ETV Bharat / bharat

డ్రగ్స్​ కేసు: సమీర్‌ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు

author img

By

Published : May 27, 2022, 9:37 PM IST

wankhede sameer latest news
wankhede sameer latest news

central on sameer wankhede: క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆర్యన్​ ఖాన్​కు క్లీన్​ చిట్​ లభించడంతో.. సమీర్​పై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

central on sameer wankhede: క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌ చిట్‌ లభించిన నేపథ్యంలో ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. "డ్రగ్స్‌ కేసులో పేలవంగా దర్యాప్తు చేపట్టినందుకు గాను సమీర్‌ వాంఖడేపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పాటు ఆయన తప్పుడు కుల ధ్రువపత్రాల ఆరోపణలపైనా చర్యలు చేపట్టనున్నాం" అని హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

డ్రగ్స్‌ కేసులో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయ్యాడు. ఈ కేసులో తొలుత ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సమయంలో సమీర్‌ వాంఖడేపై అనేక ఆరోపణలు వచ్చాయి. డబ్బులు గుంజేందుకే ఆర్యన్‌ను కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారంటూ ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్ ఆరోపించారు. అంతేగాక, వాంఖడే ముస్లిం అని, ఉద్యోగం పొందేందుకు ఎస్సీగా తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారంటూ ఆరోపణలు చేశారు. దీంతో వాంఖడే రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఈ క్రమంలోనే ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్‌గా వాంఖడే పదవీ కాలం ముగియడం వల్ల ఆయనను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్​కు (డీఆర్‌ఐ) బదిలీ చేశారు.

అనంతరం డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు నిమిత్తం ఎన్‌సీబీ సిట్‌ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో అతడికి క్లీన్‌ చిట్‌ ఇస్తున్నట్లు ఎన్‌సీబీ శుక్రవారం.. ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశించడం గమనార్హం. కాగా.. వాంఖడే నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో అనేక అవకతవకలు జరిగినట్లు తాజాగా బయటికొచ్చింది. ఈ కేసులో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టినప్పుడు ఎలాంటి వీడియోగ్రఫీ చేయలేదని తెలుస్తోంది. అంతేగాక, ఒక సాక్షి నుంచి ఖాళీ పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్​కు క్లీన్​చిట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.