ETV Bharat / bharat

UP Election 2022: భాజపాకు సై.. యోగికి నై!

author img

By

Published : Feb 5, 2022, 7:39 AM IST

Updated : Feb 5, 2022, 9:02 AM IST

UP Election 2022: యూపీలో బ్రాహ్మణ, రాజ్‌పూత్‌ సామాజికవర్గాలు రెండూ బలమైనవే. రాష్ట్ర జనాభాలో బ్రాహ్మణులు 10 శాతం, రాజ్‌పూత్‌లు 8.5 శాతం వరకు ఉంటారు. తమదంటే తమదే పైచేయి అని నిరూపించుకోవాలని ఈ రెండు వర్గాల మధ్య దీర్ఘకాలంగా పోటీ వాతావరణం ఉంది. యోగి ఆదిత్యనాథ్‌.. రాజ్‌పూత్‌ సామాజికవర్గంలోని ఠాకూర్ల కుటుంబానికి చెందినవారు. అయితే బ్రాహ్మణుల సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో యోగికు మద్దతు పలుకుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

bjp
భాజపా

UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజికవర్గం ఈ దఫా ఏ పార్టీవైపు మొగ్గుచూపుతుందన్నది అత్యంత ఆసక్తి రేకెత్తిస్తోంది. దశాబ్దాలుగా భాజపాకు అండగా నిలుస్తూ వస్తున్న ఈ వర్గం ఓటర్లు.. ప్రస్తుతం ఆ పార్టీకి మద్దతివ్వడంపై సందిగ్ధంలో ఉన్నారు! అందుకు కారణం- సీఎం యోగి ఆదిత్యనాథ్‌. బ్రాహ్మణ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారంటూ ఆయనపై ఉన్న ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి.

వాజ్‌పేయీ చెప్పినా వినలేదు

యూపీలో బ్రాహ్మణ, రాజ్‌పూత్‌ సామాజికవర్గాలు రెండూ బలమైనవే. రాష్ట్ర జనాభాలో బ్రాహ్మణులు 10%, రాజ్‌పూత్‌లు 8.5% వరకు ఉంటారు. తమదంటే తమదే పైచేయి అని నిరూపించుకోవాలని ఈ రెండు వర్గాల మధ్య దీర్ఘకాలంగా పోటీ వాతావరణం ఉంది. యోగి ఆదిత్యనాథ్‌.. రాజ్‌పూత్‌ సామాజికవర్గంలోని ఠాకూర్ల కుటుంబానికి చెందినవారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పుర్‌ పట్టణ స్థానంలో భాజపా ప్రముఖ నాయకుడు శివ్‌ప్రతాప్‌ శుక్లాను బరిలో దించింది. అది యోగికి (అప్పుడు గోరఖ్‌పుర్‌ ఎంపీగా ఉన్నారు) నచ్చలేదు. తన సామాజికవర్గానికి చెందినవారిలో బ్రాహ్మణ అభ్యర్థిపై వ్యతిరేకత ఉందని ఆయనకు తెలుసు. విషయం గ్రహించిన అప్పటి ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (బ్రాహ్మణవర్గానికి చెందినవారు).. ఆయన్ను పిలిపించుకొని మాట్లాడారు. శుక్లా విజయం కోసం కృషిచేయాలని కోరారు. కానీ నిండా 30 ఏళ్లు కూడా లేని యోగి ఆయన విన్నపాన్ని పట్టించుకోలేదు. హిందూసభ అభ్యర్థిగా రాధామోహన్‌ అగర్వాల్‌ను శుక్లాపై పోటీకి దించారు. ఫలితం- అగర్వాల్‌ సంచలన విజయం. యోగిపై బ్రాహ్మణ వ్యతిరేకి అన్న ముద్ర పడింది!

ప్రతిపక్షాల వ్యూహరచన

యోగి సర్కారుపై బ్రాహ్మణ వర్గంలో అసంతృప్తిని గుర్తించిన ప్రతిపక్షాలు.. ఆ వర్గం ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ 40 బ్రాహ్మణ సంస్థల ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బ్రాహ్మణ కమిషన్‌ను ఏర్పాటుచేస్తామని.. ఆ వర్గంవారిపై బూటకపు కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. సంస్కృతం, ఆస్ట్రాలజీ ఉపాధ్యాయ పోస్టుల్లో బ్రాహ్మణులకు 90% రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పారు. గోరఖ్‌పుర్‌లో యోగికి బద్ద శత్రువుగా పేరొందిన హరిశంకర్‌ తివారీ కుమారుడు వినయ్‌శంకర్‌ తివారీకి అఖిలేశ్‌ ఈ దఫా చిల్లూపార్‌ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. 2007 ఎన్నికల తరహాలో దళిత, బ్రాహ్మణ ఓట్లను సంఘటితం చేయడానికి బీఎస్పీ ప్రయత్నిస్తోంది. యోగి ప్రభుత్వం బ్రాహ్మణులను వేధింపులకు గురిచేస్తోందని ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు- ఖుషీ దుబే సోదరి నేహా తివారీకి కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో కల్యాణ్‌పుర్‌ సీటును కేటాయించింది.

భాజపా దిద్దుబాటు చర్యలు

బ్రాహ్మణుల్లో తమపై అసంతృప్తి పెరుగుతున్నట్లు గ్రహించిన భాజపా.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం పార్టీలో నలుగురు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. ఆసక్తికర విషయమేంటంటే.. 2002లో గోరఖ్‌పుర్‌ పట్టణ స్థానంలో పరాజయం పాలైన శివ్‌ప్రతాప్‌ శుక్లా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కల్‌రాజ్‌ మిశ్ర (రాజస్థాన్‌ గవర్నర్‌), లక్ష్మీకాంత్‌ వాజ్‌పేయీ (యూపీ భాజపా మాజీ అధ్యక్షుడు)లను ఇటీవల ఓ కార్యక్రమంలో కమలనాథులు సన్మానించారు. ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయీ చిత్రాలను వారు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి దినేశ్‌ శర్మ బ్రాహ్మణ మూలాలను పదేపదే ప్రస్తావిస్తున్నారు. భాజపా మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్‌ జోషిని ఆయన పుట్టినరోజున (జనవరి 5) ప్రధాని మోదీ కలవడమూ బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగమేనని విశ్లేషణలున్నాయి. 2017లో దాదాపు 80% బ్రాహ్మణ ఓటర్లు కమలదళానికి మద్దతుగా నిలిచారని.. ఇప్పుడు వారిలో 10-15% మంది ఇతర పార్టీలవైపు మొగ్గుచూపినా 40-60 స్థానాల్లో ఆ పార్టీకి నష్టం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉపఎన్నికలో సహకరించలేదన్న ఆగ్రహం

ముఖ్యమంత్రి పీఠమెక్కాక కూడా యోగి ఆదిత్యనాథ్‌ బ్రాహ్మణ వ్యతిరేక విధానాలను అనుసరించారని ఆరోపణలున్నాయి. యోగి సీఎం కావడంతో ఖాళీ అయిన గోరఖ్‌పుర్‌ లోక్‌సభ స్థానానికి 2018 మార్చిలో ఉపఎన్నిక జరిగింది. ఆయన మద్దతివ్వకపోవడంవల్లే నాడు తమ సామాజికవర్గానికి చెందిన ఉపేంద్ర శుక్లా (భాజపా అభ్యర్థి) పరాజయం పాలయ్యారని బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధినాయకత్వం జోక్యంతో..

రాష్ట్రంలో ఠాకూర్‌(రాజ్‌పూత్‌)-బ్రాహ్మణ వర్గాల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్లు గ్రహించిన భాజపా అధినాయకత్వం 2019 సార్వత్రిక ఎన్నికల వేళ ముందుచూపుతో వ్యవహరించింది. ఇరువర్గాల మధ్య పరిస్థితులను మెరుగుపర్చే ప్రయత్నాల్లో భాగంగా.. గోరఖ్‌పుర్‌ లోక్‌సభ స్థానానికి తనకు నచ్చిన బ్రాహ్మణ అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాన్ని యోగికి ఇచ్చింది. ఠాకూర్‌-బ్రాహ్మణ వర్గాల మధ్య విభేదాలతో సంబంధం లేని.. గోరఖ్‌పుర్‌కు చాలాదూరంలోని జౌన్‌పుర్‌ జిల్లాకు చెందిన భోజ్‌పురి నటుడు రవికిషన్‌ శుక్లా (రేసుగుర్రం సినిమా ఫేమ్‌)ను సీఎం అక్కడ పోటీలో నిలిపారు. ఠాకూర్‌-బ్రాహ్మణ ఓట్లు సంఘటితమవడంతో రవికిషన్‌ విజయం సాధించారు.

మళ్లీ పెరిగిన అసంతృప్తి

రవికిషన్‌ విజయంతో పరిస్థితులు కుదుటపడ్డట్లే కనిపించినా.. 2019 జులైలో మహేంద్రపాండే (బ్రాహ్మణ్‌)ను తప్పించి స్వతంత్రదేవ్‌ సింగ్‌ (కుర్మీ)కి రాష్ట్ర భాజపా అధ్యక్ష పదవిని కట్టబెట్టడంతో బ్రాహ్మణవర్గంలో యోగిపై మళ్లీ అసంతృప్తి పెరిగింది. తమ సామాజికవర్గానికి చెందిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబేను బూటకపు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారని కొందరు బ్రాహ్మణులు ఆరోపిస్తున్నారు. అదే ఎన్‌కౌంటర్‌లో వికాస్‌ సన్నిహితుడు అమర్‌ దుబే కూడా హతమయ్యాడు. అమర్‌ భార్య ఖుషీ దుబేను.. ఇంట్లో ఆయుధాలను అక్రమంగా కలిగి ఉన్నారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. మరణించడానికి మూడు రోజుల ముందే ఖుషీని అమర్‌ పెళ్లాడాడు. దీంతో- ఖుషీ అమాయకురాలని, బెయిలు రాకపోవడంతో ఆమె జైల్లో మగ్గుతుండటం దారుణమని చాలామంది వాదిస్తున్నారు.

  • హోంశాఖనూ తనవద్ద ఉంచుకున్న యోగి.. తమ సామాజికవర్గానికి చెందిన వివేక్‌ తివారీ (ఓ ప్రముఖ కంపెనీలో ఉన్నతాధికారి), కమలేశ్‌ తివారీ (హిందుత్వ నేత) హత్యకేసుల్లో దర్యాప్తు వేగంగా సాగేలా చర్యలు తీసుకోవడం లేదని బ్రాహ్మణవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు.
  • పరశురామ జయంతి రోజున సెలవును రద్దు చేయాలన్న యోగి సర్కారు నిర్ణయమూ వారికి ఆగ్రహం కలిగించింది.

ఇదీ చూడండి:

పక్కా స్కెచ్​తోనే గోరఖ్​పుర్​ బరిలో యోగి- 62 సీట్లపై భాజపా గురి!

'వాళ్లు పేపర్​పైనే సమాజ్​వాదీలు- రైతులకు చేసిందేమీ లేదు'

Last Updated :Feb 5, 2022, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.