ETV Bharat / bharat

దేశంలో 10 లక్షల ఉద్యోగాలకు కేంద్రం కసరత్తు: మోదీ

author img

By

Published : Oct 29, 2022, 10:20 PM IST

centre-is-working-on-providing-10-lakh-jobs-says-pm-modi
దేశంలో మరో 10 లక్షల ఉద్యోగాలకు కేంద్రం కసరత్తు

దేశవ్యాప్తంగా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.

దేశవ్యాప్తంగా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గుజరాత్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగమేళాలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుజరాత్‌ పంచాయతీ సర్వీసుబోర్డు పరిధిలో 5000 మందికి, గుజరాత్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరిధిలో 8000 మందికి అపాయింట్‌మెంట్ పత్రాలను ముఖ్యమంత్రి భుపేంద్ర పాటిల్‌ అందించారు. ఇటీవల ధనత్రయోదశి రోజున నిర్వహించిన ఉద్యోగమేళాలో దేశవ్యాప్తంగా 75 వేలమంది అభ్యర్థులకు వివిధ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను జారీ చేసినట్లు మోదీ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల్లోనూ ప్రారంభిస్తామని చెప్పారు.

'దేశ వ్యాప్తంగా 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.' అని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు సకాలంలో లబ్ధిదారులకు చేరవేసేలా కృతనిశ్చయంతో పని చేయాలని నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులకు మోదీ దిశానిర్దేశం చేశారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ చేరాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని, దీని కోసం రానున్న 25 సంవత్సరాలు ఎంతో కీలకమని మోదీ వ్యాఖ్యానించారు. సమాజం కోసం, దేశం కోసం ప్రతిఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. 2022లో 35వేల ఉద్యోగాలను భర్తీ చేసి గుజరాత్‌ ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకుందని మోదీ కితాబిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.