ETV Bharat / bharat

సరిహద్దు ఘర్షణపై భారత్​- చైనా మాటలయుద్ధం

author img

By

Published : Jun 17, 2020, 7:08 AM IST

తూర్పు లద్దాక్​లో మంగళవారం జరిగిన ఘటనపై ఇరుదేశాలు స్పందించాయి. ఇరుపక్షాలు అత్యున్నత స్థాయిలో చేసుకున్న ఒప్పందానికి చైనా సైన్యం కట్టుబడి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే వాస్తవాలను కప్పిపుచ్చేందుకు యత్నించింది చైనా. భారత సైనికులే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని పేర్కొంది.

india china
సరిహద్దుపై భారత్​- చైనా మాటలయుద్ధం

భారత్‌తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వద్ద యథాతథ పరిస్థితులను మార్చేందుకు చైనా సైన్యం ఏకపక్షంగా చేసిన ప్రయత్నం వల్లే తాజా ఘర్షణ నెలకొందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ చెప్పారు. దీనివల్ల రెండు వైపులా ప్రాణనష్టం జరిగిందన్నారు. ఇరు పక్షాలూ అత్యున్నత స్థాయిలో చేసుకున్న ఒప్పందానికి చైనా సైన్యం కట్టుబడి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. 'సరిహద్దు నిర్వహణ విషయంలో భారత్‌ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. ఎల్‌ఏసీ వెంబడి మా భూభాగంలోనే కార్యకలాపాలను సాగిస్తున్నాం. చైనా కూడా ఇలాగే నడుచుకుంటుందని ఆశిస్తున్నాం. సరిహద్దుల్లో శాంతిని కాపాడాల్సిన అవసరం ఉంది. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. అయితే ఇదే సమయంలో భారత సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను రక్షించుకునేందుకు కట్టుబడి ఉన్నాం' అని స్పష్టంచేశారు.

'భారత సైనికులే కవ్వించారు'

చైనాభారత సైనికులే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని చైనా బుకాయింపునకు దిగింది. "రెండు దేశాల బలగాలు అత్యున్నత స్థాయిలో సమావేశమై, వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఉద్రిక్తతలను తగ్గించే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే సోమవారం భారత బలగాలు దీన్ని ఉల్లంఘించి, రెండుసార్లు ఎల్‌ఏసీని దాటాయి. దీనివల్ల తీవ్రస్థాయి భౌతిక ఘర్షణ చోటుచేసుకుంది. దీనిపై భారత్‌కు తీవ్ర నిరసన తెలియజేశాం" అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో పేర్కొన్నారు. ఈ ఘర్షణలో తమ సైనికులు ఎంతమంది చనిపోయారన్నది ఆయన వెల్లడించలేదు. మరోవైపు గాల్వాన్‌ లోయపై తమకే సార్వభౌమాధికారం ఉందని చైనా సైన్యంలోని పశ్చిమ విభాగం అధికార ప్రతినిధి కర్నల్‌ ఝాంగ్‌ షుయిలీని ఉటంకిస్తూ ఆ దేశ అధికారిక మీడియా 'గ్లోబల్‌ టైమ్స్‌' పేర్కొంది. భారత బలగాలు తమ హామీని ఉల్లంఘించి సోమవారం ఆ లోయ ప్రాంతంలో చొరబడినట్లు ఆయన ఆరోపించారు.

ఇదీ చూడండి: గాల్వన్​ లోయలో ఆ రాత్రి ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.