ETV Bharat / bharat

ఆ గుడిలో మహాత్ముడికి నిత్యపూజలు!

author img

By

Published : Jan 30, 2021, 7:38 AM IST

MAHATMA GANDHI TEMPLE AT YADGIR DISTRICT IN KARNATAKA
నిత్యపూజలు జరిగే 'మహాత్మాగాంధీ' గుడి!

కరెన్సీ నోటు మీద, ఇలా నడిరోడ్డు మీద.. మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ అన్నాడో సినీకవి. గాంధీజీ పాటించిన సిద్దాంతాలు, ఆయన చూపించిన శాంతిమార్గంపై గౌరవంతో గుడిలో పెట్టి పూజిస్తున్నారు కర్ణాటకలోని ఓ గ్రామవాసులు. ఊర్లో ఏ తగాదా తలెత్తినా.. గాంధీజీ ఎదుటగా ఆ సమస్య సద్దుమణగాల్సిందే. ఇంతకీ గాంధీకి గుడికట్టిన ఆ ఊరేది? దాని విశిష్ఠతలేంటో ఓ సారి చూద్దాం...

యాద్​గిర్​ జిల్లాలోని మహాత్మాగాంధీ ఆలయం

జాతిపిత మహాత్మాగాంధీ గుడి ఇది. ఆయనకు నిత్యం పూజలు జరిగే చోటిది. యాద్​గిర్​ జిల్లాలోని బాలశెట్టిహాల్ గ్రామంలో ఉందీ ఆలయం. గాంధీజీ గౌరవార్థం హంపన్న సహూకార్.. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 1948లో ఈ గుడి నిర్మించారు. 70 ఏళ్లుగా ఈ గుళ్లో గాంధీజీకి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు గ్రామస్థులు.

"దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కర్ణాటకలో గాంధీజీ గుడి నిర్మితమైంది. మాజీ టీడీబీ సభ్యుడు హంపన్న సహూకార్ తన పదవీకాలంలో గుడి కట్టించి విగ్రహం ప్రతిష్ఠించారు."

- మనోహర్, గ్రామస్థుడు

పరిష్కార వేదికగా..

గాంధీజీ విగ్రహానికి గ్రామస్థులు నిత్యం పూజలు నిర్వహిస్తారు. ప్రజల మధ్య విభేదాలు తలెత్తినా ఈ ఆలయం వేదికగానే పరిష్కరించుకుంటారు. 68ఏళ్ల తర్వాత ఊరి ప్రజలంతా కలిసి ఆలయ పునరుద్ధరణ చేపట్టారు. గాంధీజీ గుడిని మరింత సుందరంగా మలచుకున్నారు.

"స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సహా.. ఇతర జాతీయ పండుగలప్పుడు ఇక్కడ సంబురాలు చేస్తాం. ఏ పండగ జరిగినా గ్రామస్థులంతా వచ్చి గాంధీజీకి పూజలు చేస్తారు."

- మల్లికార్జున క్రాంతి, సామాజిక కార్యకర్త

ఆదర్శంగా..

తమ ఊర్లో గాంధీకి గుడి ఉండడం గర్వకారణమంటున్నారు ఊరిప్రజలు. పోర్బందర్​లో గాంధీ గుడి నిర్మాణం జరిగిన తర్వాత ఈ గుడి కట్టినట్లు చెబుతారు.

మహాత్మాగాంధీ సిద్దాంతాలను ఊరిప్రజలు తప్పకుండా పాటిస్తారు. ప్రత్యేక శ్రద్ధతో పూజలు నిర్వహిస్తారు. గాంధీజీకి వీళ్లు చేసే పూజలు ఇతరుల్లో దేశభక్తి, స్ఫూర్తిని నింపుతున్నాయి.

ఇదీ చదవండి: ఆ అమ్మవారికి 'రాళ్లే' నైవేద్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.