ETV Bharat / bharat

'భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో మైలురాయి'

author img

By

Published : Dec 10, 2020, 4:15 PM IST

పార్లమెంటు నూతన భవనానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ భూమి పూజ చేసిన ప్రధాని.. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొత్త పార్లమెంటు భవనం.. ఆత్మ నిర్భర్​ భారత్​ నిర్మాణానికి సాక్షిగా నిలుస్తుందని అన్నారు మోదీ. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. దేశ విభిన్నతను చాటేలా నిర్మించే ఈ భవన నిర్మాణం 2022కల్లా పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

new one will witness making of 'Aatmanirbhar Bharat': PM
'భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో మైలురాయి'

ప్రస్తుత పార్లమెంట్ భవనం స్వాతంత్ర్యం తర్వాత దేశానికి దశాదిశ నిర్దేశిస్తే... నూతన పార్లమెంట్‌ భవనం ఆత్మనిర్భర్‌ భారత్ నిర్మాణానికి సాక్షిగా నిలవనుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భానికి ఈ భవనం ప్రతీక అవుతుందని చెప్పారు. ఇది దేశ ప్రజలందరూ గర్వించాల్సిన క్షణమని అన్నారు మోదీ. కొత్త పార్లమెంట్‌ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ ప్రసంగించారు.

పార్లమెంట్​ పనితీరు మెరుగుదలకు కావాల్సిన అన్ని హంగులు, సౌకర్యాలు కొత్త భవనంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.

''ఈ రోజు భారతీయులకు చారిత్రక దినం. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. 130 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ సుదినం. ఇది దేశ ప్రజలందరూ కలిసి నిర్మించుకుంటున్న భవనం. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భానికి గుర్తుగా ఈ భవనం నిలవనుంది. ప్రస్తుత పార్లమెంట్‌ భవనంలోనే భారత రాజ్యాంగ రచన జరిగింది. బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, మరెందరో మహనీయులు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో రాజ్యాంగ రచన పూర్తి చేశారు. చరిత్రను గౌరవిస్తూనే వాస్తవ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు నూతన భవనానికి శంకుస్థాపన చేశాం.

నూతన పార్లమెంట్‌ భవనంలో అనేక విధాలైన సౌకర్యాలు రానున్నాయి. పార్లమెంట్‌ పనితీరు మెరుగుదలకు కావాల్సిన అన్ని హంగులు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుత పార్లమెంట్ భవనం స్వాతంత్ర్యం తర్వాత దేశానికి దశదిశ నిర్దేశించింది. నూతన పార్లమెంట్‌ భవనం ఆత్మనిర్భర్‌ భారత్‌కు దిశా నిర్దేశం చేయనుంది.''

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

'ప్రజాస్వామ్యం అసాధ్యమన్నారు'

కొత్త పార్లమెంటు భవనం.. 21వ శతాబ్దంలో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని. పార్లమెంటు హౌస్​లోకి తొలిసారి 2014లో ఎంపీగా అడుగుపెట్టిన క్షణాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పుడు.. ఈ ప్రజాస్వామ్య దేవాలయానికి శిరస్సు వంచి నమస్కరించానని చెప్పారు.

దేశ ప్రజాస్వామ్య ప్రస్థానానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉందని వ్యాఖ్యానించారు ప్రధాని. రుగ్వేదంలో కూడా ప్రజాస్వామ్యం ప్రస్తావనకు తెచ్చారని, భారతదేశ సమాజ మూలాల్లోనే ప్రజాస్వామ్యం విధానాలు ఉన్నాయని తెలిపారు. మన ప్రతి నిర్ణయంలో దేశమే ప్రథమం అనే భావన ఉండాలని అన్నారు.

''స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ప్రజాస్వామ్యం ఓ విఫలప్రయత్నం అని చాలా మంది అన్నారు. ఇప్పుడు వాళ్లందరూ చూస్తూ ఉండగానే ప్రజాస్వామ్య భారతం అద్భుతంగా పురోగమిస్తోంది. మాగ్నా కార్టా కంటే ముందే భారతదేశంలో హక్కుల కోసం ప్రయ్నతాలు జరిగాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి అంతకు ముందు నుంచే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. దేశ ప్రజాస్వామ్య ప్రస్థానానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. అప్పటి నుంచే ప్రజాస్వామ్య ప్రయాణానికి బాటలు వేశారు. 10వ శతాబ్దంలో తమిళనాడులోని ఓ గ్రామంలో పంచాయతీ వ్యవస్థ గురించి సవివరంగా పేర్కొన్నారు. రుగ్వేదంలో కూడా ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావన ఉంది. భారతదేశం సమాజ మూలాల్లోనే ప్రజాస్వామ్యం విధానాలు ఉన్నాయి. భారత దేశ తత్వచింతన అంతా ప్రజాస్వామ్యం ఆధారంగానే సాగింది. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవవస్థలకు మన దేశం పురిటిగడ్డ. దేశ ప్రజాస్వామ్య ప్రయాణం ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా సాగుతోంది. దేశంలో ప్రతి ఎన్నికకూ ఓటింగ్‌ శాతం పెరుగుతూ వస్తోంది. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంపై మాత్రం ఎవరికీ వ్యతిరేకత లేదు. సభ లోపల అయినా, బయట అయినా సంవాదాలు దేశం కోసమే. మన ప్రతి నిర్ణయంలో 'దేశం మొదట' అన్న భావనే ఉండాలి. పార్లమెంట్‌ నూతన భవనం కూడా ఒక దేవాలయమే. ఈ దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చేయాల్సింది రానున్న ప్రజాప్రతినిధులే.''

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

అంతకుముందు... నూతన పార్లమెంటు భవనం ప్రాంగణంలో తొలుత భూమిపూజ నిర్వహించిన మోదీ.. శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ మతాలకు చెందిన పెద్దలు 'సర్వ ధర్మ ప్రార్థన'ను నిర్వహించారు. దేశ విభిన్నతను చాటిచెప్పేలా నిర్మించే ఈ భవనాన్ని 2022కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

new one will witness making of 'Aatmanirbhar Bharat
నరేంద్ర మోదీ
new one will witness making of 'Aatmanirbhar Bharat
నూతన పార్లమెంటు భవనానికి భూమిపూజ
new one will witness making of 'Aatmanirbhar Bharat
శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ప్రధాని

ఇదీ చూడండి: పార్లమెంట్ నూతన​ భవనానికి శంకుస్థాపన

లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, కేంద్రమంత్రులు అమిత్​ షా, రాజ్​నాథ్​తో పాటు వివిధ దేశాల రాయబారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

new one will witness making of 'Aatmanirbhar Bharat
కార్యక్రమానికి హాజరైన అమిత్​ షా, రాజ్​నాథ్​
new one will witness making of 'Aatmanirbhar Bharat
పార్లమెంటు భవనానికి భూమిపూజ

ఇదీ చూడండి: ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు సాక్ష్యంగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.