ETV Bharat / bharat

Children Aadhaar: నవజాత శిశువులకు ఆసుపత్రుల్లోనే ఆధార్‌!

author img

By

Published : Dec 17, 2021, 7:08 AM IST

aadhaar
ఆధార్‌

Children Aadhaar: అప్పుడే పుట్టిన పిల్లలకు ఆస్పత్రిలోనే వారి ఫొటో తీసుకొని ఒక్క క్లిక్‌తో ఆధార్‌ కార్డు జారీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్‌ అవసరం లేకుండానే ఆధార్‌ కార్డు జారీ చేసే ప్రక్రియ త్వరలో అందుబాటులోకి రానుంది.

Children Aadhaar: నవజాత శిశువులకు ఆధార్‌ కార్డు జారీ మరింత తేలిక కానుంది. పుట్టిన వెంటనే ఆస్పత్రుల్లోనే చిన్నారులకు ఆధార్‌ జారీ చేసే ప్రక్రియ త్వరలోనే మొదలు కానుంది. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు ఉడాయ్‌ సీఈఓ సౌరభ్‌ గార్గ్‌ ఈ విషయం వెల్లడించారు. ఇందుకోసం రిజిస్ట్రార్‌ ఆఫ్‌ బర్త్ విభాగంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

"అప్పుడే పుట్టిన పిల్లలకు ఆస్పత్రిలోనే వారి ఫొటో తీసుకొని ఒక్క క్లిక్‌తోనే ఆధార్‌ కార్డు జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఐదేళ్లలోపు చిన్నారులకు బయోమెట్రిక్‌ అవసరం లేదు. కేవలం వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి (తల్లి లేదా తండ్రి) ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేస్తాం. ఐదేళ్లు పూర్తైన తర్వాత చిన్నారుల బయోమెట్రిక్‌ తీసుకుంటాం. ఇప్పటికే 99.7 శాతం మందికి (131 కోట్ల మంది) ఆధార్‌ కార్డు జారీ చేశామని, ఇక నవజాత శిశువుల ఆధార్‌ నమోదుకు కృషి చేస్తున్నాం. ఏటా 2-2.5 కోట్ల జననాలు జరుగుతున్నాయి. వారికి పుట్టిన వెంటనే ఆధార్‌ నంబర్‌ కేటాయించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం."

---సౌరభ్‌ గార్గ్‌, ఉడాయ్‌ సీఈఓ

ఆధార్‌తో రూ.2.25 లక్షల కోట్లు ఆదా

ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ అనుసంధానం ద్వారా నకిలీ లబ్ధిదారుల కట్టడి సాధ్యమవుతోందని, దీంతో ఇప్పటివరకు ఖజానాకు రూ.2.25 లక్షల కోట్లు ఆదా అయిందని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) సీఈఓ సౌరభ్ గార్గ్ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కేంద్రానికి సంబంధించిన 300, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 400 పథకాలు ఆధార్‌తో అనుసంధానమైనట్లు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీల(డీబీటీ) ద్వారా కేంద్రం రూ.2.25 లక్షల కోట్లను ఆదా చేసినట్లు చెప్పారు.

అప్లికేషన్‌ రూపొందిస్తున్నాం..

'దేశంలోని 6.5 లక్షల గ్రామాలను కవర్ చేసేందుకు త్వరలో 50 వేల ఆధార్‌ కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. 1.5 లక్షల మంది పోస్టుమ్యాన్లు ఆధార్‌ అప్‌డేషన్‌, కొత్తవాటి నమోదు కోసం గ్రామగ్రామాలకు వెళ్లనున్నారు. దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు తమ ఆధార్ రికార్డులను అప్‌డేట్ చేసుకునేందుకు యాప్‌ను రూపొందిస్తున్నాం' అని ఆయన వివరించారు. ఆధార్‌ను మరింత బలోపేతం, సురక్షితం చేసేందుకు కృత్రిమ మేథ, బ్లాక్‌చెయిన్, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతికతలను వినియోగించాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.