ETV Bharat / bharat

'వలస కూలీల కోసం రోజుకు 100 రైళ్లు నడపాలి'

author img

By

Published : May 12, 2020, 7:00 AM IST

లాక్​డౌన్​ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు సొంతూళ్లకు చేరుకునేందుకు రైల్వే శాఖ రోజుకు కనీసం 100 రైళ్లు నడపాలని కేంద్ర హోమంత్రిత్య శాఖ సూచించింది. ఈ విషయంపై రైల్వే నోడల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశం నిర్వహించినట్లు తెలిపింది.

MHA asks railways to run at least 100 special trains a day
'వలస కూలీల కోసం రోజుకు 100 రైళ్లు నడపాలి'

వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు కొన్ని వారాల పాటు.. రోజుకు కనీసం 100 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖను కోరింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. రైల్వే నోడల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విషయమై సమావేశమైనట్లు తెలిపారు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పీఎస్ శ్రీవాత్సవ. ఏ ఒక్క వలస కార్మికుడు కూడా కాలినడకన సొంత ఊళ్లకు పయనమవకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపినట్లు తెలిపారు.

ఎవరైనా రోడ్లపై కానీ, రైల్వే పట్టాలపై నడుస్తూ కనిపిస్తే వారిని బస్సులు, రైళ్లలో వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రయాణ ఏర్పాట్లు చేసే వరకు వారికి సమీప శిబిరాల్లో ఆశ్రయం ఇవ్వాలి . ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించాలి.

-పీఎస్ శ్రీవాత్సవ, కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 468 ప్రత్యేక రైళ్లు నడిచినట్లు చెప్పారు శ్రీవాత్సవ. ఆదివారం ఒక్కరోజే 101 రైళ్లలో వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ-టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్​ఫాంపైకి అనుమతిస్తామని, వైద్య పరిక్షలో కరోనా నెగిటివ్​ వచ్చినవారే ప్రయాణించేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. తప్పని సరిగా మాస్కులు ధరించాలని, కనీస జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా కారణంగా తాత్కాలికంగా రద్ధయిన రైల్వే సేవలను ఈనెల 12నుంచి పాక్షికంగా పునరుద్ధరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆరోజు దిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు రైళ్లు వెళతాయన్నారు.

విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్లో ఇప్పటివరకు 4,000 మందిని 23 విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చారు అధికారులు. ఆపరేషన్​ సముద్ర సేతులో భాగంగా భారత నావికాదళం ఓడ జలశ్వలో 698 మందిని మాల్దీవుల నుంచి కొచ్చి తీసుకొచ్చారు. మాలీ నుంచి 200 మంది ప్రయాణికులతో మరో ఓడ ఐఎన్​ఎస్​ మగర్​ బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.