ETV Bharat / bharat

చాపర్​ క్రాష్​కు ముందు ఏం జరిగింది? వీడియో తీసినవారి మాటల్లో..

author img

By

Published : Dec 10, 2021, 4:02 PM IST

Updated : Dec 10, 2021, 7:27 PM IST

Army chopper crash
హెలికాప్టర్​ ప్రమాదం

Bipin Rawat helicopter video: భారత త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ దంపతులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్​ కూలిపోయే కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది? చాపర్​ను వీడియో తీసిన వై.జో అనే వ్యక్తిని ఈటీవీ భారత్​ కలవగా.. కీలక విషయాలను వివరించారు.

చాపర్​ క్రాష్​కు ముందు జరిగిన అంశాలు

Bipin Rawat helicopter video: తమిళనాడు కూనూర్​లో ఈనెల 8న వాయుసేనకు చెందిన హెలికాప్టర్​ కూలిపోయి భారత తొలి త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. చాపర్​ ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు తీసిన ఓ వీడియో ఆ మరుసటి రోజున బయటకు వచ్చింది. ఈ వీడియోను కోయంబత్తూర్​లోని రామనంతపురానికి చెందిన వెడ్డింగ్​ ఫొటోగ్రాఫర్ వై.జో అలియాస్​ కుట్టి అనే వ్యక్తి తన ఫోన్​లో రికార్డు చేశారు. ఆ సమయంలో ఏం జరిగింది? అనే విషయంపై ఈటీవీ భారత్​తో మాట్లాడారు జో. ప్రతికూల వాతావరణం, సరైన వెలుతురు లేకపోవటమే హెలికాప్టర్​ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని చెప్పారు.

Army chopper crash
ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు హెలికాప్టర్​

"ఆ రోజున నా స్నేహితుడు నాసర్​, నేను, నా కుటుంబంతో కలిసి ఊటీ సమీపంలోని కట్టేరి ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లాం. కొండ ప్రాంతంలోని రైల్వే ట్రాక్​​పై వెళ్తూ వీడియో తీస్తున్నాం. అప్పుడే హెలికాప్టర్​ను చూశాం. దాని శబ్దం కొంచెం తేడాగా అనిపించి.. వీడియో తీసేందుకు ప్రయత్నించగా కొన్ని క్షణాల్లోనే కనిపించకుండా పోయింది. ఆ వెంటనే భారీ పేలుడు శబ్దం వినపడింది. ఇది కేవలం 4-5 సెకన్లలోనే జరిగిపోయింది. ఘటనాస్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించాం. కానీ, పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. సమీపంలోని మా స్నేహితుడి ఇంటికి వెళ్లాం. ఆ తర్వాత హెలికాప్టర్​ ప్రమాదంపై పూర్తి వివరాలు టీవీలో చూసి తెలుసుకున్నాం. "

- జో, కోయంబత్తూర్​

వీడియో అందించేందుకు ముందుగా నీలగిరి జిల్లా కలెక్టర్​ కార్యాలయానికి వెళ్లామని, అక్కడ అధికారులెవరూ లేరని గుర్తు చేసుకున్నారు జో. ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లాలని అక్కడ ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు​ సూచించగా.. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని ఇన్​స్పెక్టర్​ దేవరాజన్​కు వీడియో ఫుటేజ్​ను అందించినట్లు చెప్పారు. దట్టమైన పొగ మంచులో వెళుతున్న హెలికాప్టర్​ను చూశామని, ఆ వెంటనే కూలిపోయిన శబ్దం విన్నట్లు పోలీసులకు వివరించామన్నారు.

ఈ విషయంపై జో స్నేహితుడు నాసర్​ను అడగగా.. ' ఆ వీడియోను మా స్నేహితుడు జో రికార్డు చేశారు. ఆ వెంటనే హెలికాప్టర్​ కూలిపోయిన శబ్దాన్ని విని ఆందోళన చెందాం. ఆ తర్వాత సంఘటనాస్థలానికి చేరుకుని, వీడియోను పోలీసులకు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయాం.' అని తెలిపారు.

ఇదీ చూడండి: నేలరాలిన త్రిదళపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌

త్రిదళాధిపతిగా బిపిన్ రావత్ బాధ్యతలేంటంటే..?

రావత్​ మృతితో సైనిక సంస్కరణలకు శరాఘాతం!

హెలికాప్టర్‌ ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు

Last Updated :Dec 10, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.