ETV Bharat / bharat

Chandrababu Quash Petition Hearing in SC: 17ఎ వర్తించేలా కనిపిస్తోంది.. స్కిల్‌ డెవలప్​మెంట్ కేసులో సుప్రీం వ్యాఖ్య

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 8:21 AM IST

Chandrababu Quash Petition Hearing in SC: స్కిల్‌ కేసులో జైలులో ఉన్న చంద్రబాబు విషయంలో అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17ఎ వర్తించేలా కనిపిస్తోందని జస్టిస్‌ అనిరుద్ద బోస్‌ అభిప్రాయపడ్డారు. సెక్షన్‌ 17ఎపై చంద్రబాబు న్యాయవాదులు సుధీర్ఘంగా వాదనలు వినిపించారు. అధికార విధుల్లో తీసుకున్న నిర్ణయాలకు సెక్షన్‌ 17ఎ వర్తిస్తుందని స్పష్టం చేశారు. స్కిల్‌ డవలప్‌మెంట్‌ కేసు విచారణ 2021 నుంచే ప్రారంభమైంది అనడానికి అవసరమైన వివరాలను న్యాయవాదులు సమర్పించారు. అవినీతి నిరోధక చట్టంలో ఈ సెక్షన్‌ వర్తించినప్పుడు గవర్నర్‌ ముందుస్తు అనుమతి తప్పనిసరి అని వాదనల్లో పేర్కొన్నారు. కోర్టు సమయం ముగియడంతో ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి.

Chandrababu Quash Petition Hearing in SC
Chandrababu Quash Petition Hearing in SC

Chandrababu Quash Petition Hearing in SC: 17ఎ వర్తించేలా కనిపిస్తోంది.. స్కిల్‌ డెవలప్​మెంట్ కేసులో సుప్రీం వ్యాఖ్య

Chandrababu Quash Petition Hearing in SC: సెక్షన్ 17ఎ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదుచేయడానికి వీల్లేనందున దాన్ని కొట్టేయాలని కోరుతూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేదితో కలిసి జస్టిస్ అనిరుద్ధబోస్ విచారణ జరిపారు. ఈనెల 3న ఈ కేసుపై విచారించి.. హైకోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్లను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కేసును వాయిదా వేసిన ధర్మాసనం.. సోమవారం దీనిపై రెండు గంటలకు పైగా దీనిపై విచారించింది. చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే సుదీర్ఘ వాదనలు విన్నాక.. ఈ కేసులో వాస్తవాలను పరిశీలించినప్పుడు సెక్షన్ 17ఎ వర్తించేలా కనిపిస్తోందని.. జస్టిస్ అనిరుద్ధబోస్ వ్యాఖ్యానించారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2021 డిసెంబరు నుంచే విచారణ మొదలైనందున ఇందులో అరెస్ట్ అయిన చంద్రబాబుకి అవినీతి నిరోధక చట్టం లోని సెక్షన్ 17ఎ వర్తిస్తుందని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్‌ సాల్వే పేర్కొన్నారు. గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా చంద్రబాబుపై ఎంక్వయిరీ, ఇంక్వయిరీ, దర్యాప్తు చేపట్టడానికి వీల్లేదని విన్నవించారు. సీనియర్ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రాలు 17ఎ సెక్షన్ గురించే వాదనలు వినిపించారు. కోర్టు పనివేళలు ముగిసే సమయానికి వాదనలు పూర్తి కాకపోవడంతో మంగళవారం ఉదయం 10.30 గంటలకు తిరిగి విచారణ కొనసాగిస్తామని చెప్పి న్యాయమూర్తులు కేసును వాయిదా వేశారు.

ఈ కేసులో విచారణ 17ఎ సెక్షన్ అమల్లోకి రాక ముందే 2018లోనే ప్రారంభమైందని, అందువల్ల ఆ నిబంధన దీనికి వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను హరీశ్‌ సాల్వే తోసిపుచ్చారు. ఏదైనా పాత ఫిర్యాదుపై విచారణ చేపట్టి విచారణలో తుది నిర్ణయానికి రాలేకపోతే దాన్ని పక్కన పెట్టినట్లేనని గతంలోని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ 2021 సెప్టెంబరులో కొత్తగా ఫిర్యాదు చేశారని.. దాని కంటే ముందు 17ఎ సెక్షన్ అమల్లోకి వచ్చిందని వాదనలు వినిపించారు. గతంలో ఈ కేసుపై విచారణ చేపట్టినప్పటికీ అందులో ఏమీ తేలలేదని, అందుకు చంద్రబాబే కారణమని రిమాండ్ రిపోర్టులో పదేపదే పేర్కొన్నారని తెలిపారు. అందుకే కోర్టు చంద్రబాబును రిమాండ్‌కు ఇచ్చేటప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావించిందని.. 2021లో ఎఫ్​ఐఆర్ నమోదు చేసినట్లు గుర్తించిందని సాల్వే పేర్కొన్నారు.

అయితే ఈ కేసులో నేరం 17ఎ సెక్షన్ రావడం కంటే ముందు జరిగింది కాబట్టి ఆ సెక్షన్ ఇక్కడ వర్తించదని కింది కోర్టు చెప్పిందని వాదించారు. హైకోర్టులో 17ఎ అన్నది నేరం జరిగిన తేదీకి వర్తిస్తుందా? లేదంటే ఎఫ్​ఐఆర్ నమోదు చేసిన తేదీకి వర్తిస్తుందా? అనే అంశంపై వాదనలు వినిపించామని సాల్వే వివరించారు. 17ఏ సెక్షన్ కేవలం అవినీతి నిరోధక కేసులకే వర్తిస్తే మిగతా ఐపీసీ కేసుల సంగతేంటని హైకోర్టులో న్యాయమూర్తులు అడిగారని.. ఇక్కడ అవినీతి నిరోధక చట్టం కింద కేసు లేకపోతే ఈ కేసులో రిమాండ్ కోసం సాధారణ మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లాలి తప్పితే ఏసీబీ ప్రత్యేక కోర్టుకు వెళ్లడానికి వీల్లేదన్నారు. ఒకవేళ ఇందులో అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్లు తీసేస్తే మాకు ఉపశమనం లభిస్తుందని హరీశ్ సాల్వే వాదించారు.

Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు.. విచారణ రేపటికి వాయిదా

ఈ పిటిషన్‌ను వెనక్కు పంపవచ్చా: ఈ సమయంలో జస్టిస్‌ బేలా ఎం.త్రివేది జోక్యం చేసుకుంటూ హైకోర్టులో మీ వాదనలు పూర్తైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ డాక్యుమెంట్లు సమర్పించిందనుకుంటే, ఒకవేళ దానిపై మీ వాదనలు వినిపించడానికి అక్కడ అవకాశం రాక, దానికి వ్యతిరేకంగా కౌంటర్‌ దాఖలు చేయలేక పోయి ఉంటే మేం మెరిట్స్‌లోకి వెళ్లకుండా ఈ పిటిషన్‌ను వెనక్కు పంపవచ్చా..అని అడిగారు. అయితే అందుకు ఏపీ ప్రభుత్వం తరుఫున హాజరైన రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి బదులిస్తూ 2018లోనే ఈకేసు విచారణ ప్రారంభమైందన్న విషయాన్ని హైకోర్టులో జడ్జిమెంట్‌ రిజర్వ్‌ అయ్యాక చివరలో చెప్పారన్న విషయం నిజంకాదని, ఆ విషయం రిమాండ్‌ రిపోర్టులో కూడా ఉందన్నారు. దానిపై ఇరుపక్షాల న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించినట్లు పేర్కొన్నారు.

ఆ వాదనలను హరీశ్‌సాల్వే తోసిపుచ్చారు. తాము వారు చెప్పారు, వీరు చెప్పారన్న దానితో సంబంధం లేకుండా ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌లో దాఖలు చేసిన దస్తావేజుల ప్రకారం చెబుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కేసు 2018లో విచారణ ప్రారంభమైనట్లు అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకున్నట్లు హైకోర్టు తీర్పులో ఉందన్నారు. అయితే ఈ డాక్యుమెంటును అక్కడ సమర్పించకపోయినా, హైకోర్టు ఈ కేసులో 17ఏ వర్తింపునకు నేరం జరిగిన తేదీని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పిందని, అందువల్ల ఇప్పుడు మళ్లీ వెనక్కు పంపడంవల్ల కొత్తగా చేకూరే ప్రయోజనం ఏమీ ఉండదని.. అందుకే తాము ఇక్కడే వాదనలు వినిపించాలి ఆనుకుంటున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో ఈ కేసులో ప్రాథమిక విచారణ 2021లోనే ప్రారంభమైనట్లు స్పష్టంగా ఉందన్న చంద్రబాబు న్యాయవాది.. 2021 సెప్టెంబర్‌ 7న వచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ ప్రాథమిక విచారణ ప్రారంభించారని స్పష్టం చేశారు. ఆ ఫిర్యాదులో ఎక్కడా పిటిషనర్‌ చంద్రబాబు పేరు లేదన్నారు. APSSDC ఛైర్మన్‌ 2021 సెప్టెంబరు 7న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, ప్రాథమిక విచారణ జరిపి డిసెంబరు 9న నివేదిక ఇవ్వగా, అదే రోజు ఎఫ్​ఐఆర్ నమోదు చేసినట్లు రికార్డులను బట్టి తెలుస్తోందన్నారు. ఇందులో అవినీతి నిరోధకచట్టంలోని సెక్షన్లు ఉన్నందున విచారణ ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు ప్రారంభమైనట్లు వివరించారు.

ఒకవేళ ఈ కేసు విచారణ 2018 జూన్ 5నే ప్రారంభమై ఉంటే హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఆ డాక్యుమెంట్నే పొందుపరిచేదన్నారు, కానీ అదెక్కడా కనిపించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రఫేల్ కేసులో ఎఫ్​ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు జారీచేయమని యశ్వంత్ సిన్హా కోర్టును ఆశ్రయిస్తే జస్టిస్ జోసెఫ్ నాడు 17ఎ సెక్షన్ గురించి ప్రశ్నించారని తెలిపారు. నేరం ఆ సెక్షన్ రాకముందే జరిగినప్పటికీ తర్వాత 17ఎ అమల్లోకి వచ్చినందున అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎఫ్​ఐఆర్ నమోదు చేయమని తాము ఆదేశించలేమని ఆ ధర్మాసనం తీర్పు చెప్పిందన్నారు. అందువల్ల ఈ విషయంలో గవర్నర్ అనుమతి లేకుండా ఎఫ్​ఐఆర్ నమోదు చేయమని చెప్పే అధికారం రాజ్యాంగ న్యాయస్థానాలకూ లేదన్నారు.

High Court on Chandrababu Bail Petitions: డీమ్డ్ కస్టడీగా పరిగణించలేం.. చంద్రబాబు బెయిలు పిటిషన్లను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు

అప్పుడు ఈ చట్టం వర్తింపచేయడానికి వీల్లేదు: ప్రభుత్వ ఉద్యోగులు అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని, అధికార విధుల్లో లేకపోతే ఆ చట్టం వర్తించదన్నారు. ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగి సైకిల్ ఎత్తుకుపోతే అప్పుడు ఈ చట్టం వర్తింపచేయడానికి వీల్లేదన్నారు. అప్పుడు జస్టిస్ అనిరుద్ధబోస్ జోక్యం చేసుకుంటూ అయితే మీ క్లయింట్ కేసులో వాస్తవాలను చూసినప్పుడు 17ఎ వర్తిస్తున్నట్లు కనిపిస్తోందని అనగా, హరీశ్ సాల్వే అవునని అన్నారు. ఇక్కడ తమ క్లయింట్ అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాల గురించే పోలీసులు రిమాండు రిపోర్టులో చెప్పారని తెలిపారు. ఇక్కడ చర్యలన్నీ నిర్ణయాలకు సంబంధించినవేనని గుర్తుచేశారు. అధికార విధులు నిర్వర్తించినంత మాత్రాన అవినీతి చేసినట్లుకాదన్నారు.

అయితే ఇక్కడ పోలీసులు మీరు నేరం చేసినందున అనుమతి అవసరం లేదంటున్నారని, దాని కోసం అనుమతి తీసుకోకపోతే ఇంక దేనికోసం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందో చెప్పాలన్నారు. అప్పుడు జస్టిస్ బేలా త్రివేది జోక్యం చేసుకొని బహుశా ఇక్కడ 90 శాతం వాటా తొలుత వచ్చిందా లేదా? అని చూసుకోకుండా 10శాతం నిధులు మంజూరు చేశారన్నది ఆరోపణ కావొచ్చని అనగా.. దానిపై విచారణ జరుగుతున్నందున ఇప్పుడు మాట్లాడలేమని హరీశ్‌ సాల్వే అన్నారు. అయితే ఒప్పందం ప్రకారం 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్లు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అప్పగించారని, 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ కేసులో ఇప్పటికే అందరు నిందితులకు బెయిల్ వచ్చిందని, బెయిల్ మంజూరు చేసేటప్పుడు హైకోర్టు ఈ సెంటర్ల పనితీరు, అందులో శిక్షణ పొందిన విద్యార్థుల గురించి బలంగా చెప్పిందన్నారు. ఆ సమయంలో జస్టిస్ త్రివేది జోక్యం చేసుకొని మీ బెయిల్ కింది కోర్టులో పెండింగ్ ఉందా? అని అడగ్గా.. ఇప్పుడే దానిని కొట్టేసినట్లు తెలిసిందని హరీశ్ సాల్వే ధర్మాసనానికి తెలియజేశారు. అయితే 17ఎ విషయంలో తమ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటే మొత్తం కేసే లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఆయన అరెస్ట్ కూడా చట్టవిరుద్ధమవుతుందన్నారు. 17ఎ అన్నది ఇప్పుడున్న ఉద్యోగులకే కాకుండా మాజీలకూ వర్తిస్తుందన్నారు. పాత కేసుల్లో విచారణ చేయొచ్చని, అయితే అందులో పబ్లిక్ సర్వెంట్ల పాత్ర వచ్చినప్పుడు మాత్రం 17ఎ కింద ముందస్తు అనుమతి లేకుండా చేపట్టడానికి వీల్లేదన్నారు.

ఈ సెక్షన్ పాతనేరాలకూ వర్తిస్తుందని, అలా కాకపోయి ఉంటే ఈ సెక్షన్లోనే ఇది అమల్లోకి వచ్చిన జరిగిన నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పేవారన్నారు. క్రిమినల్ కేసుల్లో ప్రొసీజర్స్ అన్ని పాత నేరాలకూ వర్తిస్తాయని, అది అందరికీ తెలిసిన ఫార్ములా కాబట్టే పార్లమెంటు దాని గురించి ప్రత్యేకంగా చెప్పలేదన్నారు. లేదంటే 2018 సంవత్సరం తర్వాత జరిగే నేరాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని ప్రత్యేకంగా పేర్కొనేవారన్నారు. అందుకే పాత, కొత్త అనే సంబంధం లేకుండా ఎవరిపై విచారణ మొదలుపెట్టాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఈ నిబంధన చెబుతోందన్నారు.

Chandrababu Naidu judicial remand extended: చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్​ 19 వరకు పొడిగింపు

రాజకీయ ప్రతీకారాలను నిలువరించేందుకే.. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17ఎ చేర్చినట్లు హరీశ్‌ సాల్వే చెప్పారు. ఈ కేసులో ఎఫ్​ఐఆర్​లో చంద్రబాబు పేరును 2023 సెప్టెంబరు 8న చేర్చారని, అందువల్ల అప్పుడు తప్పనిసరిగా గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ 17ఎకు ముందు నేరం జరిగినా లేదా ఆ సెక్షన్ చేర్చిన తర్వాత పబ్లిక్ సర్వెంట్​ను నిందితుడిగా చేర్చినా వారికి 17ఎ వర్తిస్తుందా? లేదా? అని అడగ్గా వర్తిస్తుందని హరీశ్ సాల్వే చెప్పారు. పబ్లిక్ సర్వెంట్​గా అధికారిక హోదాలో నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిని విచారణ పేరుతో వేధించకుండా నియంత్రించడానికి 17ఎ సెక్షన్‌ను చేర్చినట్లు వివరించారు.

అప్పుడు జస్టిస్ అనిరుద్ధ బోస్ జోక్యం చేసుకుంటూ ఏదైనా నేరంపై విచారణ చేస్తున్నప్పుడు అందులో పబ్లిక్ సర్వెంట్ ప్రమేయం ఉందని తేలినప్పుడే 17ఎ వర్తిస్తుందా? అని అడగ్గా హరీశ్‌ సాల్వే అవునని సమాధానమిచ్చారు. తర్వాత జస్టిస్ బేలా త్రివేది జోక్యం చేసుకుంటూ ప్రతి పబ్లిక్ సర్వెంట్​కు ముందస్తు అనుమతి తీసుకోవాలా.. ఒకవేళ తీసుకోకపోతే దర్యాప్తు చెల్లదా అని ప్రశ్నించగా చెల్లదని హరీశ్‌ సాల్వే బదులిచ్చారు. ఈ కేసులో చంద్రబాబును సెప్టెంబరు 8న చేర్చారని, అంతకుముందు ఆయన పాత్ర ఉన్నట్లు ఎవ్వరూ చెప్పలేదన్నారు. ఆయన్ను చేర్చడానికి ముందు 17 ఎ కింద తప్పనిసరిగా గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటివరకూ ఏ పబ్లిక్ సర్వెంట్ విచారణ కోసమూ 17ఎ కింద ముందస్తు అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఈ సమయంలో జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ 17ఎకి భాష్యం చెప్పే సమయంలో అవినీతి నిరోధక చట్టం ప్రధాన ఉద్దేశం దెబ్బతినకుండా చూడాల్సి ఉంటుంది కదా? అని అనగా.. న్యాయవాది హరీశ్‌ సాల్వే ఆ అభిప్రాయంతో ఏకీభవించారు. 17ఎ సెక్షన్ అవినీతి నిరోధక చట్టాన్ని బలహీనపరచకుండా మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొనే ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు, పోలీసులు వ్యవహరించాల్సిన తీరు గురించి స్పష్టంగా చెప్పిందన్నారు.

High Court Dismissed Chandrababu Bail Petitions: చంద్రబాబు దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు.. బెయిల్‌, కస్టడీ పిటిషన్లు కొట్టివేసిన ఏసీబీ కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.