహాలను వరుసలో నేల మీద ఉంచడం కనిపించింది.

ఇవీ చదవండి: ప్రధాని మోదీ పిన్ని నర్మదాబెన్ కరోనాతో కన్నుమూత

ఒకే అంబులెన్సులో 22 కరోనా మృతదేహాల తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.