ETV Bharat / bharat

బంగాల్​లో భాజపా.. ఐదేళ్లలో ఎంత తేడా!

author img

By

Published : May 3, 2021, 7:21 AM IST

2016 బంగాల్​ శాసనసభ ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలు సాధించిన భాజపా.. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి 18 ఎంపీ స్థానాలను గెలుచుకుని అనూహ్యంగా పుంజుకుంది. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏకంగా 75 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన కమలం పార్టీ.. బంగాల్‌లో రెండో స్థానానికి ఎదిగింది. ఈ ఐదేళ్లలో అనూహ్యంగా పుంజుకోవడంపై పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

bjp got enormous majority in five years in bengal
ఐదేళ్లలో.. ఎంత తేడా!

బంగాల్‌.. ఒకప్పుడు కమ్యూనిస్టుల కోట.. ఇప్పుడేమో తృణమూల్‌ కాంగ్రెస్‌ వేసుక్కూర్చున్న పీట.. ఈ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయాలనేది భాజపా పట్టుదల. 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడి 2011లో సీఎంగా పీఠాన్ని అధిష్ఠించిన ఘనత మమతాబెనర్జీది. అప్రతిహతంగా దూసుకుపోతున్న ఆమెకు ఈ ఎన్నికల్లో భాజపా గట్టిపోటీగా నిలిచింది. ఐదేళ్ల కిందట 2016లో ఎన్నికల్లో 3 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రస్థానాన్ని మొదలు పెట్టిన భాజపా.. 2021 పోరులో 75 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. మరో రెండుచోట్ల ఆధిక్యంలో ఉంది. ప్రధాని మోదీ 20కి పైగా, అమిత్‌ షా 50, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరో 40 బహిరంగసభల్లో ప్రచారం చేశారు. 2021 ఎన్నికల్లో పార్టీని గౌరవప్రదమైన స్థానంలో నిలిపారు.

సమర్థ నాయకత్వ లేమి..
స్థానికంగా దీదీకి దీటుగా నిలిచే నాయకుడు భాజపాలో లేకపోవడం పెద్ద లోపం. ప్రధాని నరేంద్రమోదీ ఆకర్షణ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజకీయ చతురతనే నమ్ముకున్నారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌, తృణమూల్‌ నుంచి భాజపా శిబిరంలోకి వచ్చిన సువేందు లాంటి నేతలున్నా.. ఒకవేళ పార్టీ గెలిస్తే సీఎం పీఠంపై ఎవరు ఆసీనులవుతారో ముందే చెప్పని పరిస్థితి. అమిత్‌షా పథ నిర్దేశంలో కమలదళం ముందుకు సాగింది. ఈ క్రమంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించింది. సాక్షాత్తూ అమిత్‌షా స్వయంగా ఫిరాయింపుదారుల్ని ఆహ్వానించారు. దాదాపు 40 మందికి పైగా కమలదళంలో చేరారు. ఇవి ఆ పార్టీకి ప్రతికూలాంశాలుగా మారాయి.

అటు నుంచి నరుక్కొచ్చారు..
వామపక్షాలు, కాంగ్రెస్‌వాదులకు పటిష్ట పునాదులున్న బంగాల్‌ గడ్డపై భాజపాకు చోటు దక్కడం ఒక్కసారిగా ఏమీ జరగలేదు. ఆరు దశాబ్దాలుగా హిందూత్వ సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాయి. తొలుత ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ నుంచి బెంగాల్‌కు వలసవచ్చిన వారితో జట్టుకట్టి 1960 దశకం చివరి నుంచి స్థానిక రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) నేతలు చాపకింద నీరులా తమపని తాము చేసుకుపోతూ భాజపాకు మార్గం సుగమం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడైన కె.బి.హెడ్గేవార్‌.. కోల్‌కతాలో మెడిసిన్‌ చదివారని, ఆయనకు స్ఫూర్తినిచ్చిన గడ్డ బంగాలేనని, మరో ముఖ్యనేత శ్యామాప్రసాద్‌ముఖర్జీ కోల్‌కతాలోనే జన్మించారని ప్రచారం చేశారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే హిందువుల్ని వలసదారులుగా, ముస్లిం చొరబాటుదారులుగా వర్ణిస్తూ ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో ప్రచారం చేశారు. మరోపక్క వామపక్షాలు, కాంగ్రెస్‌ బలహీనపడటమూ భాజపాకు కలిసొచ్చింది.

ఇవీ చదవండి: 'నేను లోకల్​' నినాదంతో మమత తీన్మార్​

దీదీ బం'గోల్'- 213 స్థానాల్లో టీఎంసీ పాగా

బంగాల్​ ఫలితాలు.. విపక్షాలకు వెయ్యేనుగుల బలం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.