ETV Bharat / bharat

కేరళలో కుండపోత- మహారాష్ట్రకు భారీ వర్ష సూచన

author img

By

Published : Aug 10, 2020, 10:43 AM IST

భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇడుక్కి దుర్ఘటలో మొత్తం మృతుల సంఖ్య 43కి చేరింది. మరోవైపు, మహారాష్ట్రకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Foods ravage in South India: Red alert sounded in seven districts of Karnataka
కేరళ, మహారాష్ట్రకు మళ్లీ భారీ వర్ష సూచన

కొద్దిరోజులుగా భారీ వర్షాలతో తడిసి ముద్దయిపోయిన మహారాష్ట్రకు మళ్లీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయువ్య దిశలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముంబయి సహా పరిసర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారే అవకాశం ఉందని తెలిపింది.

సెంట్రల్ మహారాష్ట్ర సహా తీర ప్రాంతాలకు ఆదివారం నుంచి వర్షం పొంచి ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. శనివారం పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసినట్లు వెల్లడించారు.

కేరళలో ఉగ్రరూపం

మరోవైపు, భారీ వర్షాలు కేరళను ముంచెత్తుతున్నాయి. ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల మధ్య.. లోతట్టు ప్రాంతాల్లో వరద పరిస్థితిపై ఆందోళనలు నెలకొన్నాయి.

ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఆదివారం మరో 17 మృతదేహాలను వెలికితీశారు. ఫలితంగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 43కి చేరింది. వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

వరదల కారణంగా కొల్లాయం జిల్లాలో ఆదివారం ఓ ట్యాక్సీ డ్రైవర్ నీటిలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. కాసర్​గోడ్, కన్నూర్, కోజికోడ్, అలప్పుజలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు నీట మునిగిపోయారని వెల్లడించారు.

వర్షాలు

కాసర్​గోడ్, కన్నూర్, వయనాడ్, కోజికోడ్, మలప్పురం, అలప్పుజ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. రానున్న 24 గంటల్లో 20 సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్​ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆనకట్టలు తెరవడం మూలాన ప్రవాహ వేగం ప్రమాదకరంగా ఉంటోంది. నదుల్లో నీటి మట్టం పెరగడం వల్ల వరద పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది.

నీటి మట్టం 983.45 మీటర్లకు చేరడం వల్ల.. పంబ డ్యామ్​ ఆరు గేట్లను తెరిచారు. తొమ్మిదిగంటల పాటు నీటిని వదిలినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నీటిమట్టం 982కి చేరినట్లు స్పష్టం చేశారు.

సహాయక చర్యలు

ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను రక్షించేందుకు మత్స్యకారుల సహకారాన్ని ఉపయోగించుకుంటున్నారు. కొల్లం జిల్లాలోని పథనంతిట్ట, తిరువల్ల, అడూర్ ప్రాంతాల్లో 15 పడవలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

ఎర్నాకులం జిల్లాలో 1,203 మందిని పునరావాస శిబిరాలకు తరలించినట్లు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో వృద్ధులకు ప్రత్యేక క్యాంప్​లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: సబ్​మెరైన్ కేబుల్ వ్యవస్థను ప్రారంభించనున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.