ETV Bharat / bharat

'కొవిషీల్డ్ వికటించింది.. రూ.5 కోట్లు ఇవ్వండి'

author img

By

Published : Nov 29, 2020, 10:49 AM IST

కొవిషీల్డ్ టీకా తనపై దుష్ప్రభావం చూపించిందని చెన్నైకి చెందిన ఓ వలంటీర్ ఆరోపించారు. టీకా ప్రయోగాల్లో పాల్గొన్న తనకు తీవ్రమైన సమస్యలు తలెత్తాయని.. ఇందుకు పరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీకా తయారీదారులతో పాటు, నియంత్రణ సంస్థలకు నోటీసులు పంపించారు.

Chennai volunteer Rs 5 cr
'కొవిషీల్డ్ వికటించింది.. రూ. 5 కోట్లు ఇవ్వండి'

కొవిషీల్డ్ టీకా ట్రయల్స్ నిర్వహిస్తోన్న సీరం సంస్థపై చెన్నైకి చెందిన ఓ వలంటీర్ రూ.5 కోట్ల దావా వేశారు. టీకా మానవ ప్రయోగాల్లో పాల్గొన్న తర్వాత తనకు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు టీకా తయారీదారులతో పాటు, నియంత్రణ సంస్థలకు నోటీసులు పంపించారు.

వ్యాక్సిన్ తీసుకున్న పది రోజుల వరకు ఎలాంటి ప్రభావం కనిపించలేదని, కానీ ఆ తర్వాతి రోజు తనకు విపరీతమైన తలనొప్పి, వాంతులు వంటి సమస్యలు తలెత్తినట్లు బాధితుడు తన నోటీసులో తెలిపారు. బెడ్​పై నుంచి పైకి లేచేందుకు తన ఆరోగ్యం సహకరించలేదని పేర్కొన్నారు.

"తీవ్రమైన నాడీ సంబంధిత సమస్యలు మా క్లైంట్​లో తలెత్తాయి. దీనికి సంబంధించి సీరం ఇన్​స్టిట్యూట్, ఐసీఎంఆర్, ఆస్ట్రాజెనకా(యూకే), డీజీసీఐ, ఆక్స్​ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆండ్రూ పోలార్డ్​లకు నోటీసులు జారీ చేశాం. నవంబర్ 21న నోటీసు పంపించాం.. ఇప్పటికీ ఏ ఒక్కరి నుంచి స్పందన రాలేదు."

-ఎన్​జీఆర్ ప్రసాద్, న్యాయవాది

నోటీసులోని వివరాల ప్రకారం తీవ్రమైన మస్తిష్కవికృతి(అక్యూట్ ఎన్​సెఫలోపతి)తో ఇబ్బంది పడ్డారని ఆస్పత్రి తన డిశ్చార్జి నివేదికలో పేర్కొంది.

"బాధితుడు 16 రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. అన్ని మెడికల్ టెస్టుల్లోనూ ఆయనకు నెగెటివ్ వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన విషయాలపై పూర్తి దర్యాప్తు జరిగింది. కానీ ఇవేవీ ప్రస్తుత అనారోగ్యానికి కారణం కాదని తేలింది. ప్రయోగాత్మక వ్యాక్సిన్​ వల్లే ఈ ప్రతికూలతలు తలెత్తాయని తెలుస్తోంది."

-నోటీసులోని వివరాలు

40 ఏళ్ల వయసున్న ఆయన.. చెన్నైలో బిజినెస్ కన్సల్టెంట్​గా పనిచేస్తున్నారు. ఇప్పటికీ ఆయన పరిస్థితి సరిగా లేదని వలంటీర్ భార్య పేర్కొన్నారు. మానసిక స్థితి తరచుగా మారిపోతోందని, ఏ విషయాలపైనా దృష్టిసారించలేకపోతున్నారని తెలిపారు. రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నారని చెప్పారు.

వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్ అనారోగ్యంపై నెల రోజుల తర్వాత కూడా ఎవరూ స్పందించలేదని, డీజీసీఐ, ఐసీఎంఆర్, ఎస్​ఐఐ తమను సంప్రదించలేదని నోటీసులో తెలిపారు. ఇది డబ్ల్యూహెచ్​ఓ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.