ETV Bharat / bharat

రంగంలోకి రష్మీ.. ప్రభుత్వాన్ని కాపాడేందుకు తెరవెనుక రాజకీయం!

author img

By

Published : Jun 26, 2022, 1:34 PM IST

Updated : Jun 26, 2022, 2:45 PM IST

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. శివసేన రెబల్​ ఎమ్మెల్యేలు పట్టువీడటం లేదు. ఏక్​నాథ్​ శిందేతోనే ఉంటామంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే రంగంలోకి దిగారు. రెబల్​ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి వారి భార్యలతో మాట్లాడుతున్నారు. మరోవైపు 15 మంది శివసేన రెబల్​ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం.. వై ప్లస్​ సెక్యూరిటీ కల్పించింది.

M Uddhav Thackerays Wife Rashmi in Actio
M Uddhav Thackerays Wife Rashmi in Actio

CM Uddhav Thackerays Wife Rashmi: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పట్టు వీడటం లేదు. అసోంలోని గువాహటి క్యాంప్ నుంచి బయటకు అడుగుపెట్టడం లేదు. అవసరమైతే సీఎం పోస్టుకు రాజీనామా చేస్తానని ఉద్ధవ్ ఠాక్రే చెబుతున్నా రెబల్స్ ఎవరూ వినడం లేదు. ఏక్​నాథ్ శిందేతోనే ఉంటామని తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే రంగంలోకి దిగారు. ఆమె ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి.. వాళ్ల భార్యలతో మాట్లాడుతున్నారు. భర్తకు నచ్చజెప్పి, గువాహటి నుంచి వచ్చేయాలని చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నారు. సంక్షోభంలో పడిన తన భర్త ప్రభుత్వాన్ని మళ్లీ గట్టెక్కించేందుకు రష్మీ ఠాక్రే ఇలా తన వంతుగా కృషి చేస్తున్నారు.

15 మంది రెబల్ ఎమ్మెల్యేలకు వై ప్లస్​ సెక్యూరిటీ.. మహారాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం 15 మంది శివసేన రెబల్​ ఎమ్మెల్యేలకు వై ప్లస్​ సెక్యూరిటీ కల్పించింది. నలుగురైదుగురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు, షిఫ్టుల వారీగా ప్రతి ఎమ్మెల్యేకు భద్రతగా ఉంటారని కేంద్ర ఆదివారం తెలిపింది. కేంద్రం భద్రత కల్పించిన వారిలో రమేష్ బోర్నారే, మంగేష్ కుడాల్కర్, సంజయ్ శిర్సత్, లతాభాయ్​ సోనావానే, ప్రకాశ్​ సుర్వే సహా మరో 10 మంది ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పిస్తామని అధికారులు తెలిపారు.

కోర్టుకు ఏక్​నాథ్​ శిందే? శివసేన శాసనసభా పక్షనేతగా ఏక్​నాథ్​ శిందేను తొలగిస్తూ మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్​ తీసుకున్న నిర్ణయంపై న్యాయ సలహా కోరిన తర్వాత శిందే కోర్టును ఆశ్రయించనున్నారు. నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు డిప్యూటీ స్పీకర్​ కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలని శిందే వర్గాలు చెబుతున్నాయి. కానీ అలా జరగలేదని, అందుకే న్యాయపోరాటం చేయాలని భావిస్తున్నట్లు తెలిపాయి.

ఉద్ధవ్​ ఠాక్రేకు సోనియా ఫోన్​.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శనివారం ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఎన్సీపీతో పాటు కాంగ్రెస్ కూడా ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతు పలుకుతోంది. మరోవైపు.. మహారాష్ట్రలో సంక్షోభం మొదలైన కొద్దిరోజులకే గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కరోనా బారిన పడగా.. ఆదివారం ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్​ అయ్యారు.

'ఇంకెంత కాలం దాక్కుంటారు?' గువాహటిలోని ఉన్న శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్‌ విరుచుకుపడ్డారు. 'ఇంకెంత కాలం అసోంలో దాక్కుంటారు. చౌపట్టీకి తిరిగి రావాలి' అంటూ ఆ 16 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందించిన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌ ఫొటోను రౌత్‌ పోస్ట్​ చేశారు. మరో ఇంటర్వ్యూలో.. నిజమైన శివసైనికులు ఉద్ధవ్‌ ఠాక్రే వెంట ఉంటారని, వారు ముంబయి వస్తే.. తిరుగుబాటుదారుడెవరో అందరికీ తెలుస్తుందని అన్నారు. ఇప్పుడు తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలంతా తమ పదవులకు రాజీనామా చేసి.. ఎన్నికల్లో పోటీ చేయాలని సవాలు విసిరారు.

ఇవీ చదవండి: ఫడణవీస్​తో శిందే రహస్య భేటీ.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ!

'ప్రజాస్వామ్యం అణచివేతకు యత్నం.. ఆ చీకటి రోజులు మరవొద్దు!'

Last Updated :Jun 26, 2022, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.