ETV Bharat / bharat

'లాక్​డౌన్​తో లాభం లేదు- ఇంకా చాలా వ్యూహాలున్నాయి'

author img

By

Published : May 24, 2020, 10:30 AM IST

కరోనాపై పోరులో భారత్​ సహా ప్రపంచదేశాలు ప్రయోగించిన ఆయుధం లాక్​డౌన్​. ఇది వైరస్​ నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడిందని ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. అయితే భారత్​ లాంటి దేశానికి లాక్​డౌన్​తో ఏ మాత్రం ప్రయోజనం లేదని ప్రముఖ వైరాలజిస్ట్​ షాహిద్​ జమీల్​ అభిప్రాయపడ్డారు. కరోనా నియంత్రణకు మరిన్ని వ్యూహాలు ఉన్నాయని వివరించారు.

INTERVIEW WITH PROMINENT VIROLOGIST SHAHID JAMIL
'లాక్​డౌన్​తో ఉపయోగం లేదు- ఇంకా చాలా వ్యూహాలున్నాయి'

కొవిడ్‌-19పై పోరులో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఇక ఎంతమాత్రం భారత్‌కు ఉపయుక్తం కాదని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్‌ జమీల్‌ పేర్కొన్నారు. సమాజ చొరవతో చేపట్టే నియంత్రణ వ్యూహాలను అమల్లో తీసుకురావాలన్నారు. అజాగ్రత్తగా ఉంటే ఈ వైరస్‌ మళ్లీ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ బహుమతిని గెల్చుకున్న జమీల్‌కు మాలిక్యులర్‌ బయాలజీ, అంటు వ్యాధులు, బయోటెక్నాలజీ రంగంలో అపార అనుభవం ఉంది. వెల్‌కమ్‌ ట్రస్టుకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర బయోటెక్నాలజీ శాఖలోని ‘ఇండియా అలియన్స్‌’కు నేతృత్వం వహిస్తున్నారు. హెపటైటిస్‌ ఈ, హెచ్‌ఐవీలపై విస్తృత పరిశోధనలు చేశారు. కొవిడ్‌-19 విజృంభణతో తలెత్తిన పరిస్థితులపై ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

SHAHID JAMIL
షాహిద్‌ జమీల్‌, ప్రముఖ వైరాలజిస్టు

రెండు పరీక్షలు చేపట్టాలి

ప్రస్తుతం భారత్‌లో సరాసరిన ప్రతి 10 లక్షల మందిలో 1744 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేస్తున్నాం. ఇది చాలా తక్కువ. యాంటీబాడీ పరీక్షలు, నిర్ధారణ కోసం పీసీఆర్‌ పరీక్షలను చేయాలి. దీనివల్ల ప్రస్తుతం ఈ వైరస్‌ బారినపడిన వారితోపాటు కోలుకున్నవారినీ గుర్తించొచ్చు. ఆంక్షలను సడలించి, ఆర్థిక కార్యకలాపాలను క్రమంగా పునరుద్ధరించడానికి ఇది దోహదపడుతుంది. పరీక్షలను నిరంతరం చేపట్టి రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లను పర్యవేక్షించాలి.

ఇది సామాజిక వ్యాప్తే

కరోనా మహమ్మారి విషయంలో మనం చాలాకాలం కిందటే సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకున్నాం. ఐసీఎంఆర్‌ అధ్యయనం ప్రకారం చూసినా.. కొవిడ్‌-19 బాధితుల్లో 40 శాతం మందికి విదేశీ ప్రయాణాలు చేసిన చరిత్ర, రోగి వద్దకు వెళ్లిన దాఖలాలు లేవు. అందువల్ల ఇది కచ్చితంగా సామాజిక వ్యాప్తే.

ఇంకా లాక్‌డౌన్‌ ఎందుకు?

లాక్‌డౌన్‌ను ఇంకా కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉండదు. దీనికి బదులు సమాజ చొరవతో చేపట్టే స్థానిక లాక్‌డౌన్‌లు, ఐసోలేషన్లు, క్వారంటైన్లు అమల్లోకి రావాలి. ప్రజారోగ్య సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూడలేం.

హెర్డ్‌ ఇమ్యూనిటీ..

జనాభాలో ఎక్కువ మంది.. వైరస్‌ను తట్టుకునే శక్తిని కలిగి ఉండటాన్ని 'హెర్డ్‌ ఇమ్యూనిటీ'గా పేర్కొంటారు. కరోనా విషయంలో ఈ శక్తిని సంపాదించాలంటే జనాభాలో కనీసం 60% మంది ఈ వైరస్‌ నుంచి కోలుకొని ఉండటమో లేదా టీకా పొంది ఉండటమో చేయాలి. కొన్నేళ్లలో ఇది సాధ్యమవుతుంది. మన దేశంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించే ఉద్దేశంతో 60% మందిని ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురికావడానికి అనుమతిస్తే.. 83 కోట్ల మంది మహమ్మారి బారినపడతారు. వీరిలో 15% మందిని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చినా 12.5 కోట్ల ఐసోలేషన్‌ పడకలు అవసరమవుతాయి. మన వద్ద 30 లక్షల పడకలే ఉన్నాయి. ఐదు శాతం మందికి ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ తోడ్పాటు అవసరమనుకున్నా 4.2 కోట్ల ఆక్సిజన్‌ సపోర్ట్‌, ఐసీయూ పడకలు అవసరం. ఇది దేశ ఆరోగ్యపరిరక్షణ వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. కరోనా రోగుల్లో 0.5 శాతం మరణాల రేటు ఉన్నా.. అది 40 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది.

మళ్లీ వస్తుందా అన్నది చెప్పలేం

కొవిడ్‌-19 మహమ్మారి రెండోసారి, మూడోసారి విరుచుకుపడే అవకాశం ఉందా అన్నది ఊహించడం కష్టం. వ్యాధి గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోకుండా అలక్ష్యం వహిస్తే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీన్ని స్పానిష్‌ ఫ్లూతో పోల్చడం సరికాదు. ఎందుకంటే 1918లో ఆ మహమ్మారి వచ్చినప్పుడు.. అది ఎందువల్ల ఉత్పన్నమైందన్నది ఎవరికీ తెలియదు. 1931లో ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపును ఆవిష్కరించేవరకూ ఎవరూ వైరస్‌ను చూడలేదు. నేడు కొవిడ్‌-19 కారక సూక్ష్మజీవి, దాని వ్యాప్తిపైన, నివారణపైన మనకు మంచి అవగాహన ఉంది. మనం పరిస్థితులను అర్థం చేసుకుంటూ, నిపుణుల సలహా ప్రకారం నడుచుకోవాలి.

పర్యావరణ విధ్వంసం వల్లే..

వన్య ప్రాణులు, మానవులు సన్నిహితంగా మెలగడం ఎక్కువైనప్పుడు సార్స్‌-కోవ్‌-2 వంటి 'జూనోటిక్‌ వైరస్‌'లు మానవుల్లోకి ప్రవేశిస్తుంటాయి. అడవులను నరికేయడం వల్ల జంతువులు మానవ ఆవాసాలకు చేరువవుతాయి. గబ్బిలాలు కూడా మన చుట్టూ ఉన్న చెట్లపైకి చేరుతాయి. వాటి స్రవాలు, మలం ద్వారా వైరస్‌లు వ్యాప్తి చెందుతాయి. పశువులు, పెంపుడు జంతువుల ద్వారా ఈ వైరస్‌లు మానవులకు వ్యాప్తి చెందుతాయి. 1997-98లో నిపా వైరస్‌.. గబ్బిలాల నుంచి పందులకు వాటి నుంచి మానవులకు అది వ్యాప్తి చెందింది. సజీవ, మృత జంతువుల ఉండే వెట్‌ మార్కెట్ల వద్దకు మానవులు వెళ్లినప్పుడు కొవిడ్‌-19 వచ్చి ఉంటుంది.

పాత జీవనం మళ్లీ అవసరమా?

కరోనాకు ముందున్న ప్రపంచానికి మనం మరో 3-5 ఏళ్ల పాటు వచ్చే అవకాశం ఉండదు. పర్యావరణాన్ని ధ్వంసం చేసే ఆ పాత విధానానికి తిరిగి మళ్లడం అవసరమా అన్నది మనం విశ్లేషించుకోవడానికి ఇది మంచి అవకాశం. మన జీవన విధానాన్ని సంస్కరించుకోవాల్సిన ఆవశ్యకతను కొవిడ్‌-19 చాటిచెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.