ETV Bharat / bharat

తల్లి పాలలో పాషాణం.. ఆ నది నీళ్లే కారణం!

author img

By

Published : Feb 28, 2022, 6:04 PM IST

breast milk arsenic: బిహార్ రాష్ట్రంలోని మహిళల్లో చికిత్స లేని వ్యాధి బయటపడటం కలకలం రేపుతోంది. ఆరు జిల్లాల్లోని పాలిచ్చే తల్లుల్లో ఆర్సెనిక్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు తేలింది. ఈ పాలు తాగిన చిన్నారులకు తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

arsenic found in mother milk
తల్లిపాలలో పాషాణం

breast milk arsenic: అప్పుడే పుట్టిన శిశువుకు తల్లిపాలకు మించిన ఆహారం మరోటి లేదు. అమ్మపాలే చిన్నారికి అమృతమని అంటుంటారు. కానీ, బిహార్​ రాష్ట్రం ఇందుకు మినహాయింపు. అక్కడి మహిళలు ఇచ్చే తల్లిపాలలో పాషాణమే(ఆర్సెనిక్) అధికంగా ఉంటోంది. బిహార్​ రాష్ట్రంలోని ఆరు జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. ఈ వ్యాధి బయటపడ్డ జిల్లాలన్నీ గంగానది తీరంలోనే ఉండటం గమనార్హం.

Bihar arsenic mother milk:

రాష్ట్రంలోని బక్సర్, భోజ్​పుర్, సరన్, వైశాలి, పట్నా, బాగల్​పుర్ జిల్లాల్లోని మహిళలు ఇచ్చే తల్లిపాలలో ఆర్సెనిక్ కనిపించడం కలవరపాటుకు గురిచేస్తోంది. బక్సర్ జిల్లాలో ఈ ప్రభావం అధికంగా ఉంది. ఈ జిల్లాలోని తల్లులపై పరిశోధన చేపట్టగా.. లీటరు తల్లి పాలలో 495.2 మైక్రోగ్రాముల ఆర్సెనిక్ బయటపడింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం లీటరు తల్లిపాలలో 0.2 నుంచి 0.6 మైక్రోగ్రాముల ఆర్సెనిక్ ఉంటే అవి తాగేందుకు ఆమోదయోగ్యం. ఆర్సెనిక్ స్థాయి అంతకన్నా ఎక్కువగా ఉన్న తల్లిపాలను తాగితే.. శిశువు ఆరోగ్యానికి ప్రమాదకరంగా భావిస్తారు. బక్సర్ జిల్లాలో డబ్ల్యూహెచ్ఓ స్థాయి కంటే వందల రెట్లు అధికంగా ఆర్సెనిక్ కనిపించడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిపుణుల మాట..

"ఈ పరిశోధన నివేదిక ఆశ్చర్యకరంగా ఉంది. శిశువుకు ఆరు నెలల వరకు తప్పకుండా తల్లిపాలు తాగించాలి. అయితే, ఆర్సెనిక్ స్థాయిలు ఇంత భారీగా కనిపించడం ఆందోళకరమైన విషయమే. శరీరంలో ఆర్సెనిక్ స్థాయి పెరిగితే.. క్యాన్సర్ వ్యాధి ముప్పు అధికంగా ఉంటుంది. కాలేయం, కిడ్నీ, గుండె, చర్మ వంటి అనేక సమస్యలు సైతం తలెత్తుతాయి. చిన్నారుల శరీరాన్ని బట్టి పోషకాహార లోపం సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది."

-ప్రియాంక షాహీ, ప్రముఖ గైనకాలజిస్ట్, పట్నా మెడికల్ కళాశాల

మహావీర్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్​కు చెందిన పరిశోధనా విభాగం ఇంఛార్జి ప్రొఫెసర్ అశోక్ కుమార్ ఘోష్ ఆధ్వర్యంలోని బృందం చేపట్టిన అధ్యయనంలో ఈ ఆందోళనకరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. భారత ఔషధ పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రాజెక్టులో భాగంగా ఈ పరిశోధన చేపట్టారు. ఇందుకోసం 20-40 ఏళ్ల వయసు ఉన్న మహిళల నుంచి తల్లి పాల శాంపిళ్లను సేకరించారు. 'ఈ పరిశోధన కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో తల్లి పాల నమూనాలు సేకరించడం అంత సులభం కాదు. ఇందుకోసం కొంతమంది మహిళా పరిశోధకుల సాయంతో.. స్థానిక మహిళలను ఒప్పించేందుకు ప్రయత్నించాం. వీటిని ల్యాబ్​కు పంపించి పరీక్షలు చేశాం' అని అశోక్ కుమార్ ఘోష్ వివరించారు.

ఏంటీ ఆర్సెనిక్?

ఆర్సెనిక్ అనేది ఒక లోహపు ఉపధాతువు. సల్ఫర్​ లేదా ఇతర లోహాలతో సంలీనం ద్వారా ఇది బయటపడుతుంది. శతాబ్దాలుగా దీన్ని పలు రసాయనాల తయారీలో ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ రసాయనాలు, మైనింగ్, గాజు తయారీ, సెమీ కండక్టర్ వంటి రంగాల్లో వినియోగిస్తున్నారు. దీన్ని ఆహారంగా తీసుకుంటే మనుషుల ప్రాణాలకే ప్రమాదం. ఆర్సెనిక్ వల్ల తీవ్రమైన గ్యాస్ట్రో సమస్యలు వస్తాయి. వాంతులు, రక్త సరఫరాలో అవాంతరాలు ఎదురవుతాయి. నాడీ వ్యవస్థ దెబ్బతిని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేకపోవడం ఆందోళనకరంగా మారింది.

నివారణ ఎలా?

ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స లేదని పరిశోధకుడు డాక్టర్ అశోక్ కుమార్ ఘోష్ తెలిపారు. అయితే, దీనికి నివారణ మార్గాలను సూచించారు గైనకాలజిస్ట్ ప్రియాంక షాహీ. అపరిశుభ్రమైన నీటిని తాగకుండా ఉండాలని చెప్పారు. ఆర్ఓ పద్ధతిలో శుద్ధి చేసిన నీటిని తాగాలని సూచిస్తున్నారు. ఇవి అందుబాటులో లేకపోతే నీటిని వేడి చేసుకొని, పరిశుభ్రమైన గుడ్డ ద్వారా వడబోసి తాగాలని చెబుతున్నారు.

ఇదీ చదవండి: తల్లి పాలే బిడ్డకు 'తొలి పోషణ.. తొలి రక్షణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.