ETV Bharat / bharat

సీడబ్ల్యూసీ భేటీ.. సోనియా, రాహుల్​ నాయకత్వానికే జై!

author img

By

Published : Mar 13, 2022, 6:37 PM IST

Updated : Mar 13, 2022, 9:41 PM IST

CWC meet on election result: సోనియా గాంధీ అధ్యక్షత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించింది. కాంగ్రెస్ దారుణ ప్రదర్శనపై నేతలు సమాలోచనలు జరిపారు. అయితే, ప్రస్తుత నాయకత్వంపైనే నేతలు విశ్వాసం ఉంచినట్లు తెలుస్తోంది. కాగా, రాహుల్​కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ఇప్పటికీ విశ్వసనీయమైన విపక్ష పార్టీగానే ఉందని నేతలు చెబుతున్నారు.

cwc meeting
సీడబ్ల్యూసీ మీటింగ్

CWC meet on election result: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆత్మపరిశీలన కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అయింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సుమారు నాలుగు గంటల పాటు చర్చలు జరిపింది. అధినేత్రి సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పీ చిదంబరం తదితరులు భేటీలో పాల్గొన్నారు.

cwc meeting
వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా, రాహుల్, చిదంబరం.. తదితరులు

గాంధీ కుటుంబం పార్టీకి దూరంగా ఉండాలని నేతలు భావిస్తే తనతో పాటు రాహుల్, ప్రియాంక రాజీనామా చేసేందుకు సిద్ధమని సోనియా పేర్కొన్నట్లు పేర్కొన్నాయి. అయితే, సీడబ్ల్యూసీ ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకించిందని స్పష్టం చేశాయి. నేతలందరి అభిప్రాయాలను సోనియా గాంధీ విన్నారని పార్టీ వర్గాలు వివరించాయి. 'అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ తప్పు జరిగిందనే విషయంపై నేతలు చర్చించారు. పార్టీ బలోపేతానికి అవసరమైన మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సోనియా స్పష్టం చేశారు. గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ వంటి నేతల అభిప్రాయాలను విన్నారు. రాజస్థాన్​లో చింతన్ శివిర్ నిర్వహించాలని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ సూచించారు' అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు సహా అన్ని ఎలక్షన్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుందని పార్టీ స్పష్టం చేసింది.

cwc meeting
ప్రియాంక గాంధీ
cwc meeting
ముకుల్ వాస్నిక్, అంబికా సోనీ, గులాం నబీ ఆజాద్

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సీడబ్ల్యూసీ పూర్తి విశ్వాసం ఉంచిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు పూర్తవగానే చింతన్ శివిర్ నిర్వహిస్తామని చెప్పారు. మరోసారి ఏఐసీసీ భేటీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పార్టీని బలోపేతం చేసేందుకు సోనియా తక్షణమే చర్యలు తీసుకుంటారని చెప్పారు.

cwc meeting
హరీశ్ రావత్

సోనియా మార్గనిర్దేశనంలో.. రాహుల్ అధ్యక్షుడిగా..!

సంస్థాగత ఎన్నికలు నిర్వహించేంత వరకు.. సీడబ్ల్యూసీలో ప్రతి సభ్యుడు సోనియా మార్గదర్శకత్వాన్ని కోరుకుంటున్నారని మరో సీనియర్ నేత సుర్జేవాలా పేర్కొన్నారు. పార్టీని రాహుల్ గాంధీ నడిపించాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కోరుకుంటున్నాడని చెప్పారు. సంస్థాగత ఎన్నికల కసరత్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఎన్నికల తర్వాత తర్వాతి అధ్యక్షుడు ఎవరో తేలిపోతుందని అన్నారు.

CWC meet today news

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మరో ముగ్గురు సీనియర్ నేతలు భేటీకి రాలేకపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కరోనా సోకడం వల్ల ఏకే ఆంటోనీ గైర్హాజరైనట్లు చెప్పారు.

రాహుల్​కు అధ్యక్ష బాధ్యతలు...

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ నేపథ్యంలో.. రాహుల్ గాంధీకి మరోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాహుల్ గాంధీలా మరే ఇతర నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కోవడం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొనే మోదీ ప్రసంగాలు ప్రారంభిస్తున్నారని, దీన్ని బట్టి రాహుల్ ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు.

అటు, సీడబ్ల్యూసీ భేటీ జరుగుతున్న సమయంలో రాహుల్​కు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. రాహుల్​, ప్రియాంకకు మద్దతుగా నినాదాలు చేశారు.

విశ్వసనీయ విపక్షం కాంగ్రెస్..

అయితే, దేశంలో భాజపా తర్వాత అత్యధిక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నారని శశిథరూర్ పేర్కొన్నారు. పార్టీని సంస్కరించి, పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అనేది దేశంలో విశ్వసనీయమైన విపక్ష పార్టీగా ఉందంటూ ట్వీట్ చేశారు.

అపజయాల పరంపర...

గతకొద్ది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. 2014లో మోదీ హవాతో సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించిన తర్వాత.. అడపదడపా విజయాలను పక్కనబెడితే కాంగ్రెస్​కు ఎదురుదెబ్బలే ఎక్కువ తగిలాయి. ఎన్నికలు జరుగుతున్నా కొద్దీ... కాంగ్రెస్ కోల్పోతున్న రాష్ట్రాల జాబితా పెరుగుతూ వచ్చింది. 2012లో 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి.. 2022 నాటికి రెండంటే రెండు రాష్ట్రాల స్థాయికి దిగజారింది.

2017 చివర్లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పూర్తిగా విఫలమైంది. లోక్​సభలో విపక్ష స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది. 2020 జులైలో రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత పూర్తిస్థాయి అధ్యక్షులను ఎన్నుకోలేని అనిశ్చితిలో పడిపోయింది.

ఇక, ఐదు రాష్ట్రాల ఫలితాలు కాంగ్రెస్ అస్తిత్వానికే పరీక్షగా మారాయి. ఇన్నాళ్లూ భాజపాకు ప్రత్యామ్నాయంగా కనీస పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్​కు ఇప్పుడు ఆమ్ ఆద్మీ రూపంలో చిక్కొచ్చి పడింది. కాంగ్రెస్, భాజపాలకు దీటుగా ఎదగాలని ఆప్ భావిస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ అత్యవసరమైన సంస్కరణలను దీర్ఘకాలం పాటు చేపడితేనే పార్టీ మనుగడ సాగించేందుకు ఆస్కారం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

దశాబ్ద కాలంగా.. 'హస్తం'లో గెలుపు రేఖలు అదృశ్యం!

హస్తానికి కష్టకాలం.. నాయకత్వ లోపమే శాపం

Last Updated :Mar 13, 2022, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.