ETV Bharat / bharat

పదేళ్లకే సంస్కృతంలో పాండిత్యం! 1500 శ్లోకాలను అలవోకగా చదివేస్తూ..

author img

By

Published : Nov 14, 2022, 3:45 PM IST

jaipur brothers sanskrit verses
jaipur brothers sanskrit verses

దేశంలోని అత్యంత ప్రాచీన భాష సంస్కృతం. వేద పండితులు మినహా ఈ భాషలో ప్రావీణ్యం ఉన్నవారు చాలా తక్కువ. భాషా కాఠిన్యం విషయం అటుంచితే.. పరభాషలకు ఇచ్చినంత ప్రాధాన్యం సంస్కృతానికి ఇవ్వడం లేదు. ప్రాచీన భాషను కాపాడుకోవాలన్న అవగాహన ఇప్పుడిప్పుడే పెరుగుతున్నా.. 'ప్రావీణ్యం' సంపాదించాలన్న కుతూహలం కొందరికే ఉంటోంది. అలాంటివారే రాజస్థాన్​కు చెందిన ఈ బాలలు. ఎంతో కఠినమైన పద్యాలను సైతం నాలుకపై అలవోకగా ఆడిస్తున్నారు.

jaipur brothers sanskrit verses
వాచస్పతి, వేదాంత్

పైచిత్రంలో ఉన్న వీరి పేర్లు వాచస్పతి, వేదాంత్. రాజస్థాన్​లోని జైపుర్​కు చెందిన వీరిద్దరి వయసు చిన్నదే. కానీ, సంస్కృత పండితుల్లా అలవోకగా శ్లోకాలు వల్లెవేస్తున్నారు. తమ విశేష ప్రతిభతో జైపుర్​లో అందరికీ సుపరిచితంగా మారారు. తొమ్మిదేళ్ల వాచస్పతి, పదేళ్ల వేదాంత్ తమ ప్రతిభతో అందరినీ ముగ్ధుల్ని చేస్తున్నారు. అమరకోశ, స్తోత్ర రత్నావళి, భగవద్గీత, రామచరిత మానస్ వంటి గ్రంథాల్లోని కఠినమైన పద్యాలను సైతం సులభంగా చెప్పేస్తున్నారు. కరోనా కాలంలో దొరికిన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని శ్లోకాలను నేర్చుకున్నారు ఈ బాలలు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ప్రేరణతో ఒక్కో పద్యం నేర్చుకుంటూ.. ఏకంగా పదిహేను వందల శ్లోకాలను కంఠస్తం చేశారు. ఇప్పటికీ సంస్కృత శ్లోకాలను రోజూ చదువుతున్నారు. ఉదయం స్కూల్​కు వెళ్లే ముందు, రాత్రి పడుకునే ముందు పద్యాలు చదివి వినిపిస్తున్నారు.

వీరు కంఠస్తం చేసిన పద్యాలు సాధారణమైనవేం కాదు. చాలా మంది పండితులు సైతం పుస్తకాలు చూస్తూనే వీటిని చదువుతుంటారు. ఇక సాధారణ వ్యక్తులకు అయితే నోరు తిరగడం కూడా కష్టమే. అలాంటి కఠినమైన శ్లోకాలను, పద్యాలను అవలీలగా చదివేస్తున్నారు. ఇలా తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సోదరులను ఈటీవీ భారత్ పలకరించింది. కరోనా సమయంలో వేదాంత్ తండ్రి (వాచస్పతి బాబాయ్) శాస్త్రి కౌశలేంద్ర దాస్.. సంస్కృత పద్యాలు చదువుకోవాలని వీరిద్దరికీ సూచించారు. వీరి ప్రోత్సాహంతోనే పద్యాలు కంఠస్తం చేయగలిగినట్లు చెప్పారు బాలలు.

వేదాంత్, వాచస్పతి.. సీబీఎస్ఈ ఇంగ్లిష్ మీడియం స్కూల్​లో చదువుకుంటున్నారు. స్కూల్​లో ఎవరితో మాట్లాడినా ఆంగ్లంలోనే. అలాంటిది వీరిద్దరూ ప్రత్యేక శ్రద్ధతో సంస్కృతాన్ని నేర్చుకున్నారు. ఆంగ్లంతో పాటు సంస్కృతాన్నీ చదువుకుంటున్నారు. 'నర్సరీ నుంచే సంస్కృత శ్లోకాలు కంఠస్తం చేయడం ప్రారంభించా. అందులో కొన్ని మాత్రమే ఇప్పుడు గుర్తున్నాయి. కరోనా సమయంలో మళ్లీ కొత్తగా నేర్చుకున్నా. ఇప్పుడు నాకు వచ్చిన శ్లోకాల సంఖ్య 1500కు చేరింది' అని వేదాంత్ చెబుతున్నాడు. 'ప్రతిరోజు శ్లోకాలతోనే నా రోజు మొదలవుతుంది. రాత్రి పడుకునే ముందు ఇంకొన్ని శ్లోకాలు నేర్చుకుంటా' అని వాచస్పతి తెలిపాడు.

ప్రస్తుతానికి శ్లోకాల అర్థం తమకు తెలియదని వీరిద్దరూ చెబుతున్నారు. పన్నెండేళ్లు వచ్చేవరకు శ్లోకాలు కంఠస్తం చేయాలని తమ కుటుంబ సభ్యులు చెప్పారని, ఆ తర్వాత వాటి అర్థం వివరిస్తామన్నారని తెలిపారు. వయసులో చిన్నవారైనా.. సంస్కృత పద్యాలను నాలుకపై ఆడిస్తున్న వీరిద్దరి ప్రతిభను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వాచస్పతి, వేదాంత్​తో ఈటీవీ భారత్ ఇంటర్వ్యూ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.