ETV Bharat / bharat

కరోనాపై 'ప్లాస్మా' పరీక్ష.. దిల్లీ ప్రభుత్వానికే తొలి అనుమతి

author img

By

Published : Apr 17, 2020, 6:47 AM IST

Doctors will conduct the clinical trial of plasma enrichment technique to treat severely-ill coronavirus patients: Delhi CM Arvind Kejriwal
కరోనాపై పోరు: ప్లాస్మా పరీక్షలకు దిల్లీ ప్రభుత్వం సిద్ధం

కొవిడ్‌-19 రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు దిల్లీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కరోనా వ్యాప్తిని నియంత్రణలోకి తెచ్చేందుకు దేశంలోనే తొలిసారి 'కాన్వలసెంట్‌ ప్లాస్మా' విధానాన్ని బాధితులపై ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఇందుకు కేజ్రీవాల్​ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.

కరోనా సోకిన వారికి ప్రయోగాత్మకంగా ప్లాస్మా చికిత్స చేయనున్నట్లు.. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం అనుమతులు కూడా పొందినట్లు చెప్పారు. మూడు నాలుగు రోజుల్లో ఈ ప్రయోగాత్మక విధానాన్ని అమలుచేస్తామని స్పష్టం చేశారు. ఇది విజయవంతమైతే విషమ పరిస్థితుల్లో ఉన్న చాలా మందిని కొవిడ్​-19 నుంచి రక్షించవచ్చన్నారు.

ఏప్రిల్‌ మొదటి వారంలో వివిధ ఆస్పత్రుల్లో చేరిన బాధితులు చాలా వరకు కోలుకుంటున్నారని, మరో రెండు మూడు రోజుల్లో వారిని డిశ్చార్జి చేస్తామని తెలిపారు. అందరూ కలిసి కట్టుగా పని చేయడం వల్లే కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించగలమని కేజ్రీవాల్​ అన్నారు. దిల్లీలో ఇప్పటి వరకు 1,640 మంది ఈ వైరస్‌ బారిన పడగా.. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 42 మంది కోలుకున్నారు.

ఏం చేస్తారంటే...?

కరోనాకు ఇప్పటి వరకు వాక్సిన్‌ లేకపోవడం వల్ల అందరి దృష్టి 'ప్లాస్మా థెరపీ'పై పడింది. దీనిలో భాగంగా వైరస్‌ బారిన పడి కోలుకున్న వ్యక్తుల నుంచి రక్తం తీసుకుంటారు. దాన్నుంచి ప్లాస్మాను వేరు చేసి, యాంటీబాడీస్‌ను సంగ్రహిస్తారు. వాటిని బాధితుడికి ఎక్కిస్తారు. దాత ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తొలుత అతడి స్వాబ్‌టెస్ట్‌ నెగటివ్‌ రావాలి. అతడు రోగం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత 2 వారాలపాటు వేచి చూడాలి. ఇవి కాదంటే.. దాతకు గత 28 రోజుల్లో కరోనా లక్షణాలు ఉండకూడదు. ఇందులో ఏదో ఒకటి తప్పని సరి. ప్రస్తుతం భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) ఆధ్వర్యంలో చాలా పరిశోధనా సంస్థలు.. ప్లాస్మా క్లీనికల్​ ట్రయల్స్​లో పాల్గొంటున్నాయి.

ఇదీ చూడండి...

కరోనాపై పోరులో సరికొత్త అస్త్రం 'బ్లడ్ ప్లాస్మా'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.