ETV Bharat / bharat

రక్షణ, హోంశాఖ సెక్రటరీల పదవీకాలం పొడిగింపు

author img

By

Published : Nov 16, 2021, 12:30 AM IST

Updated : Nov 16, 2021, 4:59 AM IST

జాతీయ భద్రతా ఏజెన్సీల విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా ఏజెన్సీ చీఫ్​ల పదవీకాలన్ని మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.

goi
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ డైరెక్టర్ల పదవీకాలాన్ని అయిదేళ్ల వరకు పొడిగించేందుకు వీలు కల్పిస్తూ ఆదివారం రెండు ఆర్డినెన్సులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక చర్య చేపట్టింది. రక్షణ, హోం శాఖల కార్యదర్శులు, ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) డైరెక్టర్ల పదవీకాలాన్నీ రెండేళ్లపాటు పొడిగించడానికి అవకాశం కల్పించేలా ప్రాథమిక నిబంధనలు (ఫండమెంటల్‌ రూల్స్‌)-1922లోని రూల్‌-56ను సవరించింది.

కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ సోమవారం ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రజాప్రయోజనం ఉన్నట్లు భావిస్తే కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ, హోం శాఖ, ఐబీ, రా, సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించొచ్చని అందులో పేర్కొంది. ప్రతి కేసును ప్రత్యేకంగా పరిశీలించి, ఎంతకాలం వరకు పొడిగించవచ్చో విశ్లేషించి అంతవరకు పొడిగించడానికి వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. పదవీకాలం పొడిగింపునకు దారితీసిన కారణాలను లిఖితపూర్వకంగా పొందుపరచాలని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధనల కింద కార్యదర్శులు, డైరెక్టర్లకు వర్తింపజేసే పదవీకాల పొడిగింపు రెండేళ్లుకానీ, లేదంటే ఈ పదవుల నియామకానికి వర్తించే చట్టాల్లో పొందుపరిచిన గడువుకానీ మించకూడదని షరతు విధించింది.

విమర్శలతో విరుచుకుపడ్డ ప్రతిపక్షాలు

సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలాన్ని అయిదేళ్లపాటు పొడిగించేందుకు వీలుగా కేంద్రం ఆర్డినెన్సులను తీసుకురావడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. సర్కారు చర్యపై పార్లమెంటు వేదికగా గళమెత్తుతామని తెలిపాయి. శీతాకాల సమావేశాలకు మరో రెండు వారాలే ఉండగా ఇంత అత్యవసరంగా ఆర్డినెన్సులు తీసుకురావడమేంటని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి ప్రశ్నించారు. ప్రభుత్వం పార్లమెంటును అగౌరవపరుస్తోందని, సుప్రీంకోర్టు ఆదేశాలనూ ఖాతరు చేయట్లేదని విమర్శించారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్సులను వ్యతిరేకిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభలో చట్టబద్ధమైన తీర్మానాల కోసం రెండు తాఖీదులు ఇచ్చింది. తాజా ఆర్డినెన్సులను వెంటనే రద్దు చేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. ఆర్డినెన్సులపై కాంగ్రెస్‌ విమర్శలను కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ తిప్పికొట్టారు. ప్రతికూల, విధ్వంసకర రాజకీయాలు చేసేవారు తమను తామే నాశనం చేసుకుంటారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

సీబీఐ, ఈడీ డైరెక్టర్ల పదవీకాలం ఇక ఐదేళ్లు- కేంద్రం ఆర్డినెన్స్​

Last Updated :Nov 16, 2021, 4:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.