ఆ రాష్ట్రంలో లాక్​డౌన్​- కేంద్రం నుంచి ప్రత్యేక బృందం

author img

By

Published : Jul 29, 2021, 10:40 AM IST

Updated : Jul 29, 2021, 12:35 PM IST

lockdown in kerala

కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో పూర్తిస్థాయి లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్రం తరఫున ఆరుగురు సభ్యుల నిపుణుల బృందం.. కేరళకు శుక్రవారం చేరుకోనుంది.

కేరళలో కరోనా కొత్త కేసులు ఆందోళకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శని, ఆదివారాల్లో(జులై 31, ఆగస్టు 1) పూర్తి స్థాయి లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించింది.

కేంద్రం హెచ్చరిక!

వైరస్​ ఉద్ధృతికి దారి తీసే 'సూపర్​ స్ప్రెడర్​ ఈవెంట్లు'.. కేరళలో ఇటీవల కనిపించాయని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్​ భూషణ్ లేఖ రాశారు. కరోనా నిబంధనలను ప్రజలంతా తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కేరళకు కేంద్ర బృందం..

కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ఆరుగురు నిపుణుల బృందం.. కేరళలో పర్యటించనుంది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్​సీడీసీ) డైరెక్టర్​​ ఎస్​కే సింగ్ నేతృత్వంలోని ఈ బృందం.. కేరళకు శుక్రవారం చేరుకుంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాలో పర్యటించనుందని చెప్పింది.

రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఈ బృందం పరిశీలించనుంది. వైరస్​ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయనుంది.

రెండో రోజూ 22వేల కేసులు..

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి వెలుగు చూసిన తొలిరోజుల్లో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో కేరళ ఉత్తమ పనితీరు కనబరిచింది. దేశవ్యాప్తంగా వైరస్‌ విలయతాండవం చేసిన సమయంలోనూ కేరళ ప్రభుత్వం మహమ్మారికి అడ్డుకట్ట వేయగలిగింది. దీంతో కేరళ తీసుకుంటున్న వైరస్‌ కట్టడి చర్యలను ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) కూడా కొనియాడింది. కానీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితులు తారుమారయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి అదుపులోకి వచ్చినప్పటికీ కేరళలో మాత్రం బుధవారం అత్యధికంగా 22వేల పాజిటివ్‌ కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది.

లక్షకు పైగా యాక్టివ్​ కేసులు

కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 33 లక్షల 27 వేలును దాటింది. అంతేగాకుండా వైరస్​ దాటికి ఇప్పటివరకు 16,457 మంది చనిపోయారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా యాక్టివ్​ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వైరస్‌ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గినప్పటికీ కేరళలో ఇంకా 10శాతానికిపైగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో 40శాతం ఒక్క కేరళలోనే ఉంటున్నాయి.

ఇదీ చూడండి: కరోనా వేళ భయపెడుతున్న మరో వ్యాధి

Last Updated :Jul 29, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.