ETV Bharat / bharat

కరోనా గురించి మీరు విన్న వాటిలో ఏది నిజం?

author img

By

Published : Mar 30, 2020, 11:20 AM IST

Updated : Mar 30, 2020, 2:15 PM IST

కరోనాపై దేశ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వారిలో ఉన్న సందేహాలూ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న పోస్టులు ఆ భయాన్ని మరింత పెంచుతున్నాయి. మరి వాటిల్లో నిజమెంత?

covid-19-mythbusters-facts-about-transmission-of-coronavirus
కరోనాపై పోరు: ఏది నిజం.. ఏది అబద్ధం?

"వెల్లుల్లిని వేడి వేడి నీళ్లలో కలుపుకుని తాగండి.. కరోనా​ మిమ్మల్ని ఏం చేయలేదు. వైరస్​ మీ దరి చేరకుండా ఉండాలంటే.. గోమూత్రం తీసుకోవాల్సిందే".. ఇలా రోజు వాట్సాప్​, ఇన్​స్టా, ఫేస్​బుక్​లో ఎన్నో సందేశాలు వచ్చి చేరుతున్నాయి. వైరస్​ భయంతో కొందరు వీటిని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరి వెల్లుల్లి, గోమూత్రం పనిచేయదా? ఇలాంటి వాటిల్లో నిజం ఎంత?

  • వేడి, తేమ వాతావరణాల్లో...

కరోనా వైరస్​కు వాతావరణంతో సంబంధం లేదు. ప్రస్తుతమున్న ఆధారాల ప్రకారం.. ఈ ప్రపంచ మహమ్మారికి గ్రామం, నగరం, రాష్ట్రం అన్న భేదం లేదు. వ్యాక్సిన్​ కూడా లేకపోవడం వల్ల వైద్యుల సలహాలను పాటించడమే మేలైన మార్గం. వాటిల్లో ముఖ్యమైనది.. చేతులు శుభ్రం చేసుకోవడం. ఇందుకు సబ్బులు, శానిటైజైర్లను ఉపయోగించాలి. ఫలితంగా చేతులపై ఉన్న వైరస్​ మీ ముఖం, నోరు, ముక్కు ద్వారా​ శరీరంలోకి వెళ్లకుండా ఉంటుంది.

  • మంచులో వైరస్​ బతకలేదా?

మంచు, చలి వాతావరణాల్లో వైరస్​ చచ్చిపోతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. బయట ఎలా ఉన్నా.. మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత మాత్రం 36.5-37 డిగ్రీల సెల్సియస్ మధ్యలోనే​ ఉంటుంది. మిమ్మల్ని మీరు వైరస్​ నుంచి కాపాడుకోవాలంటే చేతులను నిత్యం శుభ్రం చేసుకోవాల్సిందే. అల్కహాల్​తో తయారు చేసిన హ్యాండ్​ రబ్​ లేదా సబ్బును వాడటం మంచిది.

  • వేడి నీళ్లతో స్నానం చేస్తే..

వేడి నీళ్లతో స్నానం చేసి.. హమ్మయ్య! వైరస్​ రాదు అనుకోవడం అర్థం లేని పని. మీ శరీర ఉష్ణోగ్రత 36.5-37 డిగ్రీల మధ్యలోనే ఉంటుంది. మరీ ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేస్తే.. చర్మం కాలిపోయే ప్రమాదం ఉంటుంది. వైరస్​ మీ దరి చేరకూడదనుకంటే.. తప్పని సరిగా చేతులను నిత్యం శుభ్రం చేసుకోవాల్సిందే.

  • దోమ కాటుతో వైరస్​?

కరోనా వైరస్​.. దోమల ద్వారా మనుషుల్లో వ్యాపిస్తుంది అనడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. వైరస్​ బారిన పడ్డ వ్యక్తి.. దగ్గితే, తుమ్మితే.. వారి లాలాజలం ఇతరులపై పడి కరోనా సోకుతుంది. వైరస్​ నుంచి బయటపడటానికీ ఓ మార్గం ఉంది. అదే... చేతులను నిత్యం శుభ్రంగా కడుక్కోవడం.

  • హ్యాండ్​ డ్రయర్లతో..

హ్యాండ్​ డ్రయర్లతో పని జరగదు. వైరస్​ను చంపే శక్తి వాటికి లేదు. అందువల్ల.. చేతులను సబ్బులు, శానిటైజర్లు, ఆల్కహాల్​తో రూపొందించిన రబ్​తో శుభ్రం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు.

  • యూవీ డిసిన్​ఫెక్షన్​ ల్యాంప్స్​ చాలా?

యూవీ(అల్ట్రా వయ్​లెట్​) డిసిన్​ఫెక్షన్​ ల్యాంప్స్​ను అస్సలు వాడకూడదు. వాటి వల్ల చర్మ సమస్యలు అధికమవుతాయి.

  • థర్మల్​ స్కానింగ్​ చేస్తే సరిపోతుందా?

కరోనా వైరస్​తో జ్వరం బారినపడ్డ వారిని థర్మల్​ స్కానర్స్​ ద్వారా గుర్తించవచ్చు. అయితే.. లక్షణాలు బయటపడటానికి 2 నుంచి 10రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో.. వైరస్​ బారిన పడ్డా.. జ్వరం లక్షణాలు లేకపోతే.. రోగులను గుర్తించడానికి థర్మల్​ స్కానర్లు పనికిరావు.

  • ఆల్కహాల్​, క్లోరిన్​ జల్లుకుంటే?

ఆల్కహాల్​, క్లోరిన్​ను శరీరం మొత్తంపై జల్లుకోవడం వల్ల వైరస్​ సోకదు అన్నది అపోహ మాత్రమే. ఇలాంటి పనులు చేస్తే.. నోరు, కళ్లకు ఎంతో ప్రమాదం. కొత్త రోగాలు తెచ్చుకున్నట్టవుతుంది. ఆల్గహాల్​, క్లోరిన్​తో నేలను శుభ్రం చేయచ్చు. కానీ మనపై ఉపయోగించాలంటే వైద్యుల పర్యవేక్షణ ఉండాల్సిందే.

  • ఆ వ్యాక్సిన్లు పనిచేస్తాయా?

నిమోనియా వ్యాక్సిన్​లు కరోనాపై యుద్ధంలో పనిచేయవు. ఈ ప్రమాదకర వైరస్​కు ప్రత్యేక వ్యాక్సిన్​ ఉండాల్సిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) పర్యవేక్షణలో అనేక మంది పరిశోధకులు వ్యాక్సిన్​ను కనుగొనే పనిలో ఉన్నారు. నిమోనియా వ్యాక్సిన్​లతో వైరస్​ను అరికట్టలేనప్పటికీ.. మీ ఆరోగ్యం దృష్ట్యా వాటిని వినియోగించుకోవాలి.

  • సెలైన్​తో ముక్కును శుభ్రం చేసుకుంటే?

తరచూ సెలైన్​తో మీ ముక్కును శుభ్రం చేసుకుంటే వైరస్​ సోకదని వినే ఉంటారు. అందులోనూ నిజం లేదు. ఈ విధానం వైరస్​తో విఫలమవ్వచ్చు కానీ.. సాధారణ జలుబు తగ్గడానికి ఉపయోగపడుతుంది. మళ్లీ శ్వాస సంబంధిత వ్యాధులకు ఇది పని చేయదు.

  • వెల్లుల్లి తింటే చాలదా?

వెల్లుల్లి తింటే చాలు వైరస్​ మనలోకి ప్రవేశించలేదు అనుకోవడమూ పొరపాటే. వెల్లుల్లి మన ఒంటికి చాలా మంచిది. కానీ వైరస్​ను నయం చేస్తుందన్నది మాత్రం అవాస్తవం.

  • వైరస్​ సోకితే మరణం తథ్యమా?

వైరస్​ సోకిన ప్రతి ఒక్కరూ మరణిస్తారు అనుకోవడంలో నిజం లేదు. అనేక మంది మహమ్మారిని జయిస్తున్నారు. అయితే అప్పటికే మధుమేహం, ఉపిరితిత్తుల, గుండె సమస్య ఉన్న వారు వైరస్​తో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతరులూ తగిన జాగ్రత్తలు పాటించాలి.

  • మరి యాంటీబయాటిక్స్​?

యాంటీబయాటిక్స్​ బ్యాక్టీరియాపైనే పని చేస్తాయి. వైరస్​పై కాదు. అందువల్ల వాటిని వైరస్​ చికిత్సకు వినియోగించకూడదు. అయితే వైరస్​ బారిన పడి ఆసుపత్రిలో చేరితే.. మీకు యాంటీబయాటిక్స్​ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వైరస్​ ఉన్న మీ శరీరంలో బ్యాక్టీరియా కూడా చేరకూడదనే ఇలా చేస్తారు.

  • ఏ మందులు వాడాలి?

వైరస్​ చికిత్సకు ఇప్పటివరకు ప్రత్యేక ఔషధాలు లేవు. కానీ వైరస్​ బారినపడ్డ వారికి చికిత్స అందివ్వడం అవసరం. వైరస్​ లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి వైద్యులు కొన్ని పద్ధతులను అనుసరిస్తున్నారు. రోగి పరిస్థితిని బట్టి ఈ పద్ధతులు మార్చుతారు.

ఇదీ చూడండి:- తల్లి పాల ద్వారా కరోనా వైరస్​ వ్యాపిస్తుందా?

Last Updated :Mar 30, 2020, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.