అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి దిగ్విజయ్ ఔట్​.. రేసులో ఖర్గే.. నామినేషన్ వేసిన శశి థరూర్​

author img

By

Published : Sep 30, 2022, 12:49 PM IST

Updated : Sep 30, 2022, 1:14 PM IST

Congress president election
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ()

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. తన స్థానంలో మల్లికార్జున ఖర్గే పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఖర్గే అభ్యర్థిత్వాన్ని తానే ప్రతిపాదిస్తున్నట్లు దిగ్విజయ్ చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో నిలవడం పార్టీకి మంచిదేనని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్​. పోటీ నుంచి తప్పుకుంటునట్లు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన నామినేషన్ పత్రాలపై దిగ్విజయ్ సంతకం చేశారు. దీంతో ఖర్గే, శశిథరూర్​ మధ్యే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ జరగనుంది. మరోవైపు, మల్లిఖార్జున ఖర్గే అభ్యర్థిత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తెలిపారు.

'నా జీవితమంతా కాంగ్రెస్‌ కోసమే పనిచేశాను. ఇకపై కూడా పనిచేస్తా. దళితులు, గిరిజనులు, పేదల పక్షాన నిలబడతా. మత సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోరాడతా. ఇందులో రాజీపడే ప్రశక్తే లేదు. పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటా. మల్లిఖార్జున ఖర్గే నా సీనియర్. నేను ఆయన నివాసానికి వెళ్లి అధ్యక్ష ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేయమని కోరా. తాను దాఖలు చేయబోనని చెప్పారు. ఆ తర్వాత ఆయనే అభ్యర్థి అని పత్రికల ద్వారా తెలుసుకున్నాను.

--కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్

శశి థరూర్ నామినేషన్​..

పార్టీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నామినేషన్​ దాఖలు చేశారు. తన మద్దతుదారులతో కలిసి ఏఐసీసీ కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. అంతకుముందు రాజ్​ఘాట్​లో మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మరోవైపు పార్టీ అధ్యక్ష పదవికి ఝూర్ఖండ్ కాంగ్రెస్ నేత కేఎన్ త్రిపాఠి.. ఏఐసీసీ కార్యాలయంలో నామినేషన్​ దాఖలు చేశారు.

Congress president election
నామినేషన్ వేస్తున్న శశి థరూర్​

'మాది అంతా ఒకే భావజాలం, ఒకే రకమైన ఆదర్శాలు, విలువలు. పార్టీని బలోపేతం చేసేందుకే అధ్యక్ష ఎన్నికలు. అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ మంది పోటీ చేసే పార్టీకే మంచిది. ఖర్గేతో కలిసి లోక్​సభలో పనిచేశా. ఆయన మంచి వ్యక్తి. రేసు నుంచి నేను వైదొలగే ప్రశక్తే లేదు.

--శశి థరూర్

జీ-23 బృందం భేటీ..
మరోవైపు కాంగ్రెస్ అసంతృత్తి నేతల బృందం ఆనంద్ శర్మ ఇంట్లో నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్, భూపేంద్ర హుడా తదితరులు హాజరయ్యారు. 'ప్రజాస్వామ్య పద్దతిలో పార్టీలో ఎన్నికలు జరగడం శుభపరిణామం. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపుతున్నందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు. నామినేషన్ వేసిన వారిలో ఉత్తమ అభ్యర్థికి మద్దతిస్తాం' అని చవాన్ అన్నారు.

శుక్రవారమే చివరి తేదీ..
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారమే చివరి తేదీ. అక్టోబర్‌ 1న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంటుంది. అక్టోబర్‌ 17న ఓటింగ్‌ నిర్వహిస్తారు. రెండు రోజుల తర్వాత(అక్టోబర్ 19న) ఫలితాలు ప్రకటిస్తారు.

ఇవీ చదవండి: 'త్రిదళాల అవసరాలు తీర్చేందుకు కృషి'.. సీడీఎస్​గా బాధ్యతలు చేపట్టిన అనిల్ చౌహాన్

'అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు'.. గహ్లోత్ ప్రకటన.. సోనియాకు క్షమాపణ

Last Updated :Sep 30, 2022, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.