భాజపాపై జేడీయూ కోపానికి కారణమేంటి? కటీఫ్ ఖాయమా?

author img

By

Published : Aug 9, 2022, 9:47 AM IST

bjp jdu alliance breakup

Bihar politics crisis : 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా, జేడీ(యు) కలిసి పోటీ చేశాయి. జేడీ(యు)కు తక్కువ స్థానాలే వచ్చినప్పటికీ మిత్ర ధర్మాన్ని పాటిస్తూ భాజపా నీతీశ్‌కే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. అయితే, కొంతకాలంగా భాజపా, జేడీ(యు) మధ్య దూరం పెరుగుతోంది. ఇందుకు కారణాలేంటి? బిహార్ రాజకీయం ఎలాంటి మలుపులు తిరగనుంది?

BJP JDU alliance breakup : గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి జట్టు కట్టి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీ(యు)నేత నీతీశ్‌ కుమార్‌ కొంత కాలానికి బయటకు వచ్చి భాజపాతో చేతులుకలిపారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా, జేడీ(యు) కలిసి పోటీ చేశాయి. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ 75 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం సాధించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో జేడీ(యు)కు తక్కువ స్థానాలే వచ్చినప్పటికీ మిత్ర ధర్మాన్ని పాటిస్తూ భాజపా నీతీశ్‌కే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. అయితే, కొంతకాలంగా భాజపా, జేడీ(యు) మధ్య దూరం పెరుగుతోంది అనడానికి ఇవీ నిదర్శనాలు...

  • ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి నీతీశ్‌ గైర్హాజరయ్యారు. ఆరోగ్యం సరిగాలేదని చెప్పినప్పటికీ అదే రోజు పట్నాలో ప్రభుత్వ కార్యక్రమాలు రెండింటిలో పాల్గొన్నారు.
  • స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాలపై జులై 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిర్వహించిన ముఖ్యమంత్రుల భేటీకీ నీతీశ్‌ వెళ్లలేదు.
  • పదవీ కాలం ముగిసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వీడ్కోలు పలికేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు, మూడు రోజుల తర్వాత కొత్త రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం కార్యక్రమానికీ దూరంగా ఉన్నారు.
  • అంతకుముందు దేశంలో కొవిడ్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశానికీ నీతీశ్‌ హాజరుకాలేదు.

కమలం వ్యూహాలపై అనుమానం

* Bihar BJP news : అసెంబ్లీలో తమ కన్నా తక్కువ సీట్లున్న జేడీ(యు)నేతను సీఎం చేయడం వెనుక బిహార్‌లో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడమే కమలదళ నేతల అసలు లక్ష్యం. దీనిలో భాగంగా తనకున్న ప్రజాదరణను దెబ్బ తీసి ఏ క్షణమైనా తన సొంత ముఖ్యమంత్రిని తెరపైకి తీసుకువచ్చే యోచనలో భాజపా ఉందని నీతీశ్‌ అనుమానిస్తున్నారు.

* రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనలు నీతీశ్‌ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. తరచూ తన ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా మాట్లాడుతున్న అసెంబ్లీ స్పీకర్‌ విజయ్‌కుమార్‌ సిన్హా(భాజపా నేత)ను ఆ పదవి నుంచి తప్పించాలని నీతీశ్‌కుమార్‌ ఎప్పటి నుంచో యత్నిస్తున్నా సఫలం కాలేకపోయారు.

* 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధాని మోదీ తన కేబినెట్‌లో జేడీ(యు)కి ఒకే ఒక్క మంత్రి పదవిని ఇస్తామనగా నీతీశ్‌ తిరస్కరించారు. 2021లో మంత్రి వర్గాన్ని విస్తరించినప్పుడు తన అభిష్టానికి భిన్నంగా ఆర్సీపీ సింగ్‌కు పదవినిచ్చారు. ఆయన భాజపాతో సన్నిహితంగా మెలగడం నీతీశ్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆర్సీపీ సింగ్‌ను మరోసారి రాజ్యసభకు పంపించడానికి నీతీశ్‌ నిరాకరించారు.

* 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యు) ఓటమే లక్ష్యంగా అభ్యర్థులను నిలిపిన లోక్‌జనశక్తి అధ్యక్షుడు చిరాగ్‌ పాస్వాన్‌కు భాజపా పెద్దల ఆశీర్వాదం ఉందని నీతీశ్‌ బలంగా విశ్వసిస్తున్నారు. ఇటీవల పట్నాలో భాజపా సమావేశంలో చిరాగ్‌ ప్రత్యక్షం కావడం గమనార్హం.
* తన మంత్రి వర్గంలోకి భాజపా ఎమ్మెల్యేలను ఎవరిని తీసుకోవాలన్న స్వేచ్ఛ నితీశ్‌కు లేకుండాపోయింది. అధిక పదవులు కమలదళానికే దక్కాయి.
* 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిలో తనను భాజపా కొనసాగనివ్వదనే అభిప్రాయానికి రావడం.

ఎన్‌డీఏ నుంచి బయటకు రాగలరా?
Bihar politics crisis : నీతీశ్‌కుమార్‌ నేపథ్యాన్ని గమనిస్తే రాజకీయంగా ఆయన ఎటువంటి నిర్ణయాన్నైనా తీసుకోగలరని స్పష్టమవుతుంది. మోదీని విమర్శిస్తూ భాజపాతో పొత్తు పెట్టుకోగలిగారు. ఎన్‌డీఏను వీడి ఆర్జేడీతోనూ జట్టుకట్టారు. మళ్లీ ఆర్జేడీని మధ్యలోనే(2017) వదిలేసి కమలనాథుల చెంతకు చేరారు. ఇటీవల రెండు సందర్భాల్లో ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌, నీతీశ్‌ కలుసుకోవడం రాష్ట్రంలో మరోసారి రాజకీయ పునరేకీకరణ జరగవచ్చనే సంకేతాలనిచ్చింది. అయితే, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకే జేడీ(యు) మద్దతిచ్చింది. మధ్యంతర ఎన్నికలకు సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు సుముఖంగా లేని పరిస్థితుల్లో నీతీశ్‌ సాహసోపేత నిర్ణయం తీసుకోగలరా అనే సందేహమూ వ్యక్తమవుతోంది. తమ పార్టీని చీల్చడానికి భాజపా ప్రయత్నిస్తోందని జేడీ(యు) జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ పరోక్షంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం పట్నాలో ఏం జరగబోతుందో ఆసక్తికరంగా మారింది.

bjp jdu alliance breakup
2020 ఎన్నికల ఫలితాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.