'బిహార్​లో రాష్ట్రపతి పాలన విధించాలి.. వచ్చే ఎన్నికల్లో సున్నా ఓట్లే'

author img

By

Published : Aug 9, 2022, 7:40 PM IST

bihar political parties
bihar political parties ()

భాజపా-జేడీ(యూ) బంధం తెగిపోవడం వల్ల బిహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ కుమార్‌ రాజీనామా చేశారు. అయితే ఆర్జేడీతో నితీశ్‌ చేతులు కలపడంపై లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాసవాన్‌ మండిపడ్డారు. బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. అయితే నితీశ్​ నిర్ణయాన్ని ఎస్పీ, టీఎంసీ తదితర పార్టీలు స్వాగతించాయి.

Bihar JD(U) News: బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ ఎత్తుగడతో ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మిత్రపక్షం భాజపాకు రెండోసారి షాక్ ఇచ్చింది జనతాదళ్​ యునైటెడ్​(జేడీయూ). జాతీయ ప్రజాస్వామ్య కూటమి నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ), కాంగ్రెస్​, వామపక్షాలతో కూడిన మహాకూటమితో జట్టు కట్టింది. ఆ పార్టీలతో కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది నితీశ్​ సేన. ఇందుకు అనుగుణంగా.. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు నితీశ్ కుమార్.

మంగళవారం పట్నాలో గవర్నర్​ ఫాగూ చౌహాన్​ను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. మహాకూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. నితీశ్​కు మద్దతు తెలుపుతూ ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​ ఇచ్చిన లేఖను సమర్పించారు. అయితే ఈ పరిణామాన్ని ఎస్పీ, టీఎంసీ, హిందుస్థాన్​ మోర్చా, సీపీఐ తదితర పార్టీలు స్వాగతించాయి. మరోవైపు, ఆర్జేడీతో నితీశ్​ చేతులు కలపడంపై భాజపా, లోక్​జనశక్తి పార్టీలు మండిపడ్డాయి.

'వచ్చే ఎన్నికల్లో జేడీ(యూ)కు సున్నా సీట్లు!'
ఆర్జేడీ, కాంగ్రెస్‌ ఇతర పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా జోరుగా పావులు కదుపుతున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలపై లోక్‌జనశక్తి పార్టీ (రాం విలాస్‌ వర్గం) నేత చిరాగ్ పాసవాన్‌ స్పందించారు. ఆర్జేడీతో నితీశ్‌ చేతులు కలపడంపై మండిపడ్డారు. బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. నితీశ్‌ విశ్వసనీయత కోల్పోయారని.. వచ్చే ఎన్నికల్లో జేడీ(యూ)కి సున్నా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. పట్నాలో మీడియాతో మాట్లాడుతూ.. "ఈరోజు నీతీశ్ విశ్వసనీయత సున్నా. బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి. కొత్తగా ప్రజా తీర్పు కోరాలి. నితీశ్‌.. మీకు ఏమైనా సిద్ధాంతం ఉందా లేదా? వచ్చే ఎన్నికల్లో జేడీ(యూ)కి సున్నా సీట్లే వస్తాయి" అని వ్యాఖ్యానించారు.

'బిహార్ ప్రజలను నితీశ్​ మోసం చేశారు'
ఎన్​డీఏ నుంచి వైదొలిగి, మహాకూటమి పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న నితీశ్ కుమార్ నిర్ణయాన్ని తప్పుబట్టింది భాజపా. ఆయన్ను అవకాశవాదిగా అభివర్ణించింది. "2020లో ఎన్​డీఏ పేరుతో మేము(భాజపా, జేడీయూ) కలిసి పోటీ చేశాం. మాకు ఎక్కువ సీట్లు వచ్చినా.. నితీశ్​ కుమార్​నే ముఖ్యమంత్రిని చేశాం. కానీ.. ఇప్పుడు ఇలా చేయడం బిహార్ ప్రజల్ని, భాజపాను మోసం చేయడమే" అని మండిపడ్డారు భాజపా బిహార్ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్​.

'ఇది ఒక మంచి ప్రారంభం'
బిహార్​లోని రాజకీయ పరిస్థితులపై ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ స్పందించారు. బ్రిటిష్ పాలనాకాలంలో 'ఆంగ్లేయులు భారత్‌ను వీడాలి' అనే నినాదాన్ని ఇదే రోజు ఇచ్చారని అఖిలేశ్​ చెప్పారు. 'భాజపాని వెళ్ళగొట్టాలి' అనే నినాదం ఈరోజు బిహార్ నుంచి వస్తోందని అన్నారు. ఇటువంటి నినాదం రావడం శుభపరిణామమని అన్నారు. త్వరలోనే వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, ప్రజలు.. భాజపాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారని అని ఆయన అన్నారు. నితీశ్​ కుమార్​ నిర్ణయానికి హిందుస్థానీ అవామ్ మోర్చా మద్దత్తిస్తున్నట్లు ప్రకటించింది. తమ రాష్ట్ర రాజకీయాలు.. దేశంలో మార్పు తెస్తోందని బిహార్​ సీపీఐ ఎంపీ బినోయ్​ విశ్వం అన్నారు.

'అందుకే పార్లమెంటును కేంద్రం నిరవధిక వాయిదా వేసింది'
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ ఎన్‌డీఏ నుంచి వైదొలగడాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతించింది. పొరుగు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను టీఎంసీ నిశితంగా పరిశీలిస్తోందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుఖేందు శేఖర్ చెప్పారు. అయితే బిహార్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగానే పార్లమెంట్‌ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిరవధిక వాయిదా వేసిందని టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్​ ఆరోపించారు.

ఇవీ చదవండి:

37ఏళ్లుగా ఎమ్మెల్యే కాలేదు.. కానీ 8వసారి సీఎంగా.. దటీజ్​ నితీశ్​!3

భాజపాకు నితీశ్​ గుడ్​బై.. సీఎం పదవికి రాజీనామా.. ఆర్​జేడీ, కాంగ్రెస్​తో కలిసి కొత్త ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.