ETV Bharat / bharat

గుజరాత్​కు తుపాను ముప్పు​.. 23 వేల మందిపై ఎఫెక్ట్! ప్రధాని కీలక ఆదేశాలు

author img

By

Published : Jun 12, 2023, 5:01 PM IST

Biporjoy live news : అతి తీవ్ర తుపాను బిపోర్‌జాయ్‌ ముంచుకొస్తున్న వేళ గుజరాత్​తో పాటు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 15న కచ్‌- సౌరాష్ట్ర తీరాల వద్ద ఇది తీరం దాటనున్న నేపథ్యంలో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్​డీఆర్ఎఫ్, ఎస్​డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తుపాను పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

biporjoy-live-news
biporjoy-live-news

Biporjoy live news : అరేబియా సముద్రంలో అతి తీవ్ర తుపానుగా మారిన బిపోర్‌జాయ్‌ గుజరాత్‌ తీర ప్రాంతంవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంపై సమీక్ష నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల తరలింపు కోసం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసరమైన సేవలన్నీ అందుబాటులో ఉండేలా జాగ్రత్తపడాలని దిశానిర్దేశం చేశారు. తుపాను వల్ల ఏదైనా నష్టం సంభవిస్తే.. వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ 24/7 తుపాను పరిస్థితిని సమీక్షిస్తోందని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. 12 ఎన్​డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని, మరో 15 స్టాండ్​బైలో ఉన్నాయని వివరించింది.

biporjoy-live-news
ప్రధాని సమీక్ష సమావేశం

Cyclone in Gujarat : బిపోర్​జాయ్ తుపాను సౌరాష్ట్ర- కచ్‌ తీరాల వద్ద ఈ నెల 15వ తేదీన తీరాన్ని దాటనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో గుజరాత్​లోని కచ్‌ తీరానికి ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. కచ్‌లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ముందు జాగ్రత్త చర్యగా తాత్కాలిక శిబిరాలకు తరలిస్తున్నారు. పోర్​బందర్ నుంచి 3 వేల మందిని, దేవభూమి ద్వారక జిల్లా నుంచి 1500 మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జామ్​నగర్, జునాగఢ్, మోర్బి, కచ్, ప్రాంతాల నుంచి కూడా ప్రజలను తరలిస్తున్నారు. మొత్తంగా 7,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. మంగళవారం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. తీర ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 23 వేల మంది ప్రజలను తరలిస్తామని తెలిపారు.

biporjoy-live-news
గుజరాత్​లో వర్ష ప్రభావాన్ని సూచిస్తున్న మ్యాప్

తుపాను తీరం దాటే సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. కచ్‌, జామ్‌నగర్‌, మోర్బి, గిర్‌ సోమనాథ్‌, పోర్‌బందర్‌, ద్వారక జిల్లాల్లో వచ్చే రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కచ్‌ జిల్లాలోని తీర ప్రాంతాల్లో సెక్షన్‌ 144 విధించారు. ఇప్పటికే గుజరాత్‌లో దక్షిణ, ఉత్తర తీరాల్లో మత్స్య సంబంధిత కార్యకలాపాలను నిలిపివేశారు. మత్స్యకారులు జూన్‌ 15 వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని, వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం SDRF, NDRF బలగాలను మోహరించారు.

biporjoy-live-news
తుపానుకు ముందు తీరంలో పరిస్థితి ఇలా...
biporjoy-live-news
గుజరాత్ తీరంలో ఎగసిపడుతున్న సముద్రపు అలలు

ముంబయికీ వర్ష ముప్పు
Cyclone in Mumbai : దేశ వాణిజ్య రాజధాని ముంబయికి కూడా వర్షాల ముప్పు పొంచి ఉంది. అక్కడ ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. బలమైన గాలుల కారణంగా ముంబయి ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గాలుల తీవ్రతతో కొన్ని విమానాలను రద్దు చేయగా.. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలకు ల్యాండ్‌ చేసే పరిస్థితి లేక మరో ఎయిర్‌పోర్టుకు దారిమళ్లిస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పాక్​పైనా ప్రభావం
మరోవైపు, పాకిస్థాన్ సైతం తుపాను సహాయక చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావం ఆ దేశంపైనా ఉన్న నేపథ్యంలో.. సింధ్ రాష్ట్రంలోని దక్షిణ తీరంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లు, కార్యాలయాల్లో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. ఆర్మీ, నేవీ సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.