ETV Bharat / bharat

ఇంకా నిర్బంధంలోనే ప్రియాంక- కాంగ్రెస్ కార్యకర్తల తీవ్ర నిరసన

author img

By

Published : Oct 5, 2021, 12:01 PM IST

Updated : Oct 5, 2021, 12:37 PM IST

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని నిర్భంధించిన సితాపుర్‌ అతిథిగృహం వెలుపల ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అడ్డుగా ఉన్న బారికేడ్లను విసిరేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రియాంకను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.

Congress
ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు

ప్రియాంక విడుదలను కోరుతూ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

ఉత్తర్​ప్రదేశ్​ ఘటనలో మరణించిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తూ, హౌస్ అరెస్టైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విడుదలను కోరుతూ ఆ పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. ఆమెను నిర్బంధించిన సితాపుర్‌ అతిథి గృహం వెలుపల ఆందోళన చేపట్టారు. బారికేడ్లను విసిరేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.

తనను నిర్బంధించడంపై ప్రియాంక తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లఖింపూర్ హింసను అత్యంత హేయమైన ఘటనగా అభివర్ణించిన ఆమె.. ప్రజల గొంతుకను ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. ఈ ఘటనలో మరణించిన రైతు కుటుంబాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు సందర్శించడం లేదని నిలదీశారు.

Congress
ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు

'నిజమైన కాంగ్రెస్​వాదులు..'

ప్రియాంక గాంధీ నిర్బంధంపై రాహుల్ గాంధీ స్పందించారు. కాంగ్రెస్​కు చెందిన నిజమైన కార్యకర్తలెవరూ అంత తేలికగా ఓటమిని అంగీకరించరని ప్రియాంకను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. ఆమెను 'నిర్భయ', 'నిజమైన కాంగ్రెస్' కార్యకర్తగా అభివర్ణించారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేసిన రాహుల్.. 'సత్యాగ్రహం ఆగదు' అని స్పష్టం చేశారు.

మధ్యలోనే అరెస్ట్​...

సోమవారం లఖ్‌నవూ నుంచి లఖింపుర్‌ ఖేరికి బయల్దేరిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని.. సితాపుర్‌ వద్ద పోలీసులు అరెస్టు చేసి, సమీపంలోని ఓ అతిథి గృహానికి తరలించారు. ఘటనకు నిరసనగా ఆమె అక్కడే నిరాహార దీక్ష చేపట్టారు. చీపురు పట్టి, తనను ఉంచిన గదిని శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. అంతకుముందు ప్రియాంక మరో వీడియోలో మాట్లాడిన ప్రియాంక.. "ఈ దేశం రైతులది. భాజపాది కాదు. దగాపడ్డ రైతు కుటుంబాల బాధను పంచుకోవడానికి వెళ్తున్నా" అని వ్యాఖ్యానించారు. ప్రియాంకతో పాటు ఆమె వెంట ఉన్న మరికొందరిపై పోలీసులు అనుచితంగా వ్యవహరించారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

Congress
కాంగ్రెస్ నిరసనలో ధ్వంసమైన బ్యారికేడ్లు

లైవ్ వీడియో..

మరోవైపు.. ఉత్తర్​ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడి వాహనం దూసుకెళ్లిన ఘటనకు సంబంధించి ఓ వీడియో అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. ఇవి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా జరిగిన హింస తాలూకు దృశ్యాలేనని తెలుస్తోంది. ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకొని నిరసన చేస్తున్న అన్నదాతలపైకి ఓ వాహనం వేగంగా దూసుకు రావడం వీడియోలో కనిపిస్తోంది. మిర్జాపుర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత లలితేశ్ పాటి త్రిపాఠి ఈ వీడియోను ట్వీట్ చేశారు. లఖింపుర్ ఖేరి హింసాకాండకు ఇదే రుజువు అని చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 5, 2021, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.