ETV Bharat / bharat

కొవాగ్జిన్ గురించి ఈ విషయాలు తెలుసా?

author img

By

Published : Jan 16, 2021, 8:02 AM IST

కొవిడ్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు దేశం​ వ్యాక్సినేషన్​కు శ్రీకారం చుట్టింది. దేశీయంగా రూపొందించిన కొవాగ్జిన్ సహా సీరం సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్​ టీకాలను ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

corona vaccine
కొవాగ్జిన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

కొవిడ్ మహమ్మారి నుంచి కాపాడే దివ్యౌషధంగా భావిస్తోన్న కొవాగ్జిన్​ వ్యాక్సిన్​ను దేశీయ సంస్థ భారత్​ బయోటెక్ తయారు చేసింది. రెండు దశల క్లినికల్ ట్రయల్స్​లో అత్యుత్తమ ఫలితాలను ఇచ్చిన కొవాగ్జిన్ టీకా.. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్​లో ఉంది. సుమారు 20వేల మందిపై ఈ ప్రయోగాలు సాగుతున్నాయి. అమెరికా, బ్రిటన్​లోనూ కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టడం విశేషం. కొవాగ్జిన్​ గురించి మరిన్ని విశేషాలు మీకోసం..

  • తొలుత 20 రీసస్ కోతులపై ​14రోజుల వ్యవధిలో రెండు కొవాగ్జిన్ డోసులు ఇచ్చి ప్రయోగం చేశారు. వ్యాక్సిన్ ఇచ్చిన కోతుల్లో ఐజీజీ యాంటీబాడీల పెరుగుదలతో పాటు.. గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లో వైరస్ పెరుగుదలను నియంత్రించినట్లు గుర్తించారు.
  • ఆ దశలో కొవాగ్జిన్ దాదాపు 65 శాతం సామర్థ్యాన్ని చూపినట్లు నిపుణులు స్పష్టం చేశారు.
  • దేశవ్యాప్తంగా వలంటీర్లపై చేసిన రెండు క్లినికల్​ ట్రయల్స్​లోనూ టీకా తీసుకున్న వారిలో ఎలాంటి దుష్పరిణామాలు రాలేదు. వైరస్ నుంచి రక్షణ కల్పించటంలో ఉత్తమ ఫలితాలను ఇచ్చినట్లు గుర్తించారు.
  • కొత్త రకం వైరస్​ పైనా కొవాగ్జిన్ ప్రభావం చూపుతుందని భారత్ బయోటెక్ ఇప్పటికే ప్రకటించింది.
  • ఐసీఎంఆర్, వైరాలజీ ల్యాబ్​లతో కలిసి అనతి కాలంలోనే కొవాగ్జిన్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది భారత్ బయోటెక్.
  • కొవాగ్జిన్​లో అల్ హైడ్రాక్సిక్విమ్- 2 అనే కారకం ఉండటం వల్ల మెరుగైన వ్యాధినిరోధక శక్తినివ్వటం సహా ఎక్కువ కాలం హానికారక కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుందని భారత్ బయోటెక్ తెలిపింది.
  • కరోనా వైరస్​కు సంబంధించి ముక్కులో వేసుకునే చుక్కల మందు తయారీ కోసం వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్​తో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుంది.
  • చింపాంజీ అడినోవైరస్ ఆధారంగా ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్ 19 వ్యాక్సిన్​ డ్రాప్స్​ను తయారు చేస్తోంది. ఇక ఈ ఒప్పందంతో అమెరికా, జపాన్, ఐరోపా మినహా ప్రపంచ దేశాల్లో ఈ టీకా పంపిణీకి భారత్ బయోటెక్ హక్కుల్ని సొంతం చేసుకుంది.
  • దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పది కోట్ల డోసులను సిద్ధం చేసింది భారత్ బయోటెక్.

ఇదీ చూడండి: సీరం టీకా 'కొవిషీల్డ్'​ ప్రత్యేకతలివే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.