ETV Bharat / bharat

నిర్భయ అత్యాచారం రోజు ముఖేశ్​ దిల్లీలోనే లేడా?

author img

By

Published : Mar 17, 2020, 12:53 PM IST

Updated : Mar 17, 2020, 6:49 PM IST

ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు మరో ఎత్తుగడ వేశాడు నిర్భయ కేసు దోషి ముఖేశ్​​. నేరం జరిగిన రోజు తాను అసలు దిల్లీలోనే లేనని వ్యాజ్యం దాఖలు చేశాడు. మరణశిక్ష రద్దు చేయాలని కోరాడు. అయితే ఈ వ్యాజ్యాన్ని దిల్లీ కోర్టు కొట్టివేసింది.

Mukesh Singh moves court seeking quashing of death penalty
దిల్లీ కోర్టును ఆశ్రయించిన నిర్భయ దోషి ముఖేశ్​ సింగ్​

నిర్భయ కేసు దోషులను మరణశిక్ష నుంచి తప్పించేందుకు వారి న్యాయవాదులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్​ సింగ్ తరపు న్యాయవాది ఎమ్​ఎల్​ శర్మ దిల్లీ కోర్టును ఆశ్రయించారు. నిర్భయ అత్యాచారం జరిగిన సమయంలో ముఖేశ్ దిల్లీలోనే లేడన్న కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అందువల్ల అతడి మరణశిక్షను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ధర్మేంద్ర రాణా ముందు దాఖలు చేసిన పిటిషన్​లో... 'ముఖేశ్​ను 2012 డిసెంబర్​ 17న రాజస్థాన్​లో అరెస్టు చేసి దిల్లీకి తీసుకువచ్చారు. నిజానికి నిర్భయ హత్యాచారం జరిగిన డిసెంబర్ 16న అతను దిల్లీ నగరంలోనే లేడు' అని పేర్కొన్నారు. తిహార్ జైలు అధికారులు ముఖేశ్​ సింగ్​ను హింసించారని కూడా ఈ పిటిషన్​లో ఆరోపించారు 'న్యాయవాది' ఎమ్​ఎల్​ శర్మ.

ముఖేశ్​ అభ్యర్థనను తప్పుబట్టారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఉరి శిక్షను వాయిదా వేయించేందుకు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... పిటిషన్​ను కొట్టివేసింది.

కుట్రల మీద కుట్రలు

ఇదే కేసులో మిగిలిన ముగ్గురు దోషులు అక్షయ్​ కుమార్​, వినయ్​, పవన్​ గుప్తా...అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దిల్లీ కోర్టు తమకు విధించిన మరణ శిక్షపై స్టే విధించాలని ఐసీజేను కోరారు.

నిర్భయ దోషులు ముఖేశ్​ సింగ్​, పవన్​ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్​కుమార్ సింగ్​లను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలని ట్రయల్​ కోర్టు మార్చి 5న వారెంట్లు జారీ చేసింది. వీరి ఉరికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

Last Updated : Mar 17, 2020, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.