ETV Bharat / bharat

భారత్​ మెరుపు వేగం.. చుక్కలు చూసిన చైనా

author img

By

Published : Aug 31, 2020, 5:07 AM IST

Updated : Aug 31, 2020, 11:05 AM IST

Indian warship in South China Sea
చైనాను కలవరపెట్టిన యుద్ధనౌక

గల్వాన్ ​లోయలో తన సైన్యంపై జరిగిన దాడి తర్వాత భారత్.. చైనాకు అనూహ్య రీతిలో షాకిచ్చింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి తన అగ్రశ్రేణి యుద్ధనౌకను పంపింది. చైనాకు విస్పష్ట హెచ్చరికలు చేసేందుకే ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఈ ఆపరేషన్ మొత్తాన్ని భారత్​ గోప్యంగా సాగించింది.

తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్ లోయలో జూన్​ 15న తన బలగాలపై దాడికి దిగిన చైనాకు విస్పష్ట హెచ్చరిక చేసేందుకు భారత్​ అనూహ్య చర్యను చేపట్టింది. మెరుపు వేగంతో స్పందిస్తూ.. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి తన అగ్రశ్రేణి యుద్ధనౌకను పంపింది. ఇది చైనా​కు కలవరం పుట్టించింది.

దక్షిణ చైనా సముద్రంపై చైనాకు అనేక దేశాలతో వివాదం ఉంది. అక్కడి సహజ వనరులపై కన్నేసిన చైనా.. ఆ సాగరంలో మెజార్టీ భాగం తనదేనంటోంది. సమీప దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2009 నుంచి చైనా ఈ ప్రాంతంలో సైనిక మోహరింపును పెంచింది. కృత్రిమ దీవులనూ నిర్మించింది.

గల్వాన్​ ఘర్షణ జరిగిన వెంటనే భారత్.. దక్షిణ చైనా సముద్రంలోకి తన అగ్రశ్రేణి యుద్ధనౌకను పంపినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ చర్య ఆశించిన ఫలితాన్ని ఇచ్చిందని వివరించాయి. భారత్​లో జరిగిన దౌత్య చర్చల్లో ఈ అంశాన్ని చైనా లేవనెత్తిందని తెలిపాయి. మన చర్యపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నాయి.

అమెరికాతోకలిసి

దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన భారీ యుద్ధనౌకలూ సంచరిస్తున్నాయి. అక్కడ మోహరించిన భారత యుద్ధనౌక.. రహస్య సాధనాల ద్వారా వీటితో కమ్యూనికేషన్​ సాగించింది. ఇతర దేశాల యుద్ధనౌకలూ తమ కదలికలను మన నౌకకు తెలియజేశాయి. ఈ ఆపరేషన్ మొత్తాన్ని భారత్ అత్యంత​ గోప్యంగా సాగించింది.

కొత్త ఆయుధాలు..

సాగర జలాల్లో తన పోరాట సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత నౌకాదళం వ్యూహ రచన చేస్తోంది. మలాకా జలసంధి నుంచి హిందూ మహాసముద్ర ప్రాంతాల్లోకి చైనా యుద్ధనౌకల రాకపోకలను సమర్థంగా పర్యవేక్షించేందుకు.. స్వయం చోదిత జలాంతర నౌకలు, మానవ రహిత వ్యవస్థలు, ఇతర సెన్సర్లను తక్షణం సమకూర్చుకోవాలని యోచిస్తోంది.

అండమాన్​ వద్ద సిద్ధం..

ఇదే సమయంలో అండమాన్​కు సమీపంలోని మలాకా జలసంధి వద్ద కూడా భారీగా యుద్ధనౌకలను భారత్ మోహరించింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించడానికి చైనా నేవీ అదే మార్గాన్ని ఉపయోగించుకుంటోంది. వీటి కదలికలను కట్టడి చేయడానికి ఈ చర్యను చేపట్టింది మన దేశం.

చైనా వాణిజ్య నౌకలు కూడా ఎక్కువగా ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి. తూర్పు, పశ్చిమ తీరాల్లో శత్రువులు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొట్టే సామర్థ్యం నౌకా దళానికి ఉంటుందని సంబంధింత వర్గాలు తెలిపాయి. ఆఫ్రికా ఖండంలోని జిబౌటీ వద్ద చైనా యుద్ధనౌకల కదలికలపై కన్నేసి ఉంచమని పేర్కొన్నాయి. మన మోహరింపుల వల్ల హిందూ మహాసముద్ర ప్రాంతంపై పూర్తి పట్టు సాధించడానికి వీలైందని వివరించాయి.

ఇదీ చూడండి:భూషణ్​కు శిక్షపై పునఃపరిశీలనకు విజ్ఞప్తి

Last Updated :Aug 31, 2020, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.