ETV Bharat / bharat

'రూ.లక్ష కాదు రూ.2 కోట్లు కడతా.. కానీ జడ్జి అలా అనడం...'

author img

By

Published : Oct 25, 2021, 5:37 PM IST

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీ కారు ట్యాక్స్ విషయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని కోర్టును ఆశ్రయించారు తమిళ టాప్ హీరో విజయ్. తనను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలని కోరారు.

Comments passed by Judges had hurt me Says Actor Vijay
జడ్జి వ్యాఖ్యలపై హీరో విజయ్ విచారం.. ఆ పదాలు తొలగించాలని పిటిషన్​

ఈ ఏడాది జులైలో తమిళ టాప్ హీరో విజయ్​కు షాక్ ఇస్తూ లగ్జరీ కారుకు ఎంట్రీ ట్యాక్స్ కట్టాల్సిందేనని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. రూ.లక్ష జరిమానా కూడా విధింది. విజయ్ లాంటి వాళ్లు రీల్​ హీరోలుగా ఉంటే సరిపోదని, నిజజీవితంలోనూ హీరోగా ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అయితే జడ్జి చేసిన ఈ వాఖ్యలు తనను బాధించాయని హీరో విజయ్ తాజాగా కోర్టును ఆశ్రయించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై అభ్యంతరం తెలిపారు. తీర్పు నుంచి ఆ పదాలు తొలగించాలి పిటిషన్​లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వాదనలను విజయ్​ తరఫు న్యాయవాది విజయ్ నారాయణ్​ సోమవారం(అక్టోబర్​ 25) కోర్టులో వినిపించారు. ట్యాక్స్ ఎగ్గొట్టాలనే ఉద్దేశం విజయ్​కు లేదని, అప్పటికే దిగుమతి సుంకం చెల్లించినందు వల్ల ఎంట్రీ ట్యాక్స్ మినహాయించాలని కోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. ఎంట్రీ ట్యాక్స్ సమస్య గత 20 ఏళ్లుగా ఉందని, కేంద్రమే దాన్ని పరిష్కరించాలన్నారు. పిటిషన్​లో విజయ్ వృత్తి చెప్పలేదని జడ్జి కోప్పడటం సరికాదని కూడా విజయ్ నారాయణ్​ అన్నారు. ఆ పిటిషన్​లో వృత్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

కోర్టు ఆదేశాల మేరకు రూ.లక్ష జరిమానా చెల్లిస్తామని.. అవసరమైతే రూ.2కోట్లు చెల్లించేందుకు సిద్ధమేనని విజయ్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ తమ హీరోను కించపరిచేలా జడ్జి చేసిన వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలి కోరారు. న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేయొద్దని సుప్రీంకోర్టు కూడా చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

" హీరో విజయ్ లగ్జరీ కారు కొనుగోలు చేయడాన్ని జడ్జి తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎంతో శ్రమించి ఆయన కారు కొన్నారు. సినీ పరిశ్రమ లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ట్యాక్స్ ఎగ్గొట్టాలనే ఉద్దేశం విజయ్​కు లేదు. సామన్యుడిలానే తానూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఒకరిని జాతి వ్యతిరేకి అని ముద్రించడం సరికాదు. ఇతర కేసుల్లో జడ్జి ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. విజయ్​ మాత్రమే కాదు హీరోలు ధనుష్, సూర్య విషయంలోనూ ఇలానే జరిగింది. వాళ్లు నటులని ట్యాక్స్ విషయంలో విమర్శించారు. వ్యక్తిగతంగా ఈ వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం. ఏదో తప్పు చేసినట్లుగా మాట్లాడారు."

- విజయ్ తరఫు న్యాయవాది.

ఈ వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ సత్యనారాయణ, జస్టిస్ మహమ్మద్ షఫీక్​.. తీర్పు నుంచి న్యాయవాది వ్యాఖ్యలను తొలగించాలని ఎందుకు అడగకూడదని ప్రశ్నించింది. తదుపరి విచారణను నిరవధిక వాయిదా వేసింది.

తమిళనాట అత్యధిక పారితోషికం అందుకుంటున్న ప్రముఖ కథానాయకుల్లో ఒకరైన జోసెఫ్‌ విజయ్‌.. 2012లో ఇంగ్లండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీ కారు రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌కు ఎంట్రీ పన్ను మినహాయింపు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయగా.. మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఆపై లక్ష రూపాయల జరిమానా విధించింది. జరినామా మొత్తాన్ని 2 వారాల్లోగా తమిళనాడు సీఎం కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు జమ చేయాలని విజయ్‌ను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

ఇదీ చదవండి: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజనీకాంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.