ETV Bharat / bharat

'మహా'లో పెరుగుతున్న కేసులు- ప్రభుత్వం కఠిన ఆంక్షలు

author img

By

Published : Feb 21, 2021, 9:33 PM IST

corona lockdown in maharashtra
మహారాష్ట్రలో సోమవారం నుంచి సమావేశాలు బంద్​!

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి ప్రజలు గుమిగూడటాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపింది. వైరస్​ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో వారంపాటు పూర్తి లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించింది.

మహారాష్ట్రలో కరోనా కేసులు క్రమంగా మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి రాజకీయ, మతపరమైన, సామాజిక సమావేశాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ప్రజలు గుమిగూడటానికి వీల్లేదని చెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే ఆదివారం ప్రకటించారు. ప్రజలందరూ కొవిడ్​ నిబంధనలు పాటించాలని కోరారు.

"రాష్ట్రంలో మహమ్మారి మళ్లీ కోరల చాస్తోంది. ఇది వైరస్​లో కొత్త వ్యాప్తి అనేది మరో 8 నుంచి 15 రోజుల్లో బయటపడుతుంది. వైరస్​ను ఎదుర్కోవడానికి లాక్​డౌన్​ విధించడం పరిష్కారం కాకపోవచ్చు. కానీ, వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇదొక్కటే మార్గం. కొవిడ్​ పరిస్థితులు మరీ శ్రుతి మించితే లాక్​డౌన్​ విధిస్తాం. లాక్​డౌన్​ కావాలని కోరుకునే వారు మాస్కులు లేకుండా తిరుగుతారు. లాక్​డౌన్​ వద్దనుకునేవారు మాస్కు ధరిస్తారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తారు."

-ఉద్ధవ్​ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి

మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే 7,000 కరోనా కేసులు నమోదయ్యాయని ఉద్దవ్​ ఠాక్రే తెలిపారు.

అమరావతిలో పూర్తి లాక్​డౌన్​

కరోనా వైరస్‌ తీవ్రత క్రమంగా పెరుగుతున్నందున అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం తీవ్రత ఉన్నచోట్ల ఇప్పటికే కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి జిల్లాతో పాటు పలు జిల్లాల్లో వారంపాటు పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 22 రాత్రి నుంచి మార్చి 1వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో వారాంతం లాక్‌డౌన్‌ అమలులో ఉండగా, వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రాకపోవడం వల్ల పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అత్యవసర సేవలకు అనుమతి

వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో అమరావతి జిల్లాలో వారంపాటు పూర్తి లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని మహారాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి యశోమతి ఠాకూర్‌ వెల్లడించారు. ఈ సమయంలో అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి డివిజన్‌లోని అకోలా, యావత్‌మల్‌, బుల్ధానా, వాషిం నాలుగు జిల్లాల్లోనూ పలు ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే లాక్‌డౌన్‌ పొడగించే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం, వైరస్‌ కట్టడి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించింది. పరిస్థితి తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌, కర్ఫ్యూలపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పటికే పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు.

ఇదీ చదవండి:పెరుగుతున్న కరోనా కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.