ETV Bharat / bharat

దిల్లీ అల్లర్ల ఛార్జిషీట్- ఏచూరిపై అభియోగాలు

author img

By

Published : Sep 13, 2020, 5:52 AM IST

దిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో నమోదు చేసిన అనుబంధ ఛార్జిషీట్​లో సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై అభియోగాలు మోపారు పోలీసులు. సీఏఏ వ్యతిరేక నిరసనకారులను రెచ్చగొట్టారనే ఆరోపణలు నమోదు చేశారు. జేఎన్​యూ, జామియా మిలియా విద్యార్థులు ఇచ్చిన స్టేట్​మెంట్ ఆధారంగా ఈ అభియోగపత్రం రికార్డు చేశారు.

Delhi riots: Police mention Yechury, Yogendra Yadav, Jayati Ghosh, in supplementary charge sheet
దిల్లీ అల్లర్ల ఛార్జిషీట్- ఏచూరిపై అభియోగాలు

దిల్లీలో ఫిబ్రవరి నెలలో జరిగిన అల్లర్లలో పోలీసులు అనుబంధ ఛార్జిషీట్ నమోదు చేశారు. సీఏఏ వ్యతిరేక నిరసనకారులను సమీకరించడం సహా వారిని రెచ్చగొట్టారనే ఆరోపణలతో సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, స్వరాజ్ అభియాన్ లీడర్ యోగేంద్ర యాదవ్, ఆర్థికవేత్త జయతీ ఘోష్, దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ పేర్లను అనుబంధ ఛార్జిషీట్​లో చేర్చారు.

సీఏఏ, ఎన్​ఆర్​సీలను ముస్లింలకు వ్యతిరేకమనే భావన కలగజేస్తూ సమాజంలో అసంతృప్తిని వ్యాప్తి చేయడం, భారత ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆందోళనలు నిర్వహించడం సహా తీవ్రమైన పోకడలు అవలంబించేలా నిరసనకారులను కోరినట్లు అభియోగాలు మోపారు.

ఏచూరీ, యోగేంద్ర యాదవ్​లతో పాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ రావణ్, కార్యకర్త ఉమర్ ఖలీద్, మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్​ పేర్లు సైతం అనుబంధ ఛార్జిషీట్​లో ప్రస్తావించారు.

విద్యార్థుల వాంగ్మూలం

మహిళా విద్యార్థి విభాగం 'పింజ్రా తోడ్' సహా జేఎన్​యూ విద్యార్థులు దేవాంగన కలితా, నటాషా నర్వాల్, జామియా మిలియాకు చెందిన విద్యార్థి గుల్ఫిషా ఫాతిమా ఇచ్చిన స్టేట్​మెంట్ ఆధారంగా పోలీసులు ఈ అభియోగాలు నమోదు చేశారు.

ఘోష్, అపూర్వానంద్​తో పాటు డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత రాహుల్ రాయ్​లు తమకు మెంటార్​లుగా వ్యవహరించారని.. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడమే కాకుండా ఎలాంటి తీవ్రమైన ఆందోళనలు చేపట్టేందుకూ వెనకాడొద్దని వీరు చెప్పినట్లు విద్యార్థులు ఒప్పుకున్నారని ఛార్జిషీట్​లో పోలీసులు పేర్కొన్నారు. ఈ ముగ్గురి ఆదేశాల మేరకు డిసెంబర్​లో దర్యాగంజ్​ నిరసనలు, ఫిబ్రవరి 22న జాఫ్రాబాద్​లో రోడ్ బ్లాక్ చేసినట్లు విద్యార్థులు వెల్లడించారని ఛార్జిషీట్​లో స్పష్టం చేశారు.

విద్వేష ప్రసంగాలపై చర్యలేవి: ఏచూరి

ఈ ఛార్జిషీట్​పై స్పందించిన సీతారాం ఏచూరి.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రం, హోంశాఖ అధీనంలో దిల్లీ పోలీసు శాఖ పనిచేస్తుందని.. వీరి చట్టవిరుద్ధ కార్యకలాపాలు భాజపా అగ్ర నాయకత్వ రాజకీయాల ప్రత్యక్ష ఫలితాలేనని విమర్శించారు. ప్రధాన రాజకీయ పార్టీలు చేసే న్యాయమైన, శాంతియుత నిరసనలకు ప్రభుత్వం భయపడుతోందన్నారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అల్లర్ల సందర్భంగా చేసిన విద్వేష ప్రసంగాలపై చర్యలెందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఏచూరీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.